వడ్డీపై పన్ను మినహాయింపు
బంగారం డిపాజిట్ స్కీమ్...
ముసాయిదా పథకం, మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
⇒ కనీస డిపాజిట్ 30 గ్రాములు..
⇒ డిపాజిట్లకు కనీన వ్యవధి ఏడాది
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు, వివిధ సంస్థల వద్ద ఉత్పాదకత లేకుండా పడిఉన్న బంగారంలో కొంత మొత్తాన్నైనా చలామణీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ముసాయిదాను, సంబంధిత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
దీని ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బంగారంపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నులూ ఉండవు. ఆదాయపు పన్ను(ఐటీ)తో పాటు మూలధన లాభాల పన్ను నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ప్రజలు/సంస్థలు కనిష్టంగా 30 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసే వీలుంటుంది. ఈ స్కీమ్‌పై వచ్చే నెల 2వ తేదీకల్లా ప్రజలు, సంబంధిత వర్గాలంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే, ప్రతిపాదిత స్కీమ్‌ను తొలుత కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
పథకం ఎలా పనిచేస్తుందంటే...
⇒ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థ తమవద్దనున్న బంగారాన్ని ముందుగా బీఐఎస్ ధ్రువీకృత హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో విలువ కట్టించాలి.
⇒ ఆతర్వాత బ్యాంకుల్లో ఒక ఏడాది కనీస కాలపరిమితితో గోల్డ్ సేవింగ్స్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో తమ దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్ చేయాలి.
⇒ డిపాజిట్ చేసిన పసిడి విలువకు అనుగుణంగా వడ్డీని నగదు లేదా బంగారం యూనిట్ల రూపంలో పొందొచ్చు. ఖాతా తెరిచిన 30/60 రోజుల తర్వాత ఖాతాదారులకు వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీ ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం బ్యాంకులకు వదిలేయాలని స్కీమ్‌లో ప్రతిపాదించారు.
⇒ అదేవిధంగా గోల్డ్ డిపాజిటర్లకు అసలు, వడ్డీ చెల్లింపు అనేది బంగారం రూపంలోనే బ్యాంకులు విలువకడతాయి.
⇒ మెచ్యూరిటీ తర్వాత లేదా ముందైనా కస్టమర్లు తాము ఖాతా నుంచి నగదు రూపంలో లేదా బంగారం రూపంలోగాని డిపాజిట్లను వెనక్కితీసుకునే(రిడంప్షన్) ఆప్షన్ ఉంటుంది. అయితే, ఈ ఆప్షన్‌ను డిపాజిట్ చేసేటప్పుడే ఎంచుకోవాలి.
⇒ స్కీమ్ కనీస కాలపరిమితి ఏడాది. ఫిక్సిడ్ డిపాజిట్ల మాదిరిగానే లాక్-ఇన్ వ్యవధికి ముందే తీసుకునే వెసులుబాటు ఇస్తారు.
⇒ ఉదాహరణకు ఒక కస్టమర్ 100 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసిన పక్షంలో వడ్డీరేటు 1 శాతంగా గనుక నిర్ణయిస్తే.. నిర్దేశిత కాల వ్యవధి తర్వాత(మెచ్యూరిటీ) ఖాతాలో 101 గ్రాముల పసిడి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
⇒ బ్యాంకులు ఇతర డీలర్లు ఈ విధంగా లభించిన బంగారాన్ని కరిగించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు వీలవుతుంది. నాణేల రూపంలో కస్టమర్లకు విక్రయించగలుగుతాయి.
⇒ అదేవిధంగా డిపాజిట్ల రూపంలో వచ్చే పసిడిని విక్రయించి విదేశీ కరెన్సీని కూడా బ్యాంకులు పొందగలుగుతాయి. ఎగుమతి/దిగుమతిదారుల అవసరాలకు ఈ విదేశీ కరెన్సీని ఉపయోగించొచ్చు. బంగారం దిగుమతులు తగ్గి.. దేశీయంగా ఉన్న పసిడినే మళ్లీ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
బ్యాంకులకూ సీఆర్ఆర్ వెసులుబాటు!
బ్యాంకులకు కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కొన్ని ప్రోత్సాహకాలను అందించనుంది. డిపాజిట్లద్వారా వచ్చిన బంగారం నిల్వలను ఆర్బీఐ నిర్దేశించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)/చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) నిబంధనల్లో భాగంగా చూపించుకునేందుకు అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన మొత్తాన్ని సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు.
ప్రభుత్వ బాండ్లు ఇతరత్రా సాధనాల్లో పెట్టుబడిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం ఎస్ఎల్ఆర్. ప్రస్తుతం సీఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 21.5%గా ఉన్నాయి. అంటే బ్యాంకులు సమీకరించిన మొత్తం డిపాజిట్లలో 25.5% ఈ రెండింటిలో లాక్ అయిపోయినట్లే. ఇప్పుడు బంగారం డిపాజిట్లను వీటిలో భాగంగా పరిగణిస్తే.. బ్యాంకులకు అదనంగా రుణాలివ్వడానికి నగదు లభ్యత పెరుగుతుంది.
20,000 టన్నుల పైనే...
దేశవ్యాప్తంగా ఎలాంటి లావాదేవీలూ జరగకుండా, వ్యవస్థలోకి తిరిగిరాని బంగారం పరిమాణం 20 వేల టన్నులకు పైనే ఉంటుందని అంచనా. ఇలా ఉత్పాదకత రహితంగా ఉన్న పుత్తడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు
రూ.60 లక్షల కోట్లు ఉండొచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. ముఖ్యంగా అధిక మొత్తంలో పసిడి గుడులు, మతపరమైన లేదా ధార్మిక సంస్థల వద్ద ఉంది. అయితే, ముసాయిదా స్కీమ్‌లో ఎలాంటి సంస్థలకు అనుమతి ఉంటుందన్న విషయాన్ని నిర్ధిష్టంగా పేర్కొనలేదు. ప్రపంచంలో అత్యంత భారీగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉంది. మన దేశంలోకి ఏటా 800-1,000 టన్నుల పుత్తడి దిగుమతి అవుతోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలను అధికంగా వెచ్చించాల్సి రావడంతోపాటు రూపాయి మారకం విలువపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.