drama company
-
తెరమరుగవుతున్న తెలుగు నాటకం
కడప కల్చరల్ : తెలుగు నాటకం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో గతంలో పలు నాటక సంస్థలు ఉండేవి.. కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాటక సంస్థలు కనుమరుగయ్యాయి. ♦అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమంతటా విశిష్ట గుర్తింపు, గౌరవం పొందిన సురభి నాటక సంస్థ వైఎస్ఆర్ జిల్లాలోనే ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ రంగం ప్రస్తుతం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో వందకుపైగా ఉండిన నాటక సంస్థలు ప్రస్తుతం అరడజనుకు మించి లేకపోవడం గమనార్హం. అవికూడా పరిషత్తు (నాటక పోటీ)లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇటీవలి పరిణామాల కారణంగా రెండేళ్లుగా అంతంత మాత్రం ప్రదర్శనలు కూడా లేవు. దీంతో జిల్లాలో నాటకరంగం పరిస్థితి దయనీయంగా తయారైంది. వీరేశలింగానికి డాక్టర్ వైఎస్సార్ నీరాజనం నవయుగ వైతాళికుడు, తెలుగు నాటక ప్రయోక్త, కవి, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని .. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ♦ఈ నిర్ణయం రాష్ట్రంలోని నాటకరంగ కళాకారుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. ప్రతి జిల్లాలో ఐదుగురు సీనియర్ రంగస్థల కళాకారులను ఎంపిక చేసి ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాలలో వీరేశలింగం జయంతి సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున నగదు ఇస్తూ ఘనంగా సత్కారం నిర్వహించేవారు. ♦ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని క్రమంగా తెరమరుగు చేశాయి. 2014లో అన్ని జిల్లాల కళాకారులను విజయవాడకు పిలిపించి ఒకేరోజున మొక్కుబడిగా అందరికీ వరుసపెట్టి పురస్కారాలు ఇచ్చే కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇది కళాకారుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఆ తర్వాత ఈ పురస్కారాలను వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16నగాక ఆ తర్వాత నంది నాటక పోటీల బహుమతి ప్రదానంలో ఇవ్వడం ప్రారంభించారు. దీంతో వీరేశలింగం తెలుగు నాటకరంగ పురస్కారాలు ఉనికి కోల్పోయినట్లయింది. జిల్లాలో స్థితి ♦జిల్లాలో ప్రొఫెషనల్ నాటక సంస్థలు లేకపోవడం, ఔత్సాహికుల ప్రదర్శనలలో నాణ్యత లోపం, ప్రజల ఆదరణ లేకపోవడంతో జిల్లాలో నాటకం కొన ఊపిరితో ఉంది. పరిషత్తుల కోసం అక్కడక్కడ నాటకాలు తయారవుతున్నా ఇటీవలి కాలంలో ఆ పోటీలు కూడా లేకపోవడంతో నాటకం వైభవం కోల్పోయింది. వైవీయూతో కొత్త ఊపిరి ♦వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగాన్ని నిర్వహిస్తుండడంతో నాటకరంగానికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది. రాష్టంలోని సీనియర్ రంగస్థల కళాకారులను యూనివర్శిటీకి పిలిపించి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 50 మందికి పైగా నటులు యూనివర్శిటీ ద్వారా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నాటకంలో కృషి చేస్తున్నారు. తెలుగు నాటకం.. తెర తీసే యత్నం దాదాపు 500 తెలుగు నాటికలు, నాటకాల సారాంశాన్ని పుస్తకంగా రంగస్థల కళాకారులతోపాటు ప్రజలకు అందించే ప్రయత్నం సాగుతోంది. యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం అధ్యక్షులు, లలిత కళానికేతన్ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి తాను చేసిన ఈ కృషిని రాయలసీమ నాటక వికాసం పేరిట పుస్తకంగా తీసుకు వచ్చారు. దాంతోపాటు ఆయన రాసిన నాటికల సంపుటిని అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సుమబాలారెడ్డి ట్రస్టుతో కలిసి నిర్వహిస్తున్నారు. -
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
మేకప్ పైకన్నీటిచారలు
♦ అర్ధాకలితో అలమటిస్తున్న మేకప్ కళాకారులు ♦ ఉత్సవాల్లో వేషధారులకు రంగులద్ది జీవనం పెరవలి : ఉత్సవాలలో వేషధారులకు మేకప్ వేసి జీవించే కళాకారుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి.ఏడాదిలో 15 రోజులు మాత్రమే వీరికి పని ఉంటోంది. మిగిలిన రోజుల్లో రోడ్లపై కేకులు అమ్ముకుంటూపొట్ట నింపుకుంటారు. కడుపునిండకపోయినా కళపై అభిమానంతో ఇంకా మేకప్‌నే నమ్ముకుని జీవిస్తున్నామని రాజమండ్రికి చెందిన నాగరాజు డ్రామా డ్రెసెస్ కంపెనీ కళాకారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా.. ఈ మేకప్మెన్లు ఉత్సవాల్లో వేసే పౌరాణిక వేషాల దగ్గర నుంచి నాటకాలు, నాటికలకు వేసే వేషాల వరకు అవలీలగా మేకప్ వేస్తారు. ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారుగా మార్చి వేయటంలో అందెవేసిన చేతులు వీరివి. ఉత్సవాల్లో కేవలం మూడు గంటల్లో 30 వేషాలకు మేకప్ వేయగలరు. రాముడు, కృష్ణుడు, ధుర్యోదనుడు, లవకుశ, ఆంజనేయలు, దుర్గామాత వంటి 50 నుంచి 100 వేషాల వరకు వీరు తీర్చి దిద్దగలరు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉత్సవాల్లో వచ్చే ప్రోగ్రాంలు బట్టి వేషాలకు మేకప్‌లు వేస్తామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు పలు పల్లెల్లో తాము వేషధారులకు మేకప్‌లు వేసి మెప్పించినట్టు తెలిపారు.