కాకరపర్రులో మేకప్ వేస్తున్న కళాకారుడు
♦ అర్ధాకలితో అలమటిస్తున్న మేకప్ కళాకారులు
♦ ఉత్సవాల్లో వేషధారులకు రంగులద్ది జీవనం
పెరవలి :
ఉత్సవాలలో వేషధారులకు మేకప్ వేసి జీవించే కళాకారుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి.ఏడాదిలో 15 రోజులు మాత్రమే వీరికి పని ఉంటోంది. మిగిలిన రోజుల్లో రోడ్లపై కేకులు అమ్ముకుంటూపొట్ట నింపుకుంటారు. కడుపునిండకపోయినా కళపై అభిమానంతో ఇంకా మేకప్‌నే నమ్ముకుని జీవిస్తున్నామని రాజమండ్రికి చెందిన నాగరాజు డ్రామా డ్రెసెస్ కంపెనీ కళాకారులు తెలిపారు.
ఆ వివరాలు ఇలా..
ఈ మేకప్‌మెన్‌లు ఉత్సవాల్లో వేసే పౌరాణిక వేషాల దగ్గర నుంచి నాటకాలు, నాటికలకు వేసే వేషాల వరకు అవలీలగా మేకప్ వేస్తారు. ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారుగా మార్చి వేయటంలో అందెవేసిన చేతులు వీరివి. ఉత్సవాల్లో కేవలం మూడు గంటల్లో 30 వేషాలకు మేకప్ వేయగలరు. రాముడు, కృష్ణుడు, ధుర్యోదనుడు, లవకుశ, ఆంజనేయలు, దుర్గామాత వంటి 50 నుంచి 100 వేషాల వరకు వీరు తీర్చి దిద్దగలరు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉత్సవాల్లో వచ్చే ప్రోగ్రాంలు బట్టి వేషాలకు మేకప్‌లు వేస్తామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు పలు పల్లెల్లో తాము వేషధారులకు మేకప్‌లు వేసి మెప్పించినట్టు తెలిపారు.