తెరమరుగవుతున్న తెలుగు నాటకం | Telugu Natakarangam Day 2022 | Sakshi
Sakshi News home page

తెరమరుగవుతున్న తెలుగు నాటకం

Published Sat, Apr 16 2022 11:23 PM | Last Updated on Sat, Apr 16 2022 11:23 PM

Telugu Natakarangam Day 2022 - Sakshi

పౌరాణిక నాటకంలోని ఓ దృశ్యం(ఫైల్‌)

కడప కల్చరల్‌ : తెలుగు నాటకం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో గతంలో పలు నాటక సంస్థలు ఉండేవి.. కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాటక సంస్థలు కనుమరుగయ్యాయి.

♦అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమంతటా విశిష్ట గుర్తింపు, గౌరవం పొందిన సురభి నాటక సంస్థ వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ రంగం ప్రస్తుతం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో వందకుపైగా ఉండిన నాటక సంస్థలు ప్రస్తుతం అరడజనుకు మించి లేకపోవడం గమనార్హం. అవికూడా పరిషత్తు (నాటక పోటీ)లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇటీవలి పరిణామాల కారణంగా రెండేళ్లుగా అంతంత మాత్రం ప్రదర్శనలు కూడా లేవు. దీంతో జిల్లాలో నాటకరంగం పరిస్థితి దయనీయంగా తయారైంది.

వీరేశలింగానికి డాక్టర్‌ వైఎస్సార్‌ నీరాజనం
నవయుగ వైతాళికుడు, తెలుగు నాటక ప్రయోక్త, కవి, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని .. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

♦ఈ నిర్ణయం రాష్ట్రంలోని నాటకరంగ కళాకారుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. ప్రతి జిల్లాలో ఐదుగురు సీనియర్‌ రంగస్థల కళాకారులను ఎంపిక చేసి ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాలలో వీరేశలింగం జయంతి సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున నగదు ఇస్తూ ఘనంగా సత్కారం నిర్వహించేవారు.

♦ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని క్రమంగా తెరమరుగు చేశాయి. 2014లో అన్ని జిల్లాల కళాకారులను విజయవాడకు పిలిపించి ఒకేరోజున మొక్కుబడిగా అందరికీ వరుసపెట్టి పురస్కారాలు ఇచ్చే కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇది కళాకారుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.  ఆ తర్వాత ఈ పురస్కారాలను వీరేశలింగం జయంతి ఏప్రిల్‌ 16నగాక ఆ తర్వాత నంది నాటక పోటీల బహుమతి ప్రదానంలో ఇవ్వడం ప్రారంభించారు. దీంతో వీరేశలింగం తెలుగు నాటకరంగ పురస్కారాలు ఉనికి కోల్పోయినట్లయింది.

జిల్లాలో స్థితి
♦జిల్లాలో ప్రొఫెషనల్‌ నాటక సంస్థలు లేకపోవడం, ఔత్సాహికుల ప్రదర్శనలలో నాణ్యత లోపం, ప్రజల ఆదరణ లేకపోవడంతో జిల్లాలో నాటకం కొన ఊపిరితో ఉంది. పరిషత్తుల కోసం అక్కడక్కడ నాటకాలు తయారవుతున్నా ఇటీవలి కాలంలో ఆ పోటీలు కూడా లేకపోవడంతో నాటకం వైభవం కోల్పోయింది.

వైవీయూతో కొత్త ఊపిరి
♦వైఎస్సార్‌ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగాన్ని నిర్వహిస్తుండడంతో నాటకరంగానికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది. రాష్టంలోని సీనియర్‌ రంగస్థల కళాకారులను యూనివర్శిటీకి పిలిపించి  విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 50 మందికి పైగా నటులు యూనివర్శిటీ ద్వారా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నాటకంలో కృషి చేస్తున్నారు.

తెలుగు నాటకం.. తెర తీసే యత్నం
దాదాపు 500 తెలుగు నాటికలు, నాటకాల సారాంశాన్ని పుస్తకంగా రంగస్థల కళాకారులతోపాటు ప్రజలకు అందించే ప్రయత్నం సాగుతోంది. యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం అధ్యక్షులు, లలిత కళానికేతన్‌ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి తాను చేసిన ఈ కృషిని రాయలసీమ నాటక వికాసం పేరిట పుస్తకంగా తీసుకు వచ్చారు. దాంతోపాటు ఆయన రాసిన నాటికల సంపుటిని అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన బ్రౌన్‌ భాషా పరిశోధన  కేంద్రంలో సుమబాలారెడ్డి ట్రస్టుతో కలిసి నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement