కడప నగరంలో గురువారం కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. నగర వీధులు గీతా సంకీర్తనలతో ప్రతిధ్వనించాయి.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప నగరంలో గురువారం కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. నగర వీధులు గీతా సంకీర్తనలతో ప్రతిధ్వనించాయి. దాదాపు 250 మందికిపైగా సాధువులు, ఆధ్యాత్మిక పీఠాల ప్రతినిధులకు వందలాది మంది కళాకారులు స్వాగతం చెబుతూ ఊరేగింపు నిర్వహించారు. కోలాటాలు, చెక్కభజన బృందాలు సందడి చేస్తుండగా శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు అడుగడుగునా నగర భక్తుల కర్పూర హారతులందుకున్నారు. నగరమంతటా ఊరేగింపు సాగడంతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ మహాసభలు కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాధువుల నగర శోభా యాత్ర నిర్వహించారు. శ్రీసీతారాముల ఉత్సవ మూర్తులకు శ్రీ పూజ్యపాద ఆచార్య శంకరానందగిరి స్వామి తొలిపూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. దాదాపు 250 మంది సాధువులు, స్వామిజీలు, సాధు మాతలు నాలుగు వాహనాల్లో ఆసీనులై నగర వాసులను ఆశీర్వదించారు.
ఆధ్యాత్మిక సందడి: చెక్కభజనలు, కోలాటాల బృందాలు సందడి చేయగా గంగిరెద్దుల బృందాలు అడుగడుగునా తమ కళా ప్రతిభను కనబరిచారు. పలు పాఠశాలల విద్యార్థులు దేవతామూర్తుల వేషాలలో శోభాయాత్రలో పాల్గొన్నారు. మహాసభల కడప విభాగం అధ్యక్షులు బెరైడ్డి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వెంకట్‌రెడ్డి యాత్రను పర్యవేక్షించారు. అడుగడుగునా గీతాపారాయణం నిర్వహించారు. కోటిరెడ్డి కూడలి, శ్రీకృష్ణరాయ సర్కిల్‌లలో స్వామిజీలకు తేనేటి విందు, మధ్యాహ్నం అపూర్వ కళ్యాణమండపంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30గంటల వరకు శోభాయాత్ర తిరిగి నాగార్జున మిహ ళా డిగ్రీ కళాశాలను చేరుకుంది. యాత్రలో కడప నగరానికి చెందిన పలు దేవాలయాల కమిటీల ప్రతినిధులు, ఆధ్యాత్మిక సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సాధువుల ప్రవచనాలు ఉంటాయి. రాత్రి 8నుంచి 10గంటల వరకు ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.