Dr.AP Vital
-
క్యూబా నేర్పుతున్న పాఠం
‘ఎప్పటినుండో మిమ్మల్ని తప్పకుండా చూడాలని, వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవం తులు మీరు!’ అని నెహ్రూజీ తొలి సారి క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రోను కలుసుకున్న సందర్భంగా అన్న మాటలివి! ప్రపం చాన్ని శాసించగల స్థాయిలో ఉన్నానన్న అహంకారంతో - ‘ఏమిటి ఈ కాస్ట్రో! ఒక ఎర్ర జెండా భుజాన వేసుకుని, పెద్ద మొనగాడల్లే ఊరేగుతు న్నాడు! అమెరికాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉందని మర్చిపోతున్నట్లున్నాడు ఈ బుడత విప్లవకారుడు!’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తే, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలో ఉంటే, ‘క్యూబాకు అమెరికా కూడా 90 మైళ్ల దూరంలోనే వుందన్న ప్రాథమిక సత్యాన్ని అమెరికా అధ్యక్షుడు మరిచినట్లున్నాడు’ అని హెచ్చరిస్తూ బదులి చ్చిన ధీశాలి కాస్ట్రో. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా క్యూబా పర్యటనకు వెళ్లిన వార్తతో పాటు ఈ ఉదంతం గుర్తుకొ చ్చింది. అంతేకాదు, ‘అమెరికా అధ్యక్షునిగా ఒక నల్ల జాతీ యుడు ఎన్నికయితే క్యూబా అమెరికా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఏర్పడతాయి’ అని కూడా కాస్ట్రో నాడు తెలిపిన అభిప్రాయం, భవిష్యద్దర్శనమా అన్నట్లు నిజమయింది. ఈ తరుణంలో, నా 37వ ఏట.. 1978లో ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భారతదేశ ప్రతినిధి బృందంలో ఒకరిగా, నా క్యూబా పర్యటనలో నేను గమనించిన క్యూబా విప్లవానికి సంబంధించిన కొన్ని అంశాలను భూమికగా ప్రస్తావించదలిచాను. క్యూబా విప్లవం జయప్రదం అయ్యేనాటికి దానిని కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన జరిగిన విప్లవంగా ప్రకటించే పరిస్థితి లేదు. క్యూబన్ కమ్యూనిస్టు తొలి మహాసభ విప్ల వానంతరం సంవత్సరం తర్వాత జరిగింది! క్యూబాలోని సామ్రాజ్యవాద అమెరికన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కాస్ట్రో నేతృత్వాన ఓడించకముందు, అలాంటి దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు రావడం అరుదేమీ కాదు. ఆ తర్వాత తిరుగు బాటు నేతను కూడా అమెరికా కొనేసి, దారికి తెచ్చుకుని తిరిగి తన కీలుబొమ్మగా మార్చుకోవడం జరిగేది. అలాగే కాస్ట్రో నేతృత్వాన రగులుకొంటున్న విప్లవాన్ని కూడా మరో సాధారణ తిరుగుబాటుగా వ్యవహరించవచ్చులే అని అమె రికన్ పాలకులు కొంత నిర్లక్ష్యం చేసి విప్లవ అణచివేత దిశగా ముందుగా మేల్కొనలేదు. తీరా విప్లవం జయప్రదం కాబోయే సమయానికి, అది అమెరికా చేయి దాటి క్యూబా చరిత్రలో, లాటిన్ అమెరికాలో తొలి ప్రజావిప్లవంగా నిలిచి పోయింది. ఇదొక ప్రత్యేకత! క్యూబా విప్లవాన్ని ఒక వాస్త వంగా అంగీకరించడానికి అమెరికా సిద్ధపడకపోగా పురిటి పసికందును అంతమొందించాలని, అనాగరిక ఆంక్షలకు ఆజ్యంపోసి, క్యూబాకు జీవనావసరాలను సైతం అంద కుండా చెయ్యాలని ఎంతో దుష్టయత్నం చేసింది. ఆ సమయానికే అంతర్జాతీయంగా సోవియెట్ యూనియన్ నేతృత్వాన సోషలిస్టు శిబిరం ఏర్పడింది. యు.ఎస్. ఎస్.ఆర్, చైనా మొదలగు దేశాలతో కూడిన సోషలిస్టు శిబిరం అండదండలతో క్యూబా నిలదొక్కుకోగలిగింది. అయితే సోవియెట్ యూనియన్ నేతృత్వంలోని సోషలిస్టు శిబిరం ఎంతగా సహకరించినా, క్యూబా ప్రజానీకంలో అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ చైతన్యం ప్రధాన కారణం కావాలి! అప్పుడే క్యూబన్ విప్లవానికి గ్యారంటీ! అందుకే ఆ విప్లవ చైతన్యాన్ని ప్రజలలో అంతర్ముఖం చేసేందుకు కాస్ట్రో సోషలిస్టు పాలన ఎంతో ప్రయత్నం చేసింది. అంత ర్జాతీయ సోషలిస్టు సిద్ధాంత ఘర్షణల ఆటుపోట్ల మధ్యనే క్యూబా తన విప్లవాన్ని కాపాడుకున్నది. అమెరికన్ ఆంక్షలనే కాదు - సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై అక్కడ సోషలిజం అంతరించినా చైనాలో ‘డెంగ్’ సంస్కరణల పాలన సాగినా, క్యూబా విప్లవం నిల దొక్కుకున్నది. లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. నిన్నమొన్నటి ‘చావేజ్’ కూడా క్యూబా ప్రభావితుడే! ప్రపంచంలోనే ఆరోగ్య రంగాన అగ్రగామిగా వున్న దేశం క్యూబా. 27 దేశాలలో క్యూబా వైద్యులు తమ ప్రభుత్వం తరఫున వెళ్లి వైద్య సహాయం అందిస్తున్నారు. క్యూబాకు ఆయిల్ సరఫరాలు నిలిచిపోయేలా అమెరికా ఆంక్షలు విధిస్తే - అత్యంత తీవ్రమైన పరిస్థితిలో తిరిగి గుర్రాలతో వ్యవసాయాన్ని (ట్రాక్టర్ల స్థానంలో) సాగించి, అమెరికాకు లొంగేది లేదని స్పష్టం చేసింది క్యూబా. తన దేశ ప్రజల ప్రయోజనాలకు, తన ఆర్థిక వనరులకూ అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలకు తాకట్టు పెట్ట కుండా, ప్రగతి పథాన సాగుతున్నది గనుకనే అమెరికన్ సామ్రాజ్య వాదం సైతం బలప్రయోగంతో, క్యూబాను కబళింపవచ్చు నన్న అహంకారం పనిచేయదని గ్రహించింది. ఒకనాడు కాస్ట్రో జోస్యం చెప్పినట్లు - డెమొక్రటిక్ పార్టీ తరఫున నల్ల జాతీయుడైన ఒబామా అధ్యక్షులుగా వుండి అక్కడి పాలక వర్గం ప్రస్తుత పరిస్థితిలో అనుమ తించిన పరిధిలో, క్యూబాతో సత్సంబంధాల ఆవశ్యకత గుర్తెరిగి తానూ స్నేహ హస్తం అందించాడు. ఆ విజ్ఞతకు ఒబామా సైతం అభినందనీయుడే! క్యూబా మన దేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. అయినా, మార్క్సిజాన్ని ఒక రూళ్ల కర్ర సిద్ధాంతంగా కాకుండా, సోషలిస్టు శిబిరం ఉన్న నాటి పరిస్థితులు -ఆ శిబిరం విచ్ఛిన్నమైన పరిస్థితులు- అమెరికన్ సామ్రాజ్య వాద తీవ్ర వ్యతిరేకత. అలాగే లాటిన్ అమెరికన్ జాతీయ సంస్కృతీ నాగరికతలు, విభిన్న భౌతిక రాజకీయ పరిస్థితు లకు అనుగుణంగా మార్క్సిజం వెలుగులో తన ప్రత్యేక తలతో తన పయనం సాగించింది. అది క్యూబా కమ్యూ నిస్టు పార్టీ నుంచి మన కమ్యూనిస్టులు వినమ్రంగా స్వీక రించదగిన పాఠం. మార్క్సిజాన్ని ఒక పిడిసూత్రంగా కాక ఆచరణకు మార్గదర్శకంగా అన్వయించుకోగలగాలి. పుచ్చ లపల్లి సుందరయ్య ఒక సందర్భంలో చెప్పినట్లు ఈ సమా జం ప్రస్తుత దశనుంచి పురోగమన దిశగా ఎంతో కొంతైనా పయనించేటట్టు కృషి చేయడం.. ఏ స్థితిలో ఉండినా కమ్యూనిస్టుల కర్తవ్యం. కనీసం సమాజం మరింత తిరోగ మనానికి దారితీయకుండా, కనీసం ఆ స్థాయిలోనైనా నిలబెట్టగలగాలి. ఇప్పుడున్న స్థితిలో వర్గపోరాట రూపం ఒక్కటే ఏకైక పోరాటరూపంగానూ, వర్గవైరుధ్యం ఒక్కటే ఏకైక వైరుధ్యంగానూ భావించి వ్యవహరించడం మన భౌతిక వాస్తవికతకు అనుగుణంగా వ్యవహరించినట్లు కాదు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్, పూలే వంటి వారి అనుయాయులను, ఇతర సామాజిక శక్తులను, వ్యక్తు లను కలుపుకుని ముందుకు సాగాలి. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక దోపిడీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్ మను గడకు మన ప్రత్యేకతలో నిర్దేశించగలవు. (వ్యాసకర్త: ఎ.పీ. విఠల్, ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు) -
మారుతున్న సీపీఎం తీరు?
విశ్లేషణ సీపీఎం మహాసభల ముసాయిదా రాజకీయ తీర్మానం పార్టీ పంథాలో కీలక మార్పులను సూచిస్తోంది. ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతోంది’’ అంటూ ఒకప్పుడు సుందరయ్య చేసిన విమర్శను అది స్వీకరించినట్టుంది. ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటుపడి బలహీనపడ్డామని అంగీకరించింది. ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అంటూ రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పైనుంచి రుద్దరాదని, ఆ నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ఉండాలని భావించింది. ముసాయిదాపై సుందరయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేకించి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)లో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువనే విమర్శలో నిజముంది. ఏదేమైనా ప్రతి మూడేళ్లకోసారి అఖిల భారత మహాసభలను నిర్వహించి, అంతవరకు పార్టీ అనుసరించిన రాజకీయ ఎత్తుగడలను, కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడమనే సత్సాంప్రదాయం కూడా సీపీఎంలో ఉంది. ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో ఆ పార్టీ 21వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఆ సందర్భంగా సీపీఎం కేంద్రకమిటీ విడుదల చేసిన ముసాయిదా రాజకీయ తీర్మానం ఆ పార్టీ పంథాలో కీలకమైన మార్పులను సూచిస్తుండటం విశ్లేషకులందరికీ ఆసక్తికరంగా మారింది. ‘జలంధర్’లోనే మొదలైన క్షీణత ముసాయిదా 1978లో జలంధర్‌లో జరిగిన 10వ మహాసభను ఒక మైలురాయిగా పేర్కొంది. 1977లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ఎత్తివేశాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆ సభలు జరిగాయి. ఆనాటి నుంచీ, మరీ ముఖ్యంగా గత 25 ఏళ్లుగా పార్టీ వ్యూహమూ, ఎత్తుగడలు తప్పుల తడకగా ఉండి పార్టీ ప్రతిష్ట, పలుకుబడి దిగజారిపోయాయని ఆ డాక్యుమెంటు వినమ్రంగా ఆత్మవిమర్శ చేసుకుంది. అందుకు ఆ పార్టీకి అభినందనలు! జలంధర్ మహాసభల ముసాయిదా తీర్మానానికి పుచ్చలపల్లి సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానాన్ని, పార్టీ నిబంధనావళికి సవరణలను ప్రతిపాదించారు. నాడు ఆయన చేసిన ప్రతిపాదనలలోనూ, 1976లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలోనూ ఉన్న సూత్రీకరణలు సరైనవేనని నేటి ముసాయిదా ఆయన పేరును ప్రస్తావించకుండానే అంగీకరించడం విశేషం. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీలో రామ్మనోహర్ లోహియా అనుచరులైన సోషలిస్టులు, మొరార్జీదేశాయ్ వంటి కరుడుకట్టిన కాంగ్రెస్ మితవాదులు ఉన్నా ప్రధానశక్తి మాత్రం జనసంఘ్ (నేటి బీజేపీ). ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర కమిటీ ప్రతిపాదించిన తీర్మానాన్ని సుందరయ్య వ్యతిరేకించారు. ‘‘బూర్జువా పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైన సీపీఐని రివిజనిస్టు పార్టీగా విమర్శిస్తున్న మనం, అంతకంటే మరింత అభివృద్ధి నిరోధక పార్టీయైన జనతాతో పొత్తు పెట్టుకోవడం రివిజనిజం కాదా?’’ అని సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానం ప్రశ్నించింది. దీంతో ప్రతినిధుల నుంచి కూడా అదే ప్రశ్న తలెత్తడం ప్రారంభమైంది, తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన కేంద్ర కమిటీ తెలివిగా తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకుండా... సుందరయ్య, ప్రతినిధుల అభిప్రాయాల సారాన్ని గ్రహించి తదనుగుణంగా కాంగ్రెస్ తదుపరి ఆ తీర్మానాన్ని తిరగరాసే అధికారాన్ని కోరింది. మౌనంగానే అనంగీకారాన్ని తెలిపిన సుందరయ్య తిరగరాతకు అనుకూలంగా మాత్రం ఓట్ చేయలేదు. అయితే ఐక్యత కోసం ప్రతినిధులు దాన్ని ఆమోదించారు. కేంద్ర కమిటీ అభీష్టమే కేంద్రీకృత ప్రజాస్వామ్యం! ఆ సభలకు ప్రతినిధిగా హాజరైన నేను విరామ సమయంలో ‘‘మొత్తానికి కేంద్ర కమిటీ తీర్మానాన్ని నిలవరించగలిగారు’’ అని సుందరయ్యతో అన్నాను. ఆయన నవ్వి ‘‘అమాయకుడా! ఏవో రెండు మూడు మాటలు మార్చి ఇదే తీర్మానాన్ని కొత్త కేంద్ర కమిటీ ఆమోదిస్తుంది. అంతకు మించి ఏమీ జరగదు. జనతా పార్టీతో పొత్తు కొనసాగుతుంది కూడా, చూడు’’ అన్నారు. ఆ తర్వాత జరిగింది సరిగ్గా అదే! ‘‘వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పరిస్థితులుంటాయి. కానీ పై కమిటీల నిర్ణయాలను కింది కమిటీలు అమలు చేయడమే కేంద్రీకృత ప్రజాస్వామ్యమంటూ ఆయా రాష్ట్ర కమిటీల అభిప్రాయాలకు భిన్నంగా కేంద్ర కమిటీ తన నిర్ణయాలనే అమలు చేయిస్తుంది. ఈ ధోరణి మారాలి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలతో ఎన్నికల పొత్తును పెట్టుకునే అంశంపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్ర కమిటీలకే ఇవ్వాలి’’ అంటూ సుందరయ్య పార్టీ నిబంధనావళికి సవరణను ప్రతిపాదించారు గానీ అది వీగిపోయింది. నేటి ముసాయిదా తీర్మానం నాటి ఆయన తీర్మానం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అని ప్రతిపాదించింది. అంతేకాదు రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పై నుంచి రుద్దకుండా అక్కడి పార్టీలే, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర కమిటీలకు ఉండాలని పేర్కొంది! ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే... ఒకటి, నేటి 21వ మహా సభల ముసాయిదా జలంధర్ సభ ఆనాటి సుందరయ్య అభిప్రాయాల, సూత్రీకరణల స్ఫూర్తినే ప్రతిబింబిస్తోందనేది చెప్పడం కోసం. రెండు, కాంగ్రెస్ తీర్మానాలు ఎలా ఉన్నా ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అభీష్టం మేరకే సాగే పెడధోరణి పార్టీలో పాతుకుపోయిందని చెప్పడం కోసం. నిజానికి సుందరయ్య హాజరైన ఆ ‘‘పదవ మహాసభలలోనే పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఆధ్వర్యంలో బూర్జువా పార్టీల విధానాలకు భిన్నమైన వర్గ, ప్రజా ఉద్యమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిర్వహించి, వాపపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణానికి పూనుకో వాలని తీర్మానించింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ తక్షణ అవసరం తోసుకువచ్చింది. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వెనక్కు పోయింది’’ అని అంగీకరించారు. సభల తీర్మా నాలు, తీర్మానాలుగానే ఉంటాయి, ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అను కున్నదే అవుతుంది అంటూ సుందరయ్య నాడు చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి పార్టీ ఇంతకాలం అదే బాటలో నడిచిందని తెలుస్తున్నది. పొత్తులతో బలహీనపడ్డ పార్టీ ‘‘పార్టీ స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల ఎత్తులు, పొత్తుల వల్ల బలహీన పడింది... చివరకు ఎన్నికల అవసరాల కోసం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికతత్వం లాంటి వాటి ప్రస్తావనే లేని మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించే పరిస్థితి దాపురించింది. ఫలితంగా పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళలలో పార్లమెంటరిజం వల్ల పార్టీ కొంత బలహీనపడగా, కేంద్రం నిర్దేశించిన ఎన్నికల పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో మరీ బలహీనపడింది’’ అని 21వ మహాసభ ముసాయిదా అంగీకరించింది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో నిర్మించిన మహాకూటమే! ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతూ భారత విప్లవ ఎత్తుగడల పంథాకు తిలోదకాలిచ్చే ప్రమాదం కనిపిస్తోంది’’ అని సుందరయ్య ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేటి సీపీఎం ముసాయిదా తీర్మానం అదే విషయాన్ని ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటు పడ్డామంటూ అంగీకరించింది. అంతేకాదు, పార్టీ నేతలు చేసే ప్రకటనలు ఒక్కో సారి పార్టీని ఆత్మరక్షణలో పడేసేవిగా, పార్టీపట్ల చులకన భావం ఏర్పర చేవిగా ఉంటున్నాయని పేర్కొంది. దిద్దుబాటుతోనే పురోగతి రెండున్నర దశాబ్దాలుగా ఈ ధోరణులు పార్టీలో కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా మొత్తం రాజకీయ, నిర్మాణ పరిస్థితిని సవ్యంగా, నిజాయితీగా సమీక్షించి, తప్పులను దిద్దుకుని పురోగమించాలన్న లక్ష్యాన్ని సీపీఎం తన ముందుంచుకున్నది. అయితే అది అంత తేలికైన విషయమేమీ కాదు. ‘‘ఏముంది తప్పులు చేశాం, దిద్దుకుంటాం. దానికి ఇంత గగ్గోలు, తీవ్ర విమర్శలు దేనికి?’’ అని దీన్ని తేలిగ్గా తీసుకోవడం సరికాదు. అలా అని ఊరికే గుండెలు బాదుకునీ ప్రయోజనం లేదు. కానీ ఇంత సుదీర్ఘ కాలం పాటూ పార్టీ గాడి తప్పితే ప్రజల్లో పార్టీకి ఉన్న ప్రత్యేక గౌరవాభిమానాలు క్రమేపీ తరిగిపోతాయి. బూర్జువా పార్టీలకిచ్చినట్టుగా తప్పులు చేసే వెసులుబాటును ప్రజలు కమ్యూనిస్టులకు ఇవ్వరు. పైగా వారిని కూడా బూర్జువా పార్టీలతో సమానం చేసి, ‘‘ఆ... వీళ్లూ అంతే, పదవులు-ఎన్నికలు, అవకాశవాద పొత్తులు’’ అని తేలిగ్గా తీసిపారేస్తారనేది వాస్తవం. ఏది ఏమైనా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యవంటి ఆదర్శ కమ్యూ నిస్టు, విప్లవ నేత స్ఫూర్తిని పెంపొందింపజేసుకొని సీపీఎం వామపక్ష ప్రజా తంత్ర సంఘటనకు అవిశ్రాంతంగా కృషి చేయడానికి ఈ 21వ జాతీయ మహాసభలు నాంది కానున్నాయనే ఆశాభావాన్ని ముసాయిదా రాజకీయ తీర్మానం కలిగించ గలిగింది. ప్రజలపట్ల ప్రేమ, గౌరవాలతో, అంకిత భావంతో కృషి చేస్తే పార్టీ తన తప్పులను దిద్దుకోవడం, తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యమే. మితవాద, మతవాద శక్తులు బలపడుతున్న పరిస్థితుల్లో... పాలకవర్గాలు విచక్షణారహితంగా అమలుచేస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా దేశవ్యాప్తంగా పీడిత ప్రజానీకమంతటిలో అసంతృప్తి అలముకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ అఖిల భారత మహాసభలు ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం నిర్మాణానికి, వామపక్ష, కమ్యూనిస్టు ఐక్యతకు ఉత్తేజకరమైన ప్రారంభం కాగలుగుతాయని ఆశించవచ్చా? (ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో సీపీఐ-ఎం 21వ అఖిల భారత మహాసభలు జరగనున్న సందర్భంగా) (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720) -
తమ్ముళ్లతోనే తస్మాత్ జాగ్రత్త బాబూ!
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌నే పదవీ భ్రష్టుణ్ని చేసిన చంద్రబాబు పార్టీలో సెంటిమెంటుకు, నిబద్ధతకు విలువ ఏముంటుంది? అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్లు అవసరం వస్తే బాబునూ ఆపదలోకి నెట్టగలరు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే వింత పరి ణామాన్ని చూస్తున్నాం. తమ అంతేవాసులు, తాము పైకి తెచ్చిన వారు, తమకు పదవి లభించడంలో ప్రధానపాత్ర పోషించిన వారి చేతులలోనే అటు నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు నాయుడు బందీ లైనట్లు కన్పిస్తోంది. ఇరువురూ ఆంతరంగికుల వద్దనైనా తమ పరివారం తెప్పిస్తున్న తలనొప్పులకు తలలు నొక్కుకోక తప్పడంలేదు. పైకి అంతా నేతలే చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తున్నా తెరవెనుక శక్తులేవో వీరిని ఆడిస్తున్నట్లు కనబడుతోంది. కేంద్రం సంగతి అలా పక్కన ఉంచి రాష్ట్రంలో చంద్రబాబుకు పార్టీ రూపంలో ఎదురవుతున్న తలనొప్పులను పరిశీలిద్దాం. భారత దేశాన్ని అన్ని మతాలకు తావులేని అఖండ హిందూ రాష్ట్రంగా మార్చాలని, ఆర్ఎస్ఎస్ పరివారం బరి తెగించి హడావుడి చేస్తున్నా, ఒక్కసారైనా మన ‘లౌకిక’నాయకుడు చంద్రబాబు ఖండించనైనా లేదు. కానీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నేత ఒకరు న్నారు. ఆయనే సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి. చంద్ర బాబుకు మంచి మిత్రుడిగా ఒకప్పుడు, ఆ జిల్లాలో ఆయన ఒక వెలుగు వెలిగారు. కాని ప్రస్తుతం చంద్ర బాబుగారి ప్రాధాన్యాలలో కార్పొరేట్ దిగ్గజాలతో మైత్రి ముందుకొచ్చిన పిదప, సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గి పోయింది. దీంతో గుర్రుగా ఉన్న సోమిరెడ్డి చంద్రబాబు బయటకు చెప్పలేని, విమర్శించలేని అంశాలను ప్రస్తా విస్తూ చంద్రబాబుకు తోడ్పడుతున్నట్లు కనపడాలని భావించినట్లున్నారు.‘‘ప్రపంచంలో జీవించే ప్రతి శిశువు మా ప్రవక్త ప్రకారం ముస్లిమే...’’ అంటూ ఎంఐఎం నేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సోమిరెడ్డి. ఆయన పెద్ద ఎత్తుగడతోనే ఇలా అని ఉండొచ్చు. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడేందుకు నిజంగానే సీరియస్‌గా ప్రయత్నిస్తే నేను ఒకణ్ని ఉన్నా నని బీజేపీకి భరోసా ఇచ్చి పార్టీలో ఖర్చీఫ్ వేసి ఉంచే ప్రయత్నం ఇలాంటి ప్రకటనల ద్వారా సోమిరెడ్డి చేసి ఉండవచ్చు. తస్మాత్ జాగ్రత్త బాబుగారూ! ‘సంక్రాంతికి చంద్రన్న కానుక’ అని ప్రభుత్వం పేదలకు పండుగ స్పెషల్‌గా ఇస్తానని చెప్పిన ప్యాకేజీని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ కానుక, పేదలకు చేరి కనీసం పండుగనాడైనా వారు తృప్తిగా భోజనం చేయకముందే, ఆ ప్యాకేజీ టెండర్లు పాడిన తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు పండుగ చేసుకుంటున్నా రని పత్రికలు కోడై కూస్తున్నాయి. దాదాపు రూ.27 కోట్ల మేరకు ఆ కాంట్రాక్టర్లు లాభపడ్డారట. ఇక చంద్రబాబు పార్టీలో కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేసిన పారిశ్రా మిక దిగ్గజాలు తమ కార్పొరేట్ సంస్కృతిని, సెల్ఫ్ ప్రమోషన్‌ను, తమ అధికార దర్పాన్ని బాహాటంగా ప్రకటించుకుంటున్న తీరు గమనార్హం. ‘‘అవును నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఎక్కడైనా, అది రాజధాని అయినా కాకున్నా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదా?’’, ‘‘నాకు డబ్బులున్నాయి. నాకు నంది గామలోనే కాదు. ఆమాట కొస్తే గన్నవరం వద్ద కూడా భూములు కొన్నాను. తప్పా! డబ్బులుంటే మీరూ (పాత్రికేయులు) కొనుక్కోండి’’. ప్రజాప్రతినిధులమని ప్రజల ముందు కాస్త నమ్రతగా మాట్లాడాలని కూడా ఎరుగని వారిని బాబు ఎక్కడా మందలించినట్లు లేదు. గతంలో రాజ్యసభ, కౌన్సిల్ స్థానాలకు ఇలాంటి వారిని చంద్రబాబు ఎన్నిక చేసినప్పుడు సహజంగానే ఆ పార్టీ జెండా మోస్తున్న పాతకాపులు అలిగితే వారిని బాబు బుజ్జగించారు. ఈ సారీ ఎన్నికలలో గెల్చిన పిదప, ఆ కార్పొరేట్ దిగ్గజాలకే చంద్రబాబు పెద్దపీట వేయడమే కాదు.. సీనియర్ నేతలు, మంత్రుల మధ్య విభేదాలు, అపోహలు వస్తే పరిష్కరించేందుకు సైతం ఈ కొత్త కాపులనే పురమాయించడమూ చూశాం. ఇది మింగుడుపడని సీనియర్ నేతలు బహిరంగ ప్రకట నలకు దిగుతున్నారు. ఇటీవల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ‘‘అసెంబ్లీలో మాలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఇతరులూ, చంద్రబాబుగారూ పదేపదే మాట్లాడి, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి, మంచివక్తగా ప్రజల్లో మార్కులు కొట్టేసే అవకాశం ఇచ్చార’’ని ఉన్న వాస్తవం చెప్పారు. దీనిపై అధినేత ఏమన్నారో గానీ మర్నాడు ‘‘నేనలా అనలేదు. పత్రికలు వక్రీకరించాయి. జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారు’’ అంటూ ఆయనే మరో ప్రకటన చేశారు. చివరిగా, వైఎస్సార్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు జగన్, ప్రజా సమస్యలను సహేతు కంగా లేవనెత్తిన పుడల్లా, సమాధానం లేని పాలకపక్షం ముఖ్యమంత్రితో సహా జగన్ జైలుశిక్ష అనుభవించారని, ఆయనపై సీబీఐ కేసులు నడుస్తున్నాయని, ఎదురు దాడికి దిగుతున్నారు. అయితే జగన్ దోషి అని ఇంత వరకు తుది తీర్పు రానే లేదు. విచారణ పూర్తి కానే లేదు. అలాగే చంద్రబాబుపై కూడా సీబీఐ ముందుకు కేసులు వస్తే బాబును విచారించేందుకు తగినంతమంది సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంది. అలాగే నాట్ బిఫోర్ అనే క్లాజును అడ్డం పెట్టుకుని విచారించవలసిన న్యాయమూర్తుల ముందు కేసులు విచారణకు రాకుండా చంద్రబాబు చేసుకున్నారు. పైగా చంద్రబాబు దోషి కాదు అని ఏ కోర్టూ నిర్ధారించలేదు. బాబుగారూ తస్మాత్ జాగ్రత్త! తమ్ముళ్లే అవసరం వస్తే ఆపదలోకి నెట్టగలరు. ఆ పార్టీ సంస్కృతిలో అదొక భాగం! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు) మొబైల్ : 9848069720