తమ్ముళ్లతోనే తస్మాత్ జాగ్రత్త బాబూ!
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌నే పదవీ భ్రష్టుణ్ని చేసిన చంద్రబాబు పార్టీలో సెంటిమెంటుకు, నిబద్ధతకు విలువ ఏముంటుంది? అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్లు అవసరం వస్తే బాబునూ ఆపదలోకి నెట్టగలరు.
అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే వింత పరి ణామాన్ని చూస్తున్నాం. తమ అంతేవాసులు, తాము పైకి తెచ్చిన వారు, తమకు పదవి లభించడంలో ప్రధానపాత్ర పోషించిన వారి చేతులలోనే అటు నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు నాయుడు బందీ లైనట్లు కన్పిస్తోంది. ఇరువురూ ఆంతరంగికుల వద్దనైనా తమ పరివారం తెప్పిస్తున్న తలనొప్పులకు తలలు నొక్కుకోక తప్పడంలేదు. పైకి అంతా నేతలే చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తున్నా తెరవెనుక శక్తులేవో వీరిని ఆడిస్తున్నట్లు కనబడుతోంది. కేంద్రం సంగతి అలా పక్కన ఉంచి రాష్ట్రంలో చంద్రబాబుకు పార్టీ రూపంలో ఎదురవుతున్న తలనొప్పులను పరిశీలిద్దాం. భారత దేశాన్ని అన్ని మతాలకు తావులేని అఖండ హిందూ రాష్ట్రంగా మార్చాలని, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం బరి తెగించి హడావుడి చేస్తున్నా, ఒక్కసారైనా మన ‘లౌకిక’నాయకుడు చంద్రబాబు ఖండించనైనా లేదు.
కానీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నేత ఒకరు న్నారు. ఆయనే సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి. చంద్ర బాబుకు మంచి మిత్రుడిగా ఒకప్పుడు, ఆ జిల్లాలో ఆయన ఒక వెలుగు వెలిగారు. కాని ప్రస్తుతం చంద్ర బాబుగారి ప్రాధాన్యాలలో కార్పొరేట్ దిగ్గజాలతో మైత్రి ముందుకొచ్చిన పిదప, సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గి పోయింది. దీంతో గుర్రుగా ఉన్న సోమిరెడ్డి చంద్రబాబు బయటకు చెప్పలేని, విమర్శించలేని అంశాలను ప్రస్తా విస్తూ చంద్రబాబుకు తోడ్పడుతున్నట్లు కనపడాలని భావించినట్లున్నారు.‘‘ప్రపంచంలో జీవించే ప్రతి శిశువు మా ప్రవక్త ప్రకారం ముస్లిమే...’’ అంటూ ఎంఐఎం నేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సోమిరెడ్డి. ఆయన పెద్ద ఎత్తుగడతోనే ఇలా అని ఉండొచ్చు. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడేందుకు నిజంగానే సీరియస్‌గా ప్రయత్నిస్తే నేను ఒకణ్ని ఉన్నా నని బీజేపీకి భరోసా ఇచ్చి పార్టీలో ఖర్చీఫ్ వేసి ఉంచే ప్రయత్నం ఇలాంటి ప్రకటనల ద్వారా సోమిరెడ్డి చేసి ఉండవచ్చు. తస్మాత్ జాగ్రత్త బాబుగారూ!
‘సంక్రాంతికి చంద్రన్న కానుక’ అని ప్రభుత్వం పేదలకు పండుగ స్పెషల్‌గా ఇస్తానని చెప్పిన ప్యాకేజీని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ కానుక, పేదలకు చేరి కనీసం పండుగనాడైనా వారు తృప్తిగా భోజనం చేయకముందే, ఆ ప్యాకేజీ టెండర్లు పాడిన తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు పండుగ చేసుకుంటున్నా రని పత్రికలు కోడై కూస్తున్నాయి. దాదాపు రూ.27 కోట్ల మేరకు ఆ కాంట్రాక్టర్లు లాభపడ్డారట. ఇక చంద్రబాబు పార్టీలో కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేసిన పారిశ్రా మిక దిగ్గజాలు తమ కార్పొరేట్ సంస్కృతిని, సెల్ఫ్ ప్రమోషన్‌ను, తమ అధికార దర్పాన్ని బాహాటంగా ప్రకటించుకుంటున్న తీరు గమనార్హం. ‘‘అవును నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఎక్కడైనా, అది రాజధాని అయినా కాకున్నా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదా?’’, ‘‘నాకు డబ్బులున్నాయి. నాకు నంది గామలోనే కాదు. ఆమాట కొస్తే గన్నవరం వద్ద కూడా భూములు కొన్నాను. తప్పా! డబ్బులుంటే మీరూ (పాత్రికేయులు) కొనుక్కోండి’’. ప్రజాప్రతినిధులమని ప్రజల ముందు కాస్త నమ్రతగా మాట్లాడాలని కూడా ఎరుగని వారిని బాబు ఎక్కడా మందలించినట్లు లేదు.
గతంలో రాజ్యసభ, కౌన్సిల్ స్థానాలకు ఇలాంటి వారిని చంద్రబాబు ఎన్నిక చేసినప్పుడు సహజంగానే ఆ పార్టీ జెండా మోస్తున్న పాతకాపులు అలిగితే వారిని బాబు బుజ్జగించారు. ఈ సారీ ఎన్నికలలో గెల్చిన పిదప, ఆ కార్పొరేట్ దిగ్గజాలకే చంద్రబాబు పెద్దపీట వేయడమే కాదు.. సీనియర్ నేతలు, మంత్రుల మధ్య విభేదాలు, అపోహలు వస్తే పరిష్కరించేందుకు సైతం ఈ కొత్త కాపులనే పురమాయించడమూ చూశాం. ఇది మింగుడుపడని సీనియర్ నేతలు బహిరంగ ప్రకట నలకు దిగుతున్నారు.
ఇటీవల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ‘‘అసెంబ్లీలో మాలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఇతరులూ, చంద్రబాబుగారూ పదేపదే మాట్లాడి, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, మంచివక్తగా ప్రజల్లో మార్కులు కొట్టేసే అవకాశం ఇచ్చార’’ని ఉన్న వాస్తవం చెప్పారు. దీనిపై అధినేత ఏమన్నారో గానీ మర్నాడు ‘‘నేనలా అనలేదు. పత్రికలు వక్రీకరించాయి. జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారు’’ అంటూ ఆయనే మరో ప్రకటన చేశారు. చివరిగా, వైఎస్సార్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు జగన్, ప్రజా సమస్యలను సహేతు కంగా లేవనెత్తిన పుడల్లా, సమాధానం లేని పాలకపక్షం ముఖ్యమంత్రితో సహా జగన్ జైలుశిక్ష అనుభవించారని, ఆయనపై సీబీఐ కేసులు నడుస్తున్నాయని, ఎదురు దాడికి దిగుతున్నారు.
అయితే జగన్ దోషి అని ఇంత వరకు తుది తీర్పు రానే లేదు. విచారణ పూర్తి కానే లేదు. అలాగే చంద్రబాబుపై కూడా సీబీఐ ముందుకు కేసులు వస్తే బాబును విచారించేందుకు తగినంతమంది సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంది. అలాగే నాట్ బిఫోర్ అనే క్లాజును అడ్డం పెట్టుకుని విచారించవలసిన న్యాయమూర్తుల ముందు కేసులు విచారణకు రాకుండా చంద్రబాబు చేసుకున్నారు. పైగా చంద్రబాబు దోషి కాదు అని ఏ కోర్టూ నిర్ధారించలేదు. బాబుగారూ తస్మాత్ జాగ్రత్త! తమ్ముళ్లే అవసరం వస్తే ఆపదలోకి నెట్టగలరు. ఆ పార్టీ సంస్కృతిలో అదొక భాగం!
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు)
మొబైల్ : 9848069720