మారుతున్న సీపీఎం తీరు? | CPM in changing the way? | Sakshi
Sakshi News home page

మారుతున్న సీపీఎం తీరు?

Published Mon, Apr 13 2015 1:49 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

డా॥ఎ.పి. విఠల్ - Sakshi

డా॥ఎ.పి. విఠల్

 విశ్లేషణ

 సీపీఎం మహాసభల ముసాయిదా రాజకీయ తీర్మానం పార్టీ పంథాలో కీలక  మార్పులను సూచిస్తోంది. ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతోంది’’ అంటూ ఒకప్పుడు సుందరయ్య చేసిన విమర్శను అది స్వీకరించినట్టుంది. ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటుపడి బలహీనపడ్డామని అంగీకరించింది. ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అంటూ రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పైనుంచి రుద్దరాదని, ఆ నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ఉండాలని భావించింది. ముసాయిదాపై సుందరయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
 
 కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేకించి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)లో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువనే విమర్శలో నిజముంది. ఏదేమైనా ప్రతి మూడేళ్లకోసారి అఖిల భారత మహాసభలను నిర్వహించి, అంతవరకు పార్టీ అనుసరించిన రాజకీయ ఎత్తుగడలను, కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడమనే సత్సాంప్రదాయం కూడా సీపీఎంలో ఉంది. ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో ఆ పార్టీ 21వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఆ సందర్భంగా సీపీఎం కేంద్రకమిటీ విడుదల చేసిన ముసాయిదా రాజకీయ తీర్మానం ఆ పార్టీ పంథాలో కీలకమైన మార్పులను సూచిస్తుండటం విశ్లేషకులందరికీ ఆసక్తికరంగా మారింది.

 ‘జలంధర్’లోనే మొదలైన క్షీణత
 ముసాయిదా 1978లో జలంధర్‌లో జరిగిన 10వ మహాసభను ఒక మైలురాయిగా పేర్కొంది. 1977లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ఎత్తివేశాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆ సభలు జరిగాయి. ఆనాటి నుంచీ, మరీ ముఖ్యంగా గత 25 ఏళ్లుగా పార్టీ వ్యూహమూ, ఎత్తుగడలు తప్పుల తడకగా ఉండి పార్టీ ప్రతిష్ట, పలుకుబడి దిగజారిపోయాయని ఆ డాక్యుమెంటు వినమ్రంగా ఆత్మవిమర్శ చేసుకుంది. అందుకు ఆ పార్టీకి అభినందనలు! జలంధర్ మహాసభల ముసాయిదా తీర్మానానికి పుచ్చలపల్లి సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానాన్ని, పార్టీ నిబంధనావళికి సవరణలను ప్రతిపాదించారు. నాడు ఆయన చేసిన ప్రతిపాదనలలోనూ, 1976లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలోనూ ఉన్న సూత్రీకరణలు సరైనవేనని నేటి ముసాయిదా ఆయన పేరును ప్రస్తావించకుండానే అంగీకరించడం విశేషం.

 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీలో రామ్‌మనోహర్ లోహియా అనుచరులైన సోషలిస్టులు, మొరార్జీదేశాయ్ వంటి కరుడుకట్టిన కాంగ్రెస్ మితవాదులు ఉన్నా ప్రధానశక్తి మాత్రం జనసంఘ్ (నేటి బీజేపీ). ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర కమిటీ ప్రతిపాదించిన తీర్మానాన్ని సుందరయ్య వ్యతిరేకించారు. ‘‘బూర్జువా పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైన సీపీఐని రివిజనిస్టు పార్టీగా విమర్శిస్తున్న మనం, అంతకంటే మరింత అభివృద్ధి నిరోధక పార్టీయైన జనతాతో పొత్తు పెట్టుకోవడం రివిజనిజం కాదా?’’ అని సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానం ప్రశ్నించింది. దీంతో ప్రతినిధుల నుంచి కూడా అదే ప్రశ్న తలెత్తడం ప్రారంభమైంది, తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన కేంద్ర కమిటీ తెలివిగా తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకుండా... సుందరయ్య,  ప్రతినిధుల అభిప్రాయాల సారాన్ని గ్రహించి తదనుగుణంగా కాంగ్రెస్ తదుపరి ఆ తీర్మానాన్ని తిరగరాసే అధికారాన్ని కోరింది. మౌనంగానే అనంగీకారాన్ని తెలిపిన సుందరయ్య తిరగరాతకు అనుకూలంగా మాత్రం ఓట్ చేయలేదు. అయితే  ఐక్యత కోసం ప్రతినిధులు దాన్ని ఆమోదించారు.

 కేంద్ర కమిటీ అభీష్టమే కేంద్రీకృత ప్రజాస్వామ్యం!    
 ఆ సభలకు ప్రతినిధిగా హాజరైన నేను విరామ సమయంలో ‘‘మొత్తానికి కేంద్ర కమిటీ తీర్మానాన్ని నిలవరించగలిగారు’’ అని సుందరయ్యతో అన్నాను. ఆయన నవ్వి ‘‘అమాయకుడా! ఏవో రెండు మూడు మాటలు మార్చి ఇదే తీర్మానాన్ని కొత్త కేంద్ర కమిటీ ఆమోదిస్తుంది. అంతకు మించి ఏమీ జరగదు. జనతా పార్టీతో పొత్తు కొనసాగుతుంది కూడా, చూడు’’ అన్నారు. ఆ తర్వాత జరిగింది సరిగ్గా అదే!

 ‘‘వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పరిస్థితులుంటాయి. కానీ పై కమిటీల నిర్ణయాలను కింది కమిటీలు అమలు చేయడమే కేంద్రీకృత ప్రజాస్వామ్యమంటూ ఆయా రాష్ట్ర కమిటీల అభిప్రాయాలకు భిన్నంగా  కేంద్ర కమిటీ తన నిర్ణయాలనే అమలు చేయిస్తుంది. ఈ ధోరణి మారాలి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలతో ఎన్నికల పొత్తును పెట్టుకునే అంశంపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్ర కమిటీలకే ఇవ్వాలి’’ అంటూ సుందరయ్య పార్టీ నిబంధనావళికి సవరణను ప్రతిపాదించారు గానీ అది వీగిపోయింది. నేటి ముసాయిదా తీర్మానం నాటి ఆయన తీర్మానం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అని ప్రతిపాదించింది. అంతేకాదు రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పై నుంచి రుద్దకుండా అక్కడి పార్టీలే, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర కమిటీలకు ఉండాలని పేర్కొంది!

 ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే... ఒకటి, నేటి 21వ మహా సభల ముసాయిదా జలంధర్ సభ ఆనాటి సుందరయ్య అభిప్రాయాల, సూత్రీకరణల స్ఫూర్తినే ప్రతిబింబిస్తోందనేది చెప్పడం కోసం. రెండు, కాంగ్రెస్ తీర్మానాలు ఎలా ఉన్నా ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అభీష్టం మేరకే సాగే పెడధోరణి పార్టీలో పాతుకుపోయిందని చెప్పడం కోసం. నిజానికి సుందరయ్య హాజరైన ఆ ‘‘పదవ మహాసభలలోనే పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఆధ్వర్యంలో బూర్జువా పార్టీల విధానాలకు భిన్నమైన వర్గ, ప్రజా ఉద్యమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిర్వహించి, వాపపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణానికి పూనుకో వాలని తీర్మానించింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ తక్షణ  అవసరం తోసుకువచ్చింది. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వెనక్కు పోయింది’’ అని అంగీకరించారు. సభల తీర్మా నాలు, తీర్మానాలుగానే ఉంటాయి, ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అను కున్నదే అవుతుంది అంటూ సుందరయ్య నాడు చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి పార్టీ ఇంతకాలం అదే బాటలో నడిచిందని తెలుస్తున్నది.

 పొత్తులతో బలహీనపడ్డ పార్టీ
 ‘‘పార్టీ స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల ఎత్తులు, పొత్తుల వల్ల బలహీన పడింది... చివరకు ఎన్నికల అవసరాల కోసం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికతత్వం లాంటి వాటి ప్రస్తావనే లేని మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించే పరిస్థితి దాపురించింది. ఫలితంగా పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళలలో పార్లమెంటరిజం వల్ల పార్టీ కొంత బలహీనపడగా, కేంద్రం నిర్దేశించిన ఎన్నికల పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో మరీ బలహీనపడింది’’ అని 21వ మహాసభ ముసాయిదా అంగీకరించింది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో నిర్మించిన మహాకూటమే! ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతూ భారత విప్లవ ఎత్తుగడల పంథాకు తిలోదకాలిచ్చే ప్రమాదం కనిపిస్తోంది’’ అని సుందరయ్య ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేటి సీపీఎం ముసాయిదా తీర్మానం అదే విషయాన్ని ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటు పడ్డామంటూ అంగీకరించింది. అంతేకాదు, పార్టీ నేతలు చేసే ప్రకటనలు ఒక్కో సారి పార్టీని ఆత్మరక్షణలో పడేసేవిగా, పార్టీపట్ల చులకన భావం ఏర్పర చేవిగా ఉంటున్నాయని పేర్కొంది.

 దిద్దుబాటుతోనే పురోగతి
 రెండున్నర దశాబ్దాలుగా ఈ ధోరణులు పార్టీలో కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా మొత్తం రాజకీయ, నిర్మాణ పరిస్థితిని సవ్యంగా, నిజాయితీగా సమీక్షించి, తప్పులను దిద్దుకుని పురోగమించాలన్న లక్ష్యాన్ని సీపీఎం తన ముందుంచుకున్నది. అయితే అది అంత తేలికైన విషయమేమీ కాదు. ‘‘ఏముంది తప్పులు చేశాం, దిద్దుకుంటాం. దానికి ఇంత గగ్గోలు, తీవ్ర విమర్శలు దేనికి?’’ అని దీన్ని తేలిగ్గా తీసుకోవడం సరికాదు. అలా అని ఊరికే గుండెలు బాదుకునీ ప్రయోజనం లేదు. కానీ ఇంత సుదీర్ఘ కాలం పాటూ పార్టీ గాడి తప్పితే ప్రజల్లో పార్టీకి ఉన్న ప్రత్యేక గౌరవాభిమానాలు క్రమేపీ తరిగిపోతాయి. బూర్జువా పార్టీలకిచ్చినట్టుగా తప్పులు చేసే వెసులుబాటును ప్రజలు కమ్యూనిస్టులకు ఇవ్వరు. పైగా వారిని కూడా బూర్జువా పార్టీలతో సమానం చేసి, ‘‘ఆ... వీళ్లూ అంతే, పదవులు-ఎన్నికలు, అవకాశవాద పొత్తులు’’ అని తేలిగ్గా తీసిపారేస్తారనేది వాస్తవం.

 ఏది ఏమైనా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యవంటి ఆదర్శ కమ్యూ నిస్టు, విప్లవ నేత స్ఫూర్తిని పెంపొందింపజేసుకొని సీపీఎం వామపక్ష ప్రజా తంత్ర సంఘటనకు అవిశ్రాంతంగా కృషి చేయడానికి ఈ 21వ జాతీయ మహాసభలు నాంది కానున్నాయనే ఆశాభావాన్ని ముసాయిదా రాజకీయ తీర్మానం కలిగించ గలిగింది. ప్రజలపట్ల ప్రేమ, గౌరవాలతో, అంకిత భావంతో కృషి చేస్తే పార్టీ తన తప్పులను దిద్దుకోవడం, తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యమే. మితవాద, మతవాద శక్తులు బలపడుతున్న పరిస్థితుల్లో... పాలకవర్గాలు విచక్షణారహితంగా అమలుచేస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా దేశవ్యాప్తంగా పీడిత ప్రజానీకమంతటిలో అసంతృప్తి అలముకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ అఖిల భారత మహాసభలు ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం నిర్మాణానికి, వామపక్ష, కమ్యూనిస్టు ఐక్యతకు ఉత్తేజకరమైన ప్రారంభం కాగలుగుతాయని ఆశించవచ్చా?
 
 (ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో సీపీఐ-ఎం 21వ అఖిల భారత మహాసభలు జరగనున్న  సందర్భంగా)
 (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు  98480 69720)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement