ఏలేరుపై వార్!
=అనుమతి లేకుండా పనులు
=విస్కోకు తెలియకుండా పైపులైను ఏర్పాటు
=తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన జీవీఎంసీ
నర్సీపట్నం, న్యూస్‌లైన్: తుని, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని తీరప్రాంత గ్రామాలకు నీటి తరలింపు వ్యవహారం కొలిక్కి రాలేదు. మొదట్లో తాండవ రైతులు వ్యతిరేకించగా, ప్రస్తుతం ఏలేరు నిర్వహణ చేపడుతున్న జీవీఎంసీ అడ్డుకుంటోంది. ప్రాజెక్టు ప్రారంభంలో తాండవనీటిని రెండు నియోజకవర్గాలకు పైపులైను ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు అప్పట్లో సీఎం కిరణ్ తునిలో శంకుస్థాపన చేశారు.
పనులు ప్రారంభించేందుకు పైపులు తరలిస్తుండగా తాండవ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పనులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తరలించాలని భావించి, ఏర్పాట్లు మొదలెట్టారుఏలేరు నీటిని తుని, పాయకరావుపేట గ్రామాలకు తరలించే ప్రతిపాదనను విశాఖ పరిశ్రమలు, తాగునీటి అవసరాల కమిటీ (విస్కో) నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీన్ని కాదని రెండు జిల్లాల నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇప్పటికే దిగువ పైపులైను పనులు చేపట్టగా, తాజాగా నియోజకవర్గంలోని గొలుగొండ పేట వద్ద కాలువను ఆనుకుని స్టోరేజీ ట్యాంకునకు నీటిని తరలించే పైపులను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికార యంత్రాంగం ఇటీవల పరిశీలించి పైపులైనుకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి పూడ్చివేశారు. వారం రోజుల్లో ఈ పైపులైనును పూర్తిగా తొలగించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు తాగునీటి పంపిణీపై ఒక్కో అధికారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు.
ఈ పథకాలకు అవసరమైన తాగునీటి కోసం ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం ఆమోదించిందీ లేనిదీ తమకు ఇంకా తెలి యదని తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులుంటున్నా రు. నీటి తరలింపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అం దువల్లే పైపులైను పనులు ప్రారంభించామని తాగునీటి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఏలేరు నీరివ్వని పక్షంలో తమ ప్రాంతం గుండా వెళ్లే కాలువను అడ్డుకుని ఆందోళన చేసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.