సమైక్యాంధ్ర సింహగర్జనకు ఇంటికొకరు రండి
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా గురువారం నెల్లూరులో లక్షమందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ వెల్లడించింది. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆశాఖ జిల్లా అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి మాట్లాడుతూ సింహగర్జనకు లక్ష మందికి పైగా హాజరవుతారన్నారు. జిల్లాలో ప్రతి ఇంటి నుంచి ఒక్కరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి సమైక్యాంధ్ర సింహగర్జన ర్యాలీ ప్రారంభమై గాంధీబొమ్మ, వీఆర్స్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్ బంకు మీదుగా ఏసీ స్టేడియానికి చేరుకుంటుందన్నారు. నగరంలోని 15 ప్రదేశాల నుంచి జనం సభకు చేరుకుం టారని ఆయన తెలిపారు.
ఈ గర్జనకు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా హాజరు కావచ్చన్నారు. వేదిక సభ్యుడు, ఏజేసీ పెంచలరెడ్డి మాట్లాడుతూ ఉద్యమానికి వచ్చే ప్రజలకు వ్యాపారులు తాగునీరు అందించాలని కోరారు. సభాప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సింహగర్జన విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్టీఓ రాంప్రసాద్ మాట్లాడుతూ సభ ముగియగానే ఏసీ స్టేడియం నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు 40 ప్రైవేటు వాహనాలను రాకపోకలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
నేడు మోటారు సైకిల్ ర్యాలీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బుధవారం ఆర్టీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ మోటారుసైకిల్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ తెలిపారు. అనంతరం రవాణాసంస్థ అధికారులు రిలేదీక్షలో పాల్గొంటారనిపేర్కొన్నారు.
శాంతిభద్రతలకు
ప్రత్యేక ఏర్పాట్లు: డీఎస్పీ
సమైక్యాంధ్ర సింహగర్జనలో భాగంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి తెలిపారు. నగరంలోని బీవీఎస్ బాలికల ఉన్నతపాఠశాల (నవాబుపేట), శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం (ఆత్మకూరు బస్టాండ్), ఏబీఎం కాం పౌండ్ (బోసుబొమ్మ), గాంధీబొమ్మసెంటర్, వీఆర్సీ సెంటర్, వైఎంసీఏ గ్రౌండ్, శ్రీసర్వోదయ కళాశాల, ఆర్టీసీ బస్‌స్టేషన్, కస్తూరిబా ఉన్నత పాఠశాల, కేవీఆర్ పెట్రోలు బంకు, టీటీడీ కల్యాణమండపం, ఎన్జీవో హోం, వేదాయపాళెం, అయ్యప్పస్వామి గుడి ప్రాంతాల నుంచి సభకు హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు.
వాహనాల పార్కింగ్ ప్రాంతాలివే
నగరంలోని బారాషహీద్ దర్గా, వేదాయపాళెం, అయ్యప్పగుడి, మినీబైపాస్, మాగుంటలే అవుట్ ప్రాంతాలను పార్కింగ్ కోసం ఎంపిక చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పొదలకూరు, జొన్నవాడల మీదుగా వచ్చే వాహనాలు బారాషహీద్ దర్గా వద్ద, గూడూరు వైపు నుంచి వచ్చే వాహనాలు అయ్యప్పగుడి, వేదాయపాళెం వద్ద, కోవూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మినీబైపాస్ వద్ద, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మాగుంట లేఅవుట్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు.
పోస్టర్,కరపత్రాల విడుదల
సమైక్యాంధ్ర సింహగర్జన పోస్టర్లు, కరపత్రాలను వేదిక నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ మూర్తి, ఎన్జీవో జేఏసీ చైర్మన్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.