ఒక్క రక్తపు బొట్టు.. శిశువు గుట్టు విప్పు..
పిల్లలు పుట్టిన ఆనందం కంటే వాళ్లు బలహీనంగా ఉండటం లేదా మరో తీవ్రమైన సమస్యతో బాధపడటాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు.. చికిత్స నిమిత్తం లక్షల రూపాయలు ఖర్చుచేయడం తెలిసిందే. పిల్లలు పుడుతూనే ఆరోగ్యసమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి? నవజాత శిశువులకు మెరుగైన చికిత్స అందించలేమా? అనే ప్రశ్నలతో ప్రారంభమైన పరిశోధన చివరికి సత్ఫలితాల్ని సాధించింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఆల్ట్రా వాయిలెట్ స్కానింగ్ విధానంలో కంటే ఒకే ఒక్క రక్తపు బొట్టుతో శిశువు వయసుతోపాటు వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. తద్వారా పసిపిల్లల అనారోగ్యానికి గల కారణాలనూ విశ్లేషించి వారికి నూతన విధానంలో చికిత్స అందించవచ్చు. ఈ పరిశోధనలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యగా మారిన శిశుమరణాలను నివారించే వీలుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
సాధారణంగా పిండ దశ నుంచి 37 వారాల తర్వాత తల్లి గర్భం నుంచి వెలుపలికి వచ్చే శిశువుది ఆరోగ్యకరమైన జననంగా వైద్యులు భావిస్తారు. కానీ పౌష్టికాహారలోపం, వాతావరణకాలుష్యం, మానసిక, శారీరక ఒత్తిడి తదితర కారణాలతో కొందరు తల్లులు 37 వారలకంటే ముందే శిశువులకు జన్మనిస్తున్నారు. ఇలా సరైన సమయానికి ముందే(ప్రీ మెచ్యూర్ బేబీస్) పుట్టిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 వేల మంది ప్రీమెచ్యూర్ బేబీలు పుడుతున్నారు. వీరిలో చాలామంది బతికిబట్టకట్టలేకపోతున్నారు.
తాజాగా అభివృద్ధి చేసిన వైద్య విధానంలో శిశువు నుంచి ఒకే ఒక చుక్క రక్తాన్నిసేకరిస్తారు. రకరకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ శిశువు ప్రీమెచ్యూర్ బేబీనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటంతోపాటు వారి ఆరోగ్యపరిస్థితికి తగిన చికిత్స అందించేవీలుంటుందని శాస్ర్తవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కెల్లీ రైక్ మన్ తెలిపారు. అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన కెల్లీ బృందం దాదాపు ఐదేళ్లపాటు వివిధ దేశాలకు చెందిన మూడు లక్షల మంది నవజాత శిశువులకు పరీక్షలు నిర్వహించింది.