అద్దె చెల్లిస్తారా.. ఖాళీ చేస్తారా..!
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖ.. నగరపాలక సంస్థల మధ్య వివాదం రాజుకుంది. డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూలులో జిల్లా విద్యాశాఖ ఉపయోగిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని నగరపాలక సంస్థ అధికారులు ఆదేశించారు. ఖాళీ చేయకపోతే మున్సిపల్ హైస్కూలు భవనాలకు అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ వినియోగిస్తున్న భవనానికి అద్దె నిర్ణయించేందుకు గురువారం నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి మంజులాకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది కొలతలు తీసుకున్నారు. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది.
డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూలులోని మొదటి బ్లాకులోని భవనాలను జిల్లా విద్యాశాఖ 18 ఏళ్లుగా వినియోగించుకుంటోంది. ఇక్కడ 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి సంబంధించిన జవాబుపత్రాలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఈ పాఠశాల ఆవరణలోనే నిర్వహిస్తారు. నగరంలోని ఇతర మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల కంటే ఇక్కడ సౌకర్యంగా ఉండటంతో ఏటా ఇక్కడే మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుంది.
ఈ భవనంలోనే ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారితో పాటు అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు కూడా పాల్గొన్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) కార్యాలయానికి కూడా ఈ భవనంలోనే గదిని కేటాయించారు. ప్రస్తుతం విద్యాశాఖ ప్రత్యేకంగా విద్యుత్ మీటర్‌ను కూడా ఏర్పాటు చేయించి కరెంట్ బిల్లులను కూడా చెల్లిస్తోంది.
అయితే గతంలో విద్యాశాఖ రూ.1.65 లక్షల కరెంట్ బిల్లులు చెల్లించలేదని నగరపాలక సంస్థ అధికారులు ఆరోపిస్తున్నారు. చల్లా అనూరాధ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసినప్పటి నుంచి ఈ బకాయి ఉందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యార్థులు కొందరు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్నందున ఖాళీ చేయించాలని కోరారు. అయితే విద్యాశాఖ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన స్థలం లేనందున కలెక్టర్ కూడా ఈ విషయంలో విద్యాశాఖనే సమర్థించారు.
ఇదిలా ఉండగా గురువారం ఆకస్మికంగా నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి మంజులాకుమారి తన సిబ్బందితో డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూలుకు వచ్చారు. భవనాన్ని ఖాళీ చేయమని కోరారు. ఖాళీ చేయకపోతే అద్దె చెల్లించాల్సిఉంటుందని చెప్పారు. ఈ భవనానికి అద్దె నిర్ణయించమని కమిషనర్ పంపినట్లు మంజులాకుమారి తెలిపారు.