సుందరకాండ... రామాయణానికి హృదయకాండ
బ్రహ్మాండపురాణం రామాయణాన్ని ఒక మహామంత్రంగా గుర్తించింది. రామాయణాంతర్భాగమైన సుందరకాండలో ఇహపర తారకాలైన శాస్త్ర రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో కీ.శే. గుంటూరు శేషేంద్రశర్మ చెప్పిన ఒకటి రెండు అంశాలను పరిశీలిద్దాం.
వాల్మీకి రామాయణానికి హృదయం సుందరకాండం. రామాయణమంతా పారాయణం చేసేవారు కొందరే ఉండవచ్చు కానీ, సుందరకాండను పారాయణ చేసేవారు అనేకులున్నారు. ఎందుకంటే రామాయణానికంతటికీ ఇది బీజకాండం. సుందరకాండంతో సమానమైన మంత్రం లేదు. దాన్ని పారాయణ చేస్తే తప్పక సిద్ధి కలుగుతుంది. సుందరకాండలో సీతకు వాడిన ఉపమానాలన్నీ పరాశక్తిపరంగా అన్వయిస్తాయి. కొన్ని భావాలు కుండలినీశక్తి పరంగా అన్వయిస్తాయి.
వేదాంతశాస్త్ర ప్రతిపాదితమైన శ్రవణ మననాది అష్టాంగయోగం, యోగశాస్త్ర ప్రతిపాదితమైన , తంత్రశాస్త్ర ప్రతిపాదితాలైన మంత్రోపాసన, కుండలినీ విద్య రామాయణంలో ధ్వనించాయి. సీతారాములకు అభేద ప్రతిపత్తి చేత రాముని పరాశక్తిగా భావించి పారాయణం చేసే పద్ధతి సుందరకాండకుంది. రాముడు సుందరుడు. సుందరమైన సీతను సతిగా కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ. సుందర హనుమంతుడంటే దేవీ భక్తుడైన హనుమ అని అర్థం. కాబట్టి సుందరకాండలో పరాశక్తి తత్త్వమే ప్రతిపాదింపబడింది. హనుమ నిరంతర దేవీ ధ్యాన, జప, యోగాల కలబోతే సుందరకాండగా దర్శనమిస్తుంది.
త్రిజట స్వప్నంలో గాయత్రీమంత్రాన్ని దర్శించడం అద్భుతం. త్రిజటకు కలలో రాముడు నాలుగుసార్లు నాలుగు విధాలుగా కనిపించాడు. మొదటిసారి ఏనుగు దంతాలతో చేసిన వేయిహంసలు పూన్చి, ఆకాశంలో అలా సాగిపోతూన్న శిబిక (పల్లకి) ను ఎక్కి రాముడు కనిపించాడు. రెండోసారి నాలుగు దంతాలున్న మహాగజాన్ని అంటే ఐరావతాన్ని ఎక్కి కనిపిస్తే, మూడోసారి తెల్లటి ఎనిమిది వృషభాలను పూన్చిన రథం ఎక్కి రాముడు సీతతో కూడి వచ్చాడు. నాలుగోసారి తెల్లటి దండలు, వస్త్రాలు ధరించి, లక్ష్మణునితో పుష్పక విమానం ఎక్కి వచ్చాడు.
మొదటిదానిలో రామునికి, గాయత్రీమంత్రాధిష్ఠాన దైవతమైన పరబ్రహ్మానికి అభేదం చెప్పబడింది. రెండోదృశ్యంలో ఆ మంత్రానికి నాలుగుపాదాలు ఉన్నాయని చెప్పబడింది. మూడోదానిలో పరబ్రహ్మంలో రమించడం, నాలుగోదానిలో నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన ఉంది. ఈ నాలుగు దృశ్యాలలో మొదటి మూడింటిలో త్రిపదా గాయత్రి సగుణ బ్రహ్మాత్మకం, చివరిపాదం నిర్గుణ బ్రహ్మాత్మకం.
ఇలా త్రిజట స్వప్నంలో గాయత్రీ మంత్రాన్ని, మంత్రాధిదేవతల వర్ణనను ధ్వనింపజేశాడని తన ‘షోడశి’ గ్రంథంలో శేషేంద్ర పేర్కొన్నారు. సుందరకాండను ఊరికే పారాయణ చేయకుండా దానిలో ఉండే అంతరార్థాన్ని గ్రహించాలి.
- డా. బ్రాహ్మణపల్లి జయరాములు