ఒక్క పథకమూ అందలేదు
- ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు
బద్వేలు అర్బన్: ఎన్నికలలో గెలిపిస్తే పక్కాగృహాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అంటూ ఏవేవో హామీలిస్తే నమ్మి ఓట్లేశాం. గెలిచిన తర్వాత ఏ ఒక్క పథమూ అందించలేదని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన మంగళకాలని, పూసలవాడ ప్రజలు వాపోయారు. బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని ఆయా కాలనీలలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమగోడు వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు, పక్కాగృహాలు , మరుగుదొడ్లు మంజూరుచేయడంలో వివక్షచూపుతున్నారని వాపోయారు. ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని, కాలనీలలో సిమెంటు రోడ్లు , తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అనేక హామీలిచ్చిన టీడీపీ నాయకులు కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే చంద్రబాబును నమ్మి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామని, ఇక నమ్మే పరిస్థితులలో లేమని తేల్చి చెప్పారు. అనంతరం సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికలలో గెలుపొందేందుకే ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షుడు గుర్రంపాటి సుందరరామిరెడ్డి , జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి , మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా , మాజీ సర్పంచ్ ఆదిశేషయ్య, నాయకులు రఘురామిరెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి,యద్దారెడ్డి, మల్లేష్, ఎస్ఎం. షరీఫ్, సాంబశివారెడ్డి, శేఖర్‌రెడ్డి, రాము,మురళి,చరణ్ తదితరులు పాల్గొన్నారు.