ఏదీ జాబు
నేటికీ కొలిక్కిరాని డీఎస్సీ నియామకాలు
కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం
రేషనలైజేషన్‌తో పోస్టుల భర్తీకి ఎసరు
గగ్గోలు పెడుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు
ఏలూరు సిటీ : డీఎస్సీ-14 ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో తెలి యక నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు కే సులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 601 ఉపాధ్యాయ పోస్టుల కోసం 30వేల 17 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా, 27వేల మంది అర్హత సాధించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వీరంతా ‘జాబు ఎప్పుడిస్తారు బాబూ’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో పరీక్షలు రాయగా, జూన్‌లో ఫలితాలు వెల్లడించిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంపిక ప్రక్రియ ఊసెత్తడం లేదు.
డీఎస్సీ పరీక్ష పత్రాల్లో తప్పులు దొర్లటం, మార్కుల కేటాయింపులో శాస్త్రీయత లోపించడంతో అభ్యర్థుల్లో కొందరు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. డీఎస్సీ-14పై సుమారు 170 కోర్టు కేసులు నమోదయ్యాయంటే.. పరీక్షలు నిర్వహించే విషయంలో సర్కారు ఎంత గొప్పగా వ్యవహరించిందనే విషయాన్ని అవగతం చేసుకోవచ్చు. ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇష్టం లేని సర్కారు కావాలనే లోపభూయిష్టంగా పరీక్షలు జరిపించిందని.. తద్వారా అభ్యర్థులు కోర్టుకు వెళ్లేలా చేసి డీఎస్సీ ఎంపిక ప్రక్రియను ప్రహసనంగా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
రేషనలైజేషన్‌తో భర్తీకి ఎసరు !
జిల్లాలో ప్రస్తుతం చేపట్టిన ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణతో ఖాళీ పోస్టులు లేకుండా పోయాయి. కొత్త పోస్టులు భర్తీచేసే అవకాశాలపై ప్రభుత్వం ఏవైనా నూతన నిర్ణయాలు తీసుకుంటే తప్ప డీఎస్సీ-14 ఎంపిక ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. జిల్లాలోని పాఠశాలల్లో క్రమబద్ధీకరణ చేసిన అనంతరం 500 టీచర్ పోస్టులు అదనంగా ఉన్నట్టు విద్యాశాఖ పేర్కొంటోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను అనుసరించి 601 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. క్రమబద్ధీకరణ అనంతరం 500 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్టు చెబుతున్న నేపథ్యంలో 601 పోస్టుల భర్తీ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త పోస్టులు సృష్టిస్తే తప్ప డీఎస్సీ పోస్టుల భర్తీకి అవకాశం కలగదని అంటున్నారు. పిల్లల సంఖ్య ఆధారంగా ఆదర్శ పాఠశాలల ఏర్పాటు పేరిట జిల్లాలో 35 ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరో 60 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. పిల్లలు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేస్తున్న సర్కారు డీఎస్సీ పోస్టులను ఎలా భర్తీ చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోస్టుల్లో కోత
జిల్లాలో మొత్తంగా డీఎస్సీ-14 నియామకాలకు సంబంధించి 601 పోస్టులకు గాను 532 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులు 123 కాగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 341, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 68 ఉన్నాయి. వీటి భర్తీని రోస్టర్ జాబితా మేరకు డీఈవో చేపట్టాల్సి ఉంది. 532 పోస్టులో క్లియర్ వేకెన్సీ 395 పోస్టులుండగా, 137 బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. వాటిలో 374 పోస్టులు ప్లెయిన్ ఏరియాలోను, 120 పోస్టులు ఏజెన్సీలోను ఉన్నాయి. వీటితోపాటు ఏజెన్సీ ప్రాంతంలో మరో 38 పోస్టులు ఉండగా, వాటిలో 21 క్లియర్ వేకెన్సీ, 17 పోస్టులు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి.