మూగకు మాటొచ్చిన వేళ!
తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదల భారతీయ సినీ రంగానికి ఓ కొత్త దోవ చూపింది. మూగ సినిమాలతో తెరపై బొమ్మల వినోద పరిశ్రమకు తెర తీసిన దాదాసాహెబ్ ఫాల్కే ‘భారతీయ సినిమాకు పితామహుడి’గా పేరు తెచ్చుకుంటే, మాట-పాటతో కూడిన టాకీ చిత్రాన్ని రూపొందించిన అర్దేషిర్ ఎం. ఇరానీ ‘భారతీయ టాకీ పితామహుడి’గా ప్రతిష్ఠనందుకున్నారు. మూకీ చిత్రాల హవా సాగుతున్న రోజుల్లో పాక్షిక టాకీ అయిన హాలీవుడ్ చిత్రం ‘షో బోట్’ చూసి, పాశ్చాత్య దేశాల్లోని టాకీ పరిణామాన్ని గ్రహించి, ఆ స్ఫూర్తితో మన చిత్రాలకు కూడా మాటను జత చేయాలని ఇరానీ ధైర్యం చేశారు.
షూటింగ్ సమయంలోనే శబ్దాన్ని కూడా రికార్డు చేసే చిత్రీకరణ సామగ్రిని తీసుకురావడం కష్టమైతే, ఇక ఆ టాకీలను ప్రదర్శించే శబ్ద సాంకేతిక పరిజ్ఞానం మన సినిమా హాళ్ళలో అసలే లేదు. అయినా సరే ఇరానీ వెనక్కి తగ్గలేదు. కష్టనష్టాలకు ఎదురొడ్డి, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ’లో ‘ఆలమ్ ఆరా’ తీశారు. బొంబాయిలోని తమ సొంత సినిమా హాలైన ‘మెజెస్టిక్ సినిమా’లో 1931 మార్చి 14న విడుదల చేశారు. అప్పటి దాకా మన చలనచిత్రాల్లోని పాత్రలు సైగలతో అభినయిస్తూ, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య ‘టైటిల్ కార్డుల’ రూపంలో చూపే డైలాగ్ కార్డులతోనే ప్రేక్షకులకు విషయాన్ని చెప్పేవి. అలాంటిది... ప్రేక్షకులను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుతూ, ‘ఆలమ్ ఆరా’లోని పాత్రలన్నీ తమ నోటి మాటతో శ్రవణానుభవాన్ని చ్చాయి.
భారత సినీ చరిత్రలో నవ శకానికి నాంది పలికాయి.
విదేశీ చిత్రాల దిగుమతితో ఎగ్జిబిటరైన ఇరానీ మన దేశంలోనే మూకీ చిత్రాలు తయారవడం మొదలయ్యాక, 1922 నుంచి నిర్మాతగా పౌరాణికాలు, చారిత్రకాలతో సహా ఎన్నో మూకీ చిత్రాలు తీశారు. ఎన్నెన్నో ఘన విజయాలను అందుకున్నారు. భారతీయ సినీ ప్రముఖులైన పృథ్వీరాజ్ కపూర్, మెహబూబ్ ఖాన్, సులోచన (రూబీ మేయర్స్) ఇరానీ సంస్థ ‘ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ’లో కెరీర్‌కు శ్రీకారం చుట్టుకున్నవారే!‘తొలి’ ఘనత కోసం పోటాపోటీ: దేశంలో తొలి పూర్తి నిడివి టాకీ చిత్రాన్ని తానే తీయాలని ఇరానీ పట్టుదలగా శ్రమిస్తున్నప్పుడు ఓ పక్క కలకత్తా ‘మదన్ థియేటర్స్’, మరోపక్క బొంబాయి ‘కృష్ణా కంపెనీ’ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆఖరుకు ఆట, పాటలతో కొన్ని లఘుచిత్రాలను కూడా ఈ పోటీ సంస్థలు విడుదల చేశాయి. వీటన్నిటినీ తట్టుకొని, ఇరానీ ‘ఆలమ్ ఆరా’తో సరిగ్గా 83 ఏళ్ళ కిందట రికార్డుల్లోకి ఎక్కారు.
తీయడంలో సినిమా కష్టాలు: మూకీలను అప్పట్లో రిఫ్లెక్టర్ల సాయంతో సూర్యకాంతిలో చిత్రీకరించేవారు. కానీ, శబ్దమూ రికార్డు చేయాల్సి వచ్చేసరికి, పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉండేలా రాత్రి వేళ, అరడజను లైట్ల మధ్య ఇండోర్ షూటింగ్ చేశారు. ఆ సినిమా కోసం ఒకే సిస్టమ్‌తో కూడిన ట్యానర్ రికార్డింగ్ సామగ్రిని విదేశాల నుంచి తెప్పించారు. విదేశీ నిపుణుడిని గమనిస్తూ పని నేర్చుకొని, చివరకు ఇరానీయే రికార్డింగ్ కూడా చేశారు. సంస్థలోని దర్శకు లందరూ పనిచేసిన ఈ సినిమాకు రుస్తుమ్ భరూచా, పేసీ కరనీ, మోతీ గిద్వాయ్ల సహకారంతో తాను దర్శకత్వం వహించినట్లు ఇరానీ చెప్పారు. అప్పట్లో మూకీ చిత్ర నిర్మాణం మహా అయితే నెల లోపలే పూర్తయ్యేది. ఆ సమయంలో దృశ్యంతో పాటు, శబ్దాన్ని కూడా రికార్డు చేయాల్సిన నవీన రూపమైన ఈ తొలి టాకీ చిత్ర నిర్మాణానికి చాలా రోజులే పట్టింది. ఎట్టకేలకు నాలుగు నెలల శ్రమతో, నలభై వేల ఖర్చుతో ఈ 10,500 అడుగుల సినిమా పూర్తయింది. ఎనిమిది వారాల పాటు బాక్సాఫీస్‌ను ఊపేసింది.
అది ఓ సంచలనం: ప్రసిద్ధ పార్శీ నాటకకర్త జోసెఫ్ డేవిడ్ పాపులర్ రచన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సంచార జాతికి చెందిన ఓ అమ్మాయికీ, రాకుమారుడికీ మధ్య ప్రేమ చుట్టూ కథ నడుస్తుంది. మాస్టర్ విఠల్ హీరోగా, జుబేదా హీరోయిన్గా, రంగస్థల ప్రముఖుడు పృథ్వీరాజ్ కపూర్ హీరోయిన్ తండ్రిగా కనిపించే ‘‘సంపూర్ణ మాట, పాట, నృత్యాల’’ ‘ఆలమ్ ఆరా’ విడుదల అప్పట్లో ఓ సంచలనం. రిలీజ్ రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని ‘మెజెస్టిక్ సినిమా’ వద్ద గుంపులు గుంపులుగా చేరారు. ట్రాఫిక్ స్తంభించింది. హాలులోకి వెళ్లడానికి దర్శక, నిర్మాతలే నానా కష్టాలు పడాల్సొచ్చింది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి.
తెర మీద కదలడమే కాక, తమకు అర్థమైన భాషలో మాట్లాడే బొమ్మ చూడడానికీ, ‘దే దే ఖుదా కే నామ్ పే...’ అంటూ వెండితెరపై వినిపించిన తొలి భారతీయ సినీ గీతంతో సహా మొత్తం 7 పాటలు, పాత్రధారుల డైలాగులు వినడానికీ ప్రేక్షకులు హాళ్ళకు విరగబడ్డారు. మామూలు రేటు కన్నా దాదాపు 20 రెట్ల ఎక్కువకు బ్లాకులో టికెట్లు అమ్ముడయ్యాయి. బిచ్చమెత్తుకుంటున్న ఓ ఫకీరు పాత్ర (వజీర్ మొహమ్మద్ ఖాన్ పోషించారు) పాడుతుండగా, కేవలం ఓ తబలా, ఓ హార్మోనియమ్, ఓ వయొలిన్ సాయంతో ఏకకాలంలో రికార్డింగ్, చిత్రీకరణ జరుపుకొన్న ఆ తొలి పాట ఆ రోజుల్లో అందరి నోటా వినిపించేది.
పాటలు, నృత్యాలతో కూడిన ఈ సినిమా మన దేశంలోనే కాక బర్మా, శ్రీలంక, పశ్చిమ ఆసియాలోనూ ప్రాచుర్యం సంపాదించుకుంది. ఇదే కథను దర్శకుడు నానూభాయ్ వకీల్ 1956లో, ’73లో రెండు సార్లు రీమేక్ చేశారు. టాకీ తెచ్చిన మార్పులు: హిందీ, ఉర్దూ భాషల మిశ్రమమైన ‘హిందుస్తానీ’లో తీసిన ‘ఆలమ్ ఆరా’లో అనేక సాంకేతిక లోపాలున్నా, టాకీ అనుభవానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులై, కాసులు కురిపించారు. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక తెరమరుగయ్యారు.
విడదీయరాని అనుబంధం: ‘ఆలమ్ ఆరా’ విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ ‘జమాయ్ షష్ఠి’ (1931 ఏప్రిల్ 11న విడుదల)ని మదన్ థియేటర్స్ విడుదల చేసింది. ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ మాట - పాటల చిత్రాలకు గిరాకీ వచ్చింది. దాంతో, తమిళంతో పాటు తెలుగు మాటలు, పాటలు కూడా ఉన్న తొలి దక్షిణ భారత టాకీ ‘కాళిదాస్’ (1931 అక్టోబర్ 31)ని హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో బొంబాయిలోనే ఇరానీ నిర్మించారు. ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ‘కాళిదాస్’ చిత్రీకరణ జరగడం విశేషం. అలా తొలి భారతీయ టాకీకీ, మన దక్షిణాది టాకీకీ విడదీయరాని బంధం ఉంది. ‘కాళిదాస్’ కూడా లాభాలు తేవడంతో, మన తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) హెచ్.ఎం. రెడ్డి నిర్దేశకత్వంలో వచ్చింది. ఈ క్రమంలో అప్పటి దాకా ‘మూకీ’లను ప్రదర్శించిన హాళ్ళన్నీ శబ్దాన్ని వినిపించే సామగ్రితో సినిమా ‘టాకీస్’ అయ్యాయి.‘ఆలమ్ ఆరా’ అంటే లోకానికి ఆభరణం, దీపం అని స్థూలంగా అర్థం. సాధారణంగా ఆడపిల్లలకు పెట్టే పేరు. ఆ సినిమాలో కథానాయిక పాత్ర పేరు అదే! మన టాకీల చరిత్రకు సంబంధించి కూడా ఆ పేరు అతికినట్లే సరిపోతుంది. ఆ చిత్రం మొదలు ఆట, మాట, పాటలే కీలకమైన దినుసులుగా మారిన మన భారతీయ సినిమా ఇవాళ్టికీ ఆ సక్సెస్ సూత్రాన్నే నిత్యనూతనంగా అనుసరిస్తోంది. అలరిస్తోంది. సహస్ర చంద్ర దర్శనం పూర్తి చేసుకున్నప్పటికీ, మన టాకీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది!
అన్నట్లు, ఈ తొలి భారతీయ టాకీ బొంబాయిలో విడుదలైన రోజునే మన తెలుగునేలపై తొలి పర్మనెంట్ థియేటరైన విజయవాడ ‘శ్రీమారుతీ సినిమా’లోనూ ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఇరానీ దగ్గర ‘ఇంపీరియల్’లో పనిచేస్తూ, ఆయన నిర్మించిన మూకీలు కొన్నింటికి దర్శకత్వం వహించిన మన హెచ్.ఎం. రెడ్డి కూడా ‘ఆలమ్ ఆరా’కు పనిచేశారు. అప్పటికే బొంబాయి సినీరంగంలో ఉన్న మన ఎల్.వి. ప్రసాద్ సైతం ఈ తొలి భారతీయ టాకీకి పనిచేశారు. చిన్న వేషం కూడా వేశారు
రెంటాల జయదేవ