dundi ganesh samithi
-
అధ్యాత్మికతలో రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
మధురానగర్ : అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగదని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కోగంటి అక్రమ అరెస్టును ఖండించారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో ఆదివారం అఖిల పక్షం ఆ«««దl్వర్యాన అధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. సత్యనారాయణపురంలోని బ్రాహ్మణ కల్యాణ మండపం విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అబాసుపాలయ్యారని గుర్తు చేశారు. డూండీ సేవా సమితి గౌరవాధ్యక్షుడిగా కోగంటి సత్యం చేసిన సేవలు నగర వాసులందరికీ చిరపరిచితమేనన్నారు. కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ నాయకులు ఫణికుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గిరిపురపు గ్రిటన్, ఆమ్ ఆద్మీ పార్టీ మఖ్య సలహాదారు హర్మహీందర్సింగ్ సహాని, బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి, కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిది మీసాల రాజేశ్వరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తమ్మపర్తి నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటా డానియేల్, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు లింగాల న రసింహులు, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె రామారావు, ఏపీసీఎల్సీ రాష్ట్ర ఉఫాద్యక్షుడు ఎస్ఎస్సీ బోస్ పాల్గొన్నారు. -
బొండా.. రాజకీయ గూండా
వ్యాపారవేత్త కోగంటి సత్యం విజయవాడ కల్చరల్ : ‘బొండా ఉమా ఓ రాజకీయ గూండా. తన ఆధిపత్యం కోసం ఎంతటి పనైనా చేస్తాడు.’ అని వ్యాపారవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డూండీ గణేశ్ సేవా సమితి చీలిక నేపథ్యంలో శుక్రవారం సంగీత కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక ఉత్సవాల్లో రాజకీయాలు చోటుచేసుకోవడం శుభం కాదన్నారు. మొదటి నుంచి బొండా ప్రవర్తన వివాదాస్పదంగానే ఉందని, ఘంటసాల సంగీత కళాశాలలో తన ఆధిపత్యం సాగించడానికి సమితిలోని పాత సభ్యులను బలవంతంగా బయటకు పంపడానికి కుట్రలు పన్నాడని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో రూ.30లక్షలు దారి మళ్లించిన వ్యక్తిని చేరదీయడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్నారు. గత ఏడాది ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్న పోతిన రాము మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా సేవా సమితి మారిందని, ప్రజలతో మమేకం కావాల్సిన వ్యక్తి ఒక సామాజికవర్గానికి కొమ్ముకాయడం మంచిది కాదని హితవు పలికారు. సమావేశంలో సంస్థ సభ్యులు ఫణిరాజ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘గణ’తంత్రం.. రాజకీయ మంత్రం
– డూండీ గణేశ్ సేవా సమితి ఉత్సవాల్లో రాజకీయ జోక్యం – రెండుగా చీలిన సమితి – అంతా తానై చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిధి – పాత సభ్యుల తొలగింపు – అనుయాయులకే పగ్గాలు – ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తంగా ఘంటసాల సంగీత కళాశాల భక్తితో చేయాల్సిన గణపతి పూజకు రాజకీయ భ్రుష్టు పట్టిస్తున్నారు. డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏటా విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో జరిగే వినాయక నవరాత్రోత్సవాలకు ఈసారి రాజకీయ రంగు పులుముతున్నారు. స్వార్థ ప్రయోజనాలకు భక్తుల మనోభావాలను పణంగా పెడుతున్నారు. ఉత్సవాలు నిర్వహించే పాత కమిటీని పూర్తిగా పక్కకునెట్టి.. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తన అనుయాయులను చేర్చి చక్రం తిప్పుతున్నారు. దీంతో కళాశాల ప్రాంగణం ప్రస్తుతం ఉత్సవ శోభను కోల్పోయి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ కల్చరల్ : డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత, నృత్య కళాశాలలో ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను తలపించేలా ఏటా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ఉత్సవాల నిర్వహణపై రాజకీయ జోక్యం ఎక్కువై వివాదాస్పదమైంది. కళాశాలలో గత ఏడాది భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో భక్తుల నుంచి పెద్దగా స్పందన ఉండదనుకున్న రాజకీయ నాయకులు వేడుకల నిర్వహణపై పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే, వారి అంచనా తప్పింది. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో 15లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలపై రాజకీయ కన్ను పడింది. ఈ సంవత్సరం 72 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఈసారైనా తన అధిపత్యం కొనసాగించడానికి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పాత కమిటీకి చెక్.. అనుయాయులతో కొత్త కమిటీ ఉత్సవాల్లో తన బలాన్ని ఎలాగైనా చూపించాలనుకున్న ప్రజాప్రతినిధి పావులు కదిపి పాత కమిటీని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో కమిటీ వ్యవహారాలు, జమా ఖర్చులు, జీవిత సభ్యుల పదవీకాలంపై ప్రశ్నించిన కమిటీ పెద్దలను పక్కనపెట్టి కొత్త కమిటీని నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాత కమిటీకి చెందిన కొందరు పెద్దల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. అయితే, సేవా సమితిని కాపాడుకోవటానికి పాత సభ్యులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, సమితిలో అధ్యక్షుడిగా ఉన్న తొండెపు హనుమంతరావు ఈ వివాదం నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత సభ్యుల తొలగింపు గత బుధవారం సంగీత కళాశాలలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, వేద గంగోత్రి వ్యవస్థాపకుడు వరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీని రిజిస్టర్ చేయకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఆగమశాస్త్ర ప్రకారం పూజాదికాలు నిర్వహించాలని, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరటంతో నిర్వాహకులు కొందరు స్థానిక ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆ ప్రజాప్రతినిధి కొత్త కమిటీలో తన అనుచరులను చేర్చి ఆది నుంచి నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న డూండీ గణేశ్ సేవాసమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం, వ్యవస్థాపక సభ్యుడు పోతిన రాము తదితరులకు స్థానం లేకుండా చేశారు. సీఎం దృష్టికి..? కమిటీలో స్థానం లేకుండా చేయడంతో సదరు ప్రజాప్రతినిధి వ్యవహారం నచ్చని సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఉత్సవాలను సొంతం చేసుకోవాలని ఆ ప్రజాప్రతినిధి అనుచరులంతా కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. పాత కమిటీ సభ్యులు కూడా తమ అనుచరులతో అక్కడే పహారా కాస్తున్నారు. -
రూ.30 లక్షలకు లెక్కల్లేవు
విజయవాడ కల్చరల్: డూండీ గణేష్ సేవా సమితిలో విభేదాలు భగ్గుమన్నాయి. గతేడాది ఉత్సవాల పేరుతో రూ.1కోటి పది లక్షలు వసూలు కాగా అందులో రూ.30 లక్షలు పక్కదారి పట్టాయంటూ సేవా సమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం ఆరోపించారు. బుధవారం సంగీత కళాశాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సేవాసమితి తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. గత సంవత్సరం నిర్మించిన భారీ వినాయక విగ్రహం జమాఖర్చుల విషయంలో ఆవకతవకలు జరిగాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. చందాల వసూళ్ల నుంచి విగ్రహనిర్మాణం, లడ్డూప్రసాదాలు, నిర్వహణ వరకు అన్నింటా భారీఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తూ లెక్కలు అడుగుతుంటే నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. తాజా పరిణామాలు సేవా సమితి పేరుతో జరిగిన దోపిడీని బహిర్గతం చేస్తోందనే వ్యాఖ్యలు బలం పుంజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ కోగంటి ఆధిపత్య పోరు సంగీత కళాశాల కళావేదికపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా కోల్డ్వార్ నడుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే, కోగంటి సత్యం మధ్య పోరుసాగుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో సత్యంను దెబ్బతీసేందుకు సేవా సమితిలో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని రంగంలోకి దించారు. ఆరుగురికి స్థానం కల్పించారు. దీనిపై సత్యం గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అక్రమాలను గుట్టు రట్టు చేయడం ద్వారా ఇటు సేవాసమితికి అటు ఎమ్మెల్యేకు చెక్ పెట్టొచ్చన్నది సత్యం ఎత్తుగడగా తెలుస్తోంది. సత్యంను కమిటీ నుంచి సాగనంపేందుకు ఎమ్మెల్యే వర్గం కుయుక్తులు పన్నుతోంది. సత్యంకు ఎలాంటి సమాచారం లేకుండానే కొందరు సభ్యులు తరచూ విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా చవితి విజయవంతమయ్యేనా ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో డూండీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఏడాది గణపతి నవరాత్రుల వేడుక సజావుగా సాగేనా అన్న సందేహాలు భక్తులకు కలుగుతున్నాయి. గతేడాది నిర్వహించిన ఉత్సవాలకు అనూహ్య స్పందనవచ్చింది. కీచులాటల క్రమంలో సమితి ప్రతిష్ట రోడ్డున పడ్డట్లైంది. భక్తి ముసుగులో సేవా సమితి సభ్యులు కొందరు చేస్తున్న ఆగడాలపై భక్తులు చీదరించుకుంటున్నారు. గతేడాది ఉత్సవాలకు సంబంధించి జమాఖర్చుల్ని బయటపెట్టి నిజాయితీని నిరూపించుకోవాలని కోరుతున్నారు.