‘గణ’తంత్రం.. రాజకీయ మంత్రం
‘గణ’తంత్రం.. రాజకీయ మంత్రం
Published Fri, Sep 2 2016 10:40 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
– డూండీ గణేశ్ సేవా సమితి ఉత్సవాల్లో రాజకీయ జోక్యం
– రెండుగా చీలిన సమితి
– అంతా తానై చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిధి
– పాత సభ్యుల తొలగింపు – అనుయాయులకే పగ్గాలు
– ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తంగా ఘంటసాల సంగీత కళాశాల
భక్తితో చేయాల్సిన గణపతి పూజకు రాజకీయ భ్రుష్టు పట్టిస్తున్నారు. డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏటా విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో జరిగే వినాయక నవరాత్రోత్సవాలకు ఈసారి రాజకీయ రంగు పులుముతున్నారు. స్వార్థ ప్రయోజనాలకు భక్తుల మనోభావాలను పణంగా పెడుతున్నారు. ఉత్సవాలు నిర్వహించే పాత కమిటీని పూర్తిగా పక్కకునెట్టి.. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తన అనుయాయులను చేర్చి చక్రం తిప్పుతున్నారు. దీంతో కళాశాల ప్రాంగణం ప్రస్తుతం ఉత్సవ శోభను కోల్పోయి ఉద్రిక్తంగా మారింది.
విజయవాడ కల్చరల్ :
డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత, నృత్య కళాశాలలో ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను తలపించేలా ఏటా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ఉత్సవాల నిర్వహణపై రాజకీయ జోక్యం ఎక్కువై వివాదాస్పదమైంది. కళాశాలలో గత ఏడాది భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో భక్తుల నుంచి పెద్దగా స్పందన ఉండదనుకున్న రాజకీయ నాయకులు వేడుకల నిర్వహణపై పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే, వారి అంచనా తప్పింది. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో 15లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలపై రాజకీయ కన్ను పడింది. ఈ సంవత్సరం 72 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఈసారైనా తన అధిపత్యం కొనసాగించడానికి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
పాత కమిటీకి చెక్.. అనుయాయులతో కొత్త కమిటీ
ఉత్సవాల్లో తన బలాన్ని ఎలాగైనా చూపించాలనుకున్న ప్రజాప్రతినిధి పావులు కదిపి పాత కమిటీని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో కమిటీ వ్యవహారాలు, జమా ఖర్చులు, జీవిత సభ్యుల పదవీకాలంపై ప్రశ్నించిన కమిటీ పెద్దలను పక్కనపెట్టి కొత్త కమిటీని నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాత కమిటీకి చెందిన కొందరు పెద్దల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. అయితే, సేవా సమితిని కాపాడుకోవటానికి పాత సభ్యులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, సమితిలో అధ్యక్షుడిగా ఉన్న తొండెపు హనుమంతరావు ఈ వివాదం నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాత సభ్యుల తొలగింపు
గత బుధవారం సంగీత కళాశాలలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, వేద గంగోత్రి వ్యవస్థాపకుడు వరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీని రిజిస్టర్ చేయకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఆగమశాస్త్ర ప్రకారం పూజాదికాలు నిర్వహించాలని, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరటంతో నిర్వాహకులు కొందరు స్థానిక ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆ ప్రజాప్రతినిధి కొత్త కమిటీలో తన అనుచరులను చేర్చి ఆది నుంచి నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న డూండీ గణేశ్ సేవాసమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం, వ్యవస్థాపక సభ్యుడు పోతిన రాము తదితరులకు స్థానం లేకుండా చేశారు.
సీఎం దృష్టికి..?
కమిటీలో స్థానం లేకుండా చేయడంతో సదరు ప్రజాప్రతినిధి వ్యవహారం నచ్చని సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఉత్సవాలను సొంతం చేసుకోవాలని ఆ ప్రజాప్రతినిధి అనుచరులంతా కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. పాత కమిటీ సభ్యులు కూడా తమ అనుచరులతో అక్కడే పహారా కాస్తున్నారు.
Advertisement