జల్సాల కోసం బైక్‌ల చోరీ
పోలీసులకు చిక్కిన ఆరుగురు నిందితులు
11 ద్విచక్రవాహనాలు స్వాధీనం
గణపురం : జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వారి నుంచి పోలీసులు 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి కథనం ప్రకారం.. గణపురం మండల కేంద్రానికి చెందిన పరకాల రవీందర్(పెయింటర్), మహమ్మద్ ముజాహిద్(మెకానిక్), సురాసి పృథ్వీ(పెయింటర్), గౌరిశెట్టి సాయితేజ(పెయింటర్)తోపాటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ముషం శివ, అదే జిల్లాకు చెందిన కమాన్‌పూర్ గ్రామానికి చెందిన మంతిని మహేష్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇంటి ముందు నిలిపిన బైక్‌లను తమ వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో స్టార్ట చేసుకొని తీసుకెళ్లేవారు. ఇలా హుజురాబాద్‌లో 3, జమ్మికుంటలో 2, మంచిర్యాలలో 1, గూడురులో 1, కమలాపురంలో 1, పరకాలలో 1, హన్మకొండ భీమారం లో 1, గణపురంలో 1 బైక్ దొంగిలించారు. ఈ క్రమంలో గణపురం పోలీసు లు, సీసీఎస్ పోలీసులు గాంధీనగర్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి తాళాలు తీసే పద్ధతిని స్వయంగా చూపించారు. ఈ కీతో ఎలాంటి బండివైనా తాళం తీయవచ్చని తెలిపారు. ఇలా అపహరించిన బైక్‌లను అతితక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారని విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ములుగు సీఐ శ్రీనివాసరావు, గణపురం ఎస్సై విజయ్‌కుమార్, క్రైం సీఐ బాబురెడ్డి, ఏఎస్సై రమణారెడ్డి,సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.