ఓటు బంధం..
జన చైతన్యం
పెరిగిన ఓటర్ల సంఖ్య 1,26,439
జిల్లాలో మొత్తం ఓటర్లు 28,12,636 మంది
ముగింపు దశకు జాబితాల రూపకల్పన
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరున తుది ఓటర్లు జాబితాను విడుదల చేయనున్నారు. ముందెన్నడూ లేనివిధంగా జిల్లా మొత్తం మీద 1లక్షా 26వేల 439 మంది ఓటర్లు పెరిగారు. ఇందులో 60 వేలకు పైగా యువ ఓటర్లు ఉన్నట్లు అంచనా. మార్పులు, చేర్పుల అనంతరం జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య శుక్రవారం నాటికి 28లక్షల 12 వేల 636కు చేరుకుంది. ఈ సంఖ్యలో కొంతమేర మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. నవంబర్ 18న ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ప్రక టించింది. అప్పటికి జిల్లాలో 27లక్షల 7వేల 467 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 13లక్షల 35వేల 797 మంది కాగా, మహిళలు 13,71,670 మంది. వాస్తవానికి ఈనెల 15 నాటికే తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది.
డూప్లికేట్ ఓట్ల తొలగింపు, ఇతర కార్యక్రమాల వవల్ల రానున్న సాధారణ ఎన్నికలకు తప్పుల్లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంతో పక్కా జాబితాను రూపొందించేందుకు అధికారులు నడుం బిగించారు. తుది జాబితాను ఈ నెలాఖరున జిల్లాలోని 3,308 పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో ఓటర్లు 26లక్షల 86వేల 197 మందిగా లెక్కతేలారు. కొత్త ఓటర్ల చేర్పులు, నియోజకవర్గాల మార్పుల రూపేణా 2లక్షల 67వేల 825 మంది అదనంగా చేరారు. మొత్తం ఓటర్లలో మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు 1లక్షా 41వేల 386 మంది ఉన్నట్టు లెక్క తేల్చారు. వీరిని తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడంతో జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 28లక్షల 12వేల 636కు చేరినట్టు ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి తేల్చింది.