Duttaluru
-
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ రోజు ఉదయం రెండు సార్లు.. కొద్ది సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల పైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు
నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుత్తలూరు మండలం ఏరుకోలులో ఏర్పడ్డ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఏరుకోలులో దాంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడకు మోహరించారు. అయితే పోలీసులపై దాడి చేసి, పోలీస్ జీపును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఇక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. మండలంలోని ఏరుకొల్లులో 108వ పోలింగ్ బూత్ వద్ద నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేసి పలువురిని గాయపడిచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు వృద్ధులు, మధ్య వయస్కులను పోలింగ్ బూత్‌లోకి తీసుకొచ్చి వారే ఓటు వేస్తుండటంతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై పోలింగ్ బూత్ వెలుపల వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం నడిచింది. ముందస్తు ప్రణాళికతో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్ఆర్ సీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీకి చెందిన చేజర్ల శ్రీనివాసులరెడ్డి, షేక్ హజరత్ తలలకు బలమైన గాయాలయ్యాయి. -
వైఎస్సార్ పేరుతో శ్రమశక్తి సంఘాలు
దుత్తలూరు, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ పేర్లపై ఉపాధి హామీ కూలీలు శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని తురకపల్లి, జంగాలపల్లి, పాపంపల్లి, రెడ్లదిన్నె, రాచవారిపల్లి, వెంకటంపేట, బ్రహ్మేశ్వరం తదితర గ్రామాల్లో వైఎస్సార్ పేరిట, భైరవరం, వెంకటంపేట, రాచవారిపల్లి, తురకపల్లి, బోడవారిపల్లి తదితర గ్రామాల్లో జగన్, వైఎస్ జగన్ పేరిట, తురకపల్లిలో వైఎస్ విజయమ్మ పేరుతో శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేయాలంటే తప్పనిసరిగా శ్రమశక్తి సంఘంగా ఏర్పడాల్సి ఉంటుంది. సాధారణంగా శ్రమశక్తి సంఘాలకు గ్రామదేవతలు, ఇష్ట దేవతలు పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆయా గ్రామాల కూలీలు మాత్రం వైఎస్సార్, జగన్, వైఎస్ విజయమ్మ తదితర పేర్లతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలో దాదాపు 13 సంఘాలు వీరి పేర్లతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం విశేషం. -
‘కోడ్’ పట్టని అధికారులు
న్యూస్‌లైన్ , దుత్తలూరు,ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఎటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండకూడదని ఆదేశాలిచ్చారు. మండలంలో చాలా చోట్ల అటువంటి ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినా ఇంకా కొన్నిచోట్ల ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నర్రవాడలో విద్యుత్ స్తంభానికి టీడీపీ జెండా, పోస్టర్లు వేలాడుతున్నాయి. వెంగనపాళెం పంచాయతీ కార్యాలయం గోడపై గతంలో ముద్రించిన రాజీవ్ యువకిరణాల బోర్డు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తోంది.