వైఎస్సార్ పేరుతో శ్రమశక్తి సంఘాలు
దుత్తలూరు, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ పేర్లపై ఉపాధి హామీ కూలీలు శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని తురకపల్లి, జంగాలపల్లి, పాపంపల్లి, రెడ్లదిన్నె, రాచవారిపల్లి, వెంకటంపేట, బ్రహ్మేశ్వరం తదితర గ్రామాల్లో వైఎస్సార్ పేరిట, భైరవరం, వెంకటంపేట, రాచవారిపల్లి, తురకపల్లి, బోడవారిపల్లి తదితర గ్రామాల్లో జగన్, వైఎస్ జగన్ పేరిట, తురకపల్లిలో వైఎస్ విజయమ్మ పేరుతో శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి.
ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేయాలంటే తప్పనిసరిగా శ్రమశక్తి సంఘంగా ఏర్పడాల్సి ఉంటుంది. సాధారణంగా శ్రమశక్తి సంఘాలకు గ్రామదేవతలు, ఇష్ట దేవతలు పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆయా గ్రామాల కూలీలు మాత్రం వైఎస్సార్, జగన్, వైఎస్ విజయమ్మ తదితర పేర్లతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలో దాదాపు 13 సంఘాలు వీరి పేర్లతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం విశేషం.