dwaraka rirumala
-
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో.. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ. గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. అదనంగా.. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది. ఇక తిరుమల వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వై..వి. సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. ముందుగా నిర్ణయించిన మేరకే ఉదయం 6 గంటలకు సర్వ దర్శనం ప్రారంభించాం. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుమల రావాలి. ఆన్ లైన్ లో రోజుకు 20 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేశాం. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వ దర్శన టోకెన్లు నాలుగున్నర లక్షలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో స్వర్ణ రథంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రిలో తొలిసారి.. యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మానం తర్వాత తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నార లక్ష్మీనరసింహ స్వామి. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసానుంది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు జిల్లా చిన్నతిరుపతి ద్వారకా తిరుమల ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్నారు భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఇరుముడి సమర్పిస్తున్నారు గోవింద స్వాములు. భద్రాచలం రాములోరి చెంత.. భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేదఘోష నడుమ తెరుచుకుంది వైకుంఠ ద్వారం. ఉదయం 5.01 గంటల నుంచి 5.11 గంటల వరకు వినతాసుత వాహన కీర్తన నాదస్వరం నిర్వహించారు. ఉదయం 5.11 గంటల నుంచి 5.21 గంటల వరకు ఆరాధన, శ్రీరామ షడ క్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. 5.30 గంటల నుంచి 5.40 గంటల వరకు స్థానాచార్యులచే ద్వార దర్శన ప్రాశస్తం చెప్పబడింది.ఆ తర్వాత 108 ఒత్తులతో హార తినిస్తూ శరణాగతి గద్యవిన్నపం చేశారు. ఉదయం 6 గంటలకు అదిగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి శ్రీ స్వామి వారి ఉత్థాపన జరిగింది. ఆపై భక్తులకు స్వామి మూలవరుల దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలో భక్తుల కిటకట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు. రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు హరి హరులు. స్వామి వార్లను దర్శించుకున్నారు భక్తులు. ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కొలువు దీరాడు జగదభి రాముడు. తెల్లవారు జామున 5 గంటల నుండి సీతానాయకుని దర్శనం కోసం పోటెత్తింది భక్తజనం. గోవింద నామ స్మరణతో మార్మోగుతోంది కోదండ రామాలయం. ఇక.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలి గడప దేవుని కడపలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు ఓరుగల్లు ఆలయాలకు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వార ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బట్టలబజార్ లోని బాలానగర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు. హన్మకొండ ఎక్సైజ్ కానీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారా ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. -
అసువులు తీసిన అప్పులు
– ఉరి కొయ్యను ఆశ్రయించిన రైతు – వరుస నష్టాలే కారణం – భూమి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో మంజూరు కాని బ్యాంక్ రుణం – ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో ఘటన ద్వారకాతిరుమల : పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఓ రైతు అసువులు తీశాయి. వరుస నష్టాలు అతడిని నిలబడనివ్వలేదు. బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని కాస్త ఉపశమనం పొందుదామంటే.. అతడి భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. కుటుంబ సభ్యులకు గుప్పెడు మెతుకులు పెట్టే దారిలేక.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా చేరినా.. అప్పటికే చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వలేదు. దిక్కులేని స్థితిలో ఆ రైతు ఉరికొయ్యను ఆశ్రయించి అసువులు తీసుకున్నాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది. రూ.లక్షలు పెట్టుబడి పెడితే చిల్లగవ్వ కూడా రాలేదు దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన ఆకుల సత్యనారాయణకు కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన హేమలతతో 15 సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహానంతరం సత్యనారాయణ తూర్పు యడవల్లిలో స్థిరపడ్డాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 75 సెంట్ల వ్యవసాయ భూమి భార్యద్వారా సంక్రమించగా.. ఆ పొలంతోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని సత్యనారాయణ కౌలుకు తీసుకుని మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. మిరప, నిమ్మ, దొండ పంటలను సాగు చేస్తున్నాడు. దొండ సాగు అతడిని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఐదు నెలల క్రితం నాటిన దొండపాదులు ఎండిపోవడంతో వెంటనే అప్పులు చేసి మళ్లీ అదే పంట వేశాడు. ఆ పాదులు కూడా ఎండిపోవడంతో నిరాశకు గురయ్యాడు. దాదాపు రూ.3 లక్షల మేర పెట్టుబడులు పెడితే చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులను పోషించుకోవడం కష్టమైంది. ఆర్థిక ఇబ్బందులను తాళలేక సీహెచ్.పోతేపల్లిలోని గోద్రేజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో గెలల అన్లోడింగ్ చేసే పనిలో కూలీగా చేరాడు. వ్యవసాయంపై మక్కువ చావక తన పొలంలో మరోసిరొ మిరప పంట వేశాడు. భార్యద్వారా సంక్రమించిన భూమిపై బ్యాంకు రుణం తీసుకుని ప్రై వేట్ అప్పుల్లో కొంతైనా తీర్చి ఉపశమనం పొందాలనుకున్నాడు. భూమి రికార్డులు ఆన్లైన్ కాకపోవడంతో రుణం ఇవ్వడం కుదరదని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు. మూడేళ్లపాటు దఫదఫాలు చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు చేరడంతో ఎలా తీర్చాలో తెలియక సత్యనారాయణ సతమతమయ్యేవాడు. ఇదే విషయాన్ని తమ వద్ద పదేపదే అంటుండేవాడని భార్య హేమలత, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం పొందాడు. సత్యనారాయణ, హేమలత దంపతులకు సురేష్‌కుమార్ (15), హరీష్ (13) అనే కుమారులున్నారు. ‘అమ్మను పొలానికి రావద్దను’ రోజులానే మంగళవారం ఉదయం ఇంటినుంచి బయల్దేరిన సత్యనారాయణ పొలానికి చేరుకున్నాడు. మిరప పంటకు తడిపెట్టే సమయంలో అతని చిన్న కుమారుడు హరీష్ టిఫిన్ తీసుకెళ్లాడు. టిఫిన్ చేసిన అనంతరం పొలం నుంచి ఇంటికి వెళుతున్న కుమారుణ్ణి వెనక్కి పిలిచిన సత్యనారాయణ ‘మధ్యాహ్నం మీ అమ్మ పొలానికి వస్తుందేమో.. రావద్దని చెప్పు. సాయంత్రం నేనే ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పి పంపాడు. అతని రాక కోసం రాత్రి వరకు ఎదురు చూసిన భార్య హేమలత ఆ తరువాత భర్తను వెదుక్కుంటూ పొలానికి బయలుదేరింది. సమీపంలోని పొలానికి చెందిన రైతు ఆమెకు ఎదురై నీ భర్త పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. భోరున విలపిస్తూ్త ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పుల బాధలే తన భర్తను పొట్టన పెట్టుకున్నాయని భార్య హేమలత రోదిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మతిచెందాడన్న వార్త తెలుసుకున్న తోటి రైతులు, ఇంటి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక పోలీసులకు సమాచారం అందగా, బుధవారం ఉదయం భీమడోలు ఎసై ్స బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల స్టేషన్ రైటర్ టి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.