కేంద్ర బడ్జెట్ యథాతథం
ప్రతిపక్షాలు ఏమన్నా కూడా.. బడ్జెట్ను యథాతథంగా బుధవారమే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా నిర్ధారించారు. తాను బడ్జెట్ ప్రవేశపెడతానని, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి లోక్సభ టీవీ లైవ్లో దాన్ని చూడాలని అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మాజీమంత్రి, కేరళ ఎంపీ మరణించడం వల్ల బడ్జెట్ను వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీయూ లాంటి పక్షాలు కోరుతున్నా, సభ్యుల మృతివల్ల బడ్జెట్ వాయిదా పడదని స్పీకర్ కార్యాలయం కూడా వారికి తెలిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. కావాలనే అహ్మద్ మృతివార్తను అధికారికంగా ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ.. కేంద్రం మాత్రం తొలుత అహ్మద్ మృతికి సంతాపం తెలిపి, ఆ తర్వాత బడ్జెట్ యథాతథంగా ప్రవేశపెడతారని చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మద్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంతకుముందే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు బడ్జెట్ ప్రతులను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీసుకెళ్లి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన దానికి ఆమోదముద్ర కూడా వేసినట్లు తెలిసింది. అహ్మద్ ఇంటి నుంచి ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు.
ఇక బడ్జెట్ వాయిదా వేయడం సాధ్యం కాదని, అలాగే అది సరి కూడా కాదని రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ చెప్పారు. ఇప్పటికే పార్లమెంటుకు కూడా బడ్జెట్ ప్రతులు చేరినందున ఈరోజు ప్రవేశపెట్టడమే సబబన్నారు.