e - learning
-
నెట్టింట్లోకి మారిన క్లాస్రూమ్ అడ్రస్
సాక్షి, హైదరాబాద్ : చదువు కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి వరకు స్కూలు నుంచి ఇంటికొచ్చాక ట్యూషన్లు, హోంవర్క్‌లతో చిన్నారులను తల్లిదండ్రులు బిజీగా ఉంచేవారు. కానీ ఇప్పుడు ఆ ‘బిజీ’నెస్ కాస్త రూటు మారింది. చదువులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించుకొని ‘ఆన్లైన్’గా మారిపోయాయి. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్స్‌కు దీటుగా.. ప్రైవేట్ వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా.. మొబైల్ యాప్‌లను రూపొందించాయి. తమ యాప్ బాగుంటుందంటే తమ యాప్ ఎక్కువ ఉపయోగకరమంటూ పోటీ పడుతున్నాయి. ఇలా పదుల సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన లెర్నింగ్ యాప్‌లలో దేన్ని కొనుగోలు చేయాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. పదులు, వందల రూపాయల లెవల్ దాటి.. ఒక్కో తరగతికి వేల రూపాయల డబ్బు వసూలు చేస్తున్నారు. అయినా.. పిల్లల చదువులకోసం ఏమైనా చేయాల్సిందేనంటూ తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. సాధారణ స్కూళ్లలో ఫీజుల కంటే ఎక్కువైనా భరించేందుకు సిద్ధపడుతున్నారు. పాఠాలే కాదు.. డౌట్స్ కూడా తీరుస్తారు విద్యార్థులకు ఆన్లైన్ చదువులు లక్ష్యంగా ప్రతి సంస్థ వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. త్రీడీ, యానిమేషన్ మేళవించి రూపొందించిన పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాయి. అంతేకాకుండా విద్యార్థుల పరిసరాల్లోని పరిస్థితులతో పాఠ్యాంశాలను అన్వ యించి అందించే బోధనతో కూడిన వీడియో పాఠాలను అందు బాటులోకి తెచ్చాయి. విద్యార్థులకు అర్థం కాకపోతే.. ఆన్లైన్లో నివృత్తి చేసేందుకు 24 గంటలు పనిచేసే కాలింగ్ సదుపాయం కల్పించాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా ఆన్లైన్లోనే సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టాయి. విద్యార్థి తనకు అర్థంకాని ప్రాబ్లంను ఆన్లైన్లో పంపిస్తే దానికి ఆన్లైన్లోనే సమాధానం ఇచ్చేలా చర్యలు చేపట్టాయి. ప్రతి విద్యార్థి తరగతి వారీగా చూసే వీడియో పాఠశాలపై ప్రశ్నలు ఇచ్చి వారు ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేసేందుకు ‘ఇండివిజువల్ అనలిటికల్ రిపోర్టు’అందిస్తూ దానికి అనుగుణంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టాయి. పోటీ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతూ.. ప్రిపేర్ అయ్యేలా చర్యలు చేపట్టడంతోపాటు కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశాయి. ఇంకొన్ని ఈ–లెర్నింగ్ సంస్థలైతే.. గ్రూప్‌లను క్రియేట్ చేసి ఇతరులతో గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాయి. స్కూల్ ఫీజుల కంటే అత్యధికంగా వసూళ్లు సాధారణ స్కూల్ ఫీజుల కంటే ఒక్కో తరగతికి అందించే ఆన్లైన్ లెర్నింగ్ సబ్‌స్క్రిప్షన్‌కు ఈ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. తరగతిని బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నాయి. కనీసంగా ఒక్కో తరగతికి ఒక్కో విధంగా రూ.15 వేల నుంచి రూ.35 వేల వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఐఐటీ, నీట్ బేస్డ్గా అందించే చదువులకు రేటు ఎక్కువ. మరోవైపు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేదా 12వ తరగతి వరకు ప్యాకేజీల రూపంలో స్పెషల్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి. ఇలా అన్ని తరగతులకు తీసుకుంటే రూ.95వేల నుంచి దాదాపు రూ.1.20లక్షల వరకు తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తోంది. కొన్సి సంస్థలు తమ ఆన్లైన్ కోర్సులను తీసుకునే వారికి ట్యాబ్‌లు, వీడియో పాఠాలతో కూడిన ఎస్డీ కార్డులను అందిస్తున్నాయి. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో కూడా.. వీటితో పాటు పత్రికారంగంలోని ఆన్లైన్ యాప్‌లు కూడా విస్తృతాదరణ పొందుతున్నాయి. ఇందులో ‘సాక్షి’మీడియా గ్రూప్..www.sakshieducation.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ కంటెంట్‌ను, వీడియో పాఠాలను విద్యార్థులకు అందిస్తోంది. ఇక్కడే ప్రాక్టీస్ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తోంది. నిపుణుల సలహాలు, సూచనలు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, టిప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. బాధ్యతగా ఉండే వారికి మంచి ప్లాట్ఫారం ఆన్లైన్ లెర్నింగ్ యాప్‌లు సెల్ఫ్ రెస్పాన్స్‌బుల్‌గా ఉండే వారికి ఎక్కువ ఉపయోగం. ప్రస్తుతం ఆన్లైన్ లెర్నింగ్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారిలో 20% మాత్రమే సరిగ్గా వినియోగిస్తున్నారు. మిగతావారు డబ్బులు చెల్లించి వదిలేస్తున్నారు. ఆన్లైన్ లెర్నింగ్ కంటే క్లాస్రూమ్ లెర్నింగే ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇంటరాక్షన్ ఇక్కడే ఉంటుంది. తరగతిలోని విద్యార్థుల స్థాయిని టీచర్లు అర్థం చేసుకుని వారికి సరిపోయే విధంగా మార్పులు చేస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంది. - వెంకట్ కంచనపల్లి, సీఈవో సన్‌టెక్ -
ఏబీసీడీ
- నట్టింట్లో పాఠాలు ఆదరణ చూరగొంటున్న ఈ- లర్నింగ్ - సీడీల ద్వారా ఇంట్లోనే - విద్యాబోధనఆసక్తి చూపుతున్న విద్యార్థులు న్యూస్‌లైన్, కర్నూలు(విద్య), ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని నట్టింట్లోకి పాఠాలు వచ్చేశాయి. రెండు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి, బాలమిత్ర వంటి పుస్తకాల ద్వారా నీతి కథలను చదివే బాలలు నేడు ఆడియో, వీడియో రూపంలో వచ్చే సీడీ(కాంపాక్ట్ డిస్క్) ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సీడీల ద్వారా సినిమా రూపంలో పిల్లలకు తల్లిదండ్రులు నైతికవిలువలు, మానవత్వ విలువలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, చిన్న కుటుంబాలు ఏర్పడుతున్న ఈ కాలంలో చిన్నపిల్లలకు సీడీల్లో లభ్యమయ్యే నీతికథలు సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాయి. వారిలో మానసిక స్థైర్యాన్ని అందించి ధైర్యానికి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం నీతి కథలే గాకుండా ఎడ్యుకేషన్ సీడీలు సైతం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులతో పాటు, కుటుంబసభ్యులు, పెద్దలు ఇలాంటి సీడీలను బహుమతులుగా అందజేసి విజ్ఞానాన్ని పంచుతున్నారు. జిల్లాలో డిపార్ట్మెంట్ స్టోర్లతో పాటు పలు పుస్తక, సీడీల విక్రయ కేంద్రాల్లో ఇలాంటి సీడీలు అమ్మకాలు జరుగుతున్నాయి. సీడీల్లో పురాణకథలు: ఒకప్పుడు పురాణకథల గురించి తెలుసుకోవాలంటే చిన్నారులకు బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి వంటి పుస్తకాలు చదివేవారు. పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి చిన్నారులకు లేకపోవడం, ఆ స్థానం టెలివిజన్లు ఆక్రమించాయి. ఇదే సమయంలో సీడీల ద్వారా నీతికథలను అందించేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. దృశ్య, శ్రవణ రూపంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో రూపొందించిన కథలు చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రామాయణ, మహాభారత కథలు చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఉండటంతో వీటి డిమాండ్ బాగా పెరిగింది. పిల్లలకు కథలు చెప్పే ఓపిక, తీరిక లేని తల్లిదండ్రులు, పెద్దలు విజ్ఞాన, వినోదాలను అందించేందుకు ఇలాంటి సీడీలను కొని ఇస్తున్నారు. టీవీ, కంప్యూటర్లలో ఈ లర్నింగ్: ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లో నేడు టెలివిజన్‌తో పాటు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు కంప్యూటర్లూ కొనుగోలు చేస్తున్నారు. పురాణకథలు, కామిక్, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సీడీలను చిన్నారులు డీవీడీలు, కంప్యూటర్ల ద్వారా ప్లే చేస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ తరహాలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్ సీడీలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవసరమైన పాఠ్యాంశాలను నేరుగా ఉపాధ్యాయుడు బోధించినట్లు ఈ-లర్నింగ్ ఉపయోగపడుతోంది. ఎడ్యుకేషన్‌తో పాటు యోగా, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వంటి అంశాల సీడీలను సైతం పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందురోజు ఇంటి వద్ద పుస్తకాలు తిరగేసి సిద్ధమై వస్తాడు. వాటిని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో ప్రశ్న పూర్తి కాకముందే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు. దీంతో అవాక్కవడం ఉపాధ్యాయుని వంతవుతోంది. ఇది మార్కెట్లలో లభించే ఎడ్యుకేషన్ సీడీల పుణ్యమేనని తెలుసుకుని, టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠ్యాంశాలు బాగా అర్థమవుతున్నాయి ఎడ్యుకేషన్ సీడీలతో తరగతి గదిలో చెప్పిన పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. సైన్స్, మ్యాథ్స్, గ్రామర్ సీడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు కామిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం వంటి సీడీలు తెచ్చుకున్నాను. తీరిక వేళల్లో వీడియోగేమ్ సీడీలు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. -ఎం. శ్రీనివాస్, చాణిక్యపురికాలని, కర్నూలు యానిమేషన్ మూవీలంటే ఇష్టం నాకు యానిమేషన్ మూవీలంటే ఇష్టం. ఇటీవల బాలకృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు వంటి దేవతలపై రూపొందించిన సీడీలు బాగా చూస్తాను. వీటితో పాటు అమ్మానాన్నలు మాకు చదువుకునేందుకు అవసరమైన సీడీలు సైతం కొనిస్తున్నారు. ఇవి సైతం నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -అఖిల, కర్నూలు