ఈ-పాలన అమలు అంతంతే!
► పూర్తిస్థాయిలో అమలు కాని వైనం
► కలెక్టరేట్ తప్ప మిగిలిన శాఖల్లో మొక్కుబడే
► నెలలో జిల్లా స్థాయి ఈ- ఫైళ్లు 1,910
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొదటి దశలో పది ప్రభుత్వ శాఖలో ఈ-పాలన (ఈ-ఆఫీస్)కు గత నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. అయితే ఈ- పాలన అంతంత మాత్రంగానే అమలవుతోంది. కలెక్టర్ కార్యాలయం మినహా మిగిలిన తొమ్మిది శాఖల్లో తూతూ మంత్రంగా నిర్వహిస్తునట్టు తెలుస్తోంది. తొలి దశ పరిస్థితే ఇలా ఉంటే, ఇక రెండవ దశ కింద 92 శాఖల్లో ఈ- పాలన ఏ మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
నెల రోజుల్లో 1,910 ఫైళ్లే
తొలిదశలో రెవెన్యూ. డ్వామా, డీఆర్డీఏ, మునిసిపల్ కార్పొరేషన్, జిల్లా సరఫరాలు, జిల్లా పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఖజానా శాఖలలో ఈ-పాలన అమలు ప్రారంభించారు. వీటిలో వంద శాతం ఫైళ్లు ఈ- పాలన ద్వారానే సాగాలని కచ్చితమైన ఆదేశాలిచ్చారు. అయితే ఈ- పాలన ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. కలెక్టర్ కార్యాలయంలో పర్వాలేదన్న రీతిలో అమలవుతున్నా, మిగిలిన తొమ్మిది శాఖల్లో మొక్కుబడి తంతే అయ్యింది. నెల రోజు వ్యవధిలో జిల్లా స్థాయికి సంబంధించిన పదిశాఖల పరిధిలో 1,910 ఫైళ్లు, రాష్ట్ర స్థాయికి సంబంధించి 1,124 ఫైళ్లు ఈ- పాలన ద్వారా సాగాయి.
ఆరంభశూరత్వం..
ప్రతి రోజు ఈ- పాలన అంశంపై ఏకధాటిగా సమీక్షలు నిర్వహించారు. వంద శాతం అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఒక్క ఫైలు కూడా మాన్యువల్‌గా జరగకూడదని చెప్పారు. అయితే ఇది ఆరంభ శూరత్వమే అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ-పాలనపై సమీక్షలు మచ్చుకు కనిపించడం లేదు.
ఈ- పాలన ఇలా...
ఇక ఫైళ్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ప్రజలు ఏదేని సమస్యపై అర్జీ ఇచ్చినప్పుడు టపాలాలో దాన్ని స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా సంబంధిత విభాగం గుమస్తాకి పంపిస్తారు. దాన్ని ఆ గుమస్తా పరిశీలించి నోట్ ఫైల్ (ముసాయిదా లేఖ) లేదా ఉత్తర్వులు సిద్ధం చేసి ఆన్లైన్లో ఉంచుతారు.
సీఎం డాష్ బోర్డులో...
ప్రతి ఫైలు వివరం సీఎం డాష్‌బోర్డులో ఉంటుంది. దీన్ని నేరుగా కలెక్టర్ ఆ తరువాత నోడల్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు. ఫైలు ఎప్పుడు ఉంచారు. ఏన్ని రోజుల్లో క్లియర్ చేశారు. ఒక వేళ పరిష్కారం కాకపోయినా, జాప్యం చేసినా అది ఏ స్థాయిలో జరిగిందో కూడా తెలిసిపోతుంది. దీంతో అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు.