సెట్టింగ్..అదుర్స్
మండపాల కళ..భళా రాజధానికి దీటుగా డెకరేషన్ వృద్ధి
♦ ఈ సెట్టింగ్‌లకు ప్రాధాన్యం..
♦ దేవాలయ ప్రాంగణంలా సెట్టింగ్
♦ అందమైన ప్యాలెస్ క్రిష్టల్, శిల్పారాం
♦ కొబ్బరి ఆకులతో సంప్రదాయంగా
♦ మండపం మొత్తం హరితవనంలా
♦ ఎటు చూసినా అందమైన పూలు కనపడేలా..
సెట్టింగ్ రూటే..సప‘రేటు’..
పగటి పూట వేడుకలకు సెట్టింగ్‌కు కనీసం రూ.40వేలు
ఇక భారీ డెకరేషన్‌కు రూ.6లక్షల వరకు
రాత్రిపూట మండప సెట్టింగ్‌లకు రూ.4లక్షల నుంచి రూ.10లక్షలు
ఆరుబయట(ఓపెన్) సెట్టింగ్‌ల కోసమైతే రూ.20లక్షలు వెచ్చించిన వారూ ఉన్నారు
ఆకాశమంత పందిరే కాదు..నింగిలోని చుక్కలు కూడా దిగివచ్చాయా..అన్నట్లు మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతి..పూల మొక్కలతో పరుచుకున్న పచ్చందాలు..ఎటు చూసినా..అబ్బురపరిచే నగిషీలు, షామియానాల తోరణాలు అల్లుకొని వివాహ మండపాలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యకావ్యాలు సెట్టింగ్‌లతో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో హుందాను చాటి..ఇప్పుడు మనచెంతా డెకరేషన్ విశ్వరూపం దాల్చుతోంది. కాలేజీలో ఫేర్వెల్డే అయినా..గృహ ప్రవేశం చేసినా..కొత్త ఉత్పత్తిని పరిచయం చేయాలన్నా..మరే ఫంక్షనైనా సెట్టింగ్ ఉండాల్సిందే అన్నంతగా వృద్ధి చెందుతూ..అదుర్స్ అనిపిస్తోంది.
ఖమ్మం అర్బన్:
ఒకప్పుడు పెళ్లి అంటే తాటాకు పందిళ్లు, రంగుకాగితాలు, మామిడాకు తోరణాలు కనిపించేవి. ఆధునిక కాల ప్రభావంతో సంపన్నుల నుంచి మధ్యతరగతి వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలప్పుడు డెకరేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చి సరికొత్త సెట్టింగ్‌లతో వైభవంగా జరుపుకుంటున్నారు. వివాహం మాత్రమే కాదు..భారీ కార్యక్రమాల నుంచి చిన్న, చిన్న ఫంక్షన్లకు కూడా డెకరేషన్ ఉండాల్సిందే అంటున్నారు. కళాశాల ఈవెంట్లు, పాఠశాల వార్షికోత్సవాలు, గృహప్రవేశం, షోరూంల ప్రారంభం, రిటైర్డ్ ఫంక్షన్లు, పుట్టిన రోజు వేడుకలు, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్..ఇలా ఏదైనా సెట్టింగ్ కనపడాల్సిందే. ఒకప్పుడు సినిమాల్లో పాటల షూటింగ్ కోసం ఒక ప్రాంతాన్ని తలపించేలా సెట్టింగ్‌లు వేసి ఔరా అనిపించేవారు. వాటిని మనం తెరపై చూసి ఆనందించేవాళ్లం. ఇప్పుడు మనం ఎలాంటి సెట్టింగ్ కావాలంటే..అలాంటింది మన శుభకార్యాల్లో వేస్తున్నారు. హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో ఖమ్మంలో పలువురు కళాకారులు ఈ రంగంలో ఆరితేరారు. అనేక మంది డెకరేటర్లు మండపాల తయారీలో దిట్టగా నిలిచారు.
ఖమ్మం..డెకరేటర్ల గుమ్మం..
ఖమ్మంలో సెట్టింగ్‌లు వేయడం ద్వారా 500 మందికి పైగానే నిత్యం ఉపాధి పొందుతున్నారు. మండపాల తయారీ, సెట్టింగ్‌లు, పూల అలంకరణ తదితర పనుల్లో వందలాదిమంది కుటుంబాలకు ఉపాధిగా లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఒడిశా, తమిళనాడుకు చెందిన వారు కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. పని నైపుణ్యతను బట్టి నెలకు రూ.9 వేల నుంచి రూ.18 వేల వరకు చెల్లిస్తున్నట్లు ఒక డెకరేషన్ సంస్థ అధినేత తెలిపారు. ఖమ్మంలో చిన్న,పెద్ద స్థాయిల్లో డెకరేషన్ల వ్యాపారం చేసే వారు 100మందికి పైగానే ఉన్నారు. ఇందులో పెద్దపెద్ద మండపాల సెట్టింగ్‌లు వేసే వారు 65 మంది. వీరికి నిత్యం ఏదో ఒక శుభకార్యాలు ఉంటూనే ఉంటాయి. కల్యాణముహూర్తాలు ఉన్నప్పుడు వివాహ మండపాలు, సెట్టింగ్‌లతో బిజీబిజీ. తర్వాత మిగతా వేడుకలు కూడా చేస్తుంటారు. ఆధునిక ఫీచర్ మేకింగ్ తయారీ కూడా ఖమ్మంలో ప్రారంభమైంది. హైదరాబాద్, పుణె, ఢిల్లీ స్థాయిలో ఇక్కడా కంప్యూటర్ల ద్వారా మేకింగ్ పరిశ్రమ సాగుతోంది. కోయంబత్తూరు, బెంగళూరు, కడియం, బ్యాంకాంగ్ తదితర ప్రాంతాలనుంచి పూలను తెప్పించి డెకరేషన్ చేస్తున్నారు.