eamcet-2 leak
-
కేసీఆర్ రాజీనామా చేయాలి: డీకే అరుణ
హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంసెట్-2 లీకేజీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలనను పోలీసుల చేతుల్లో పెట్టి ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారన్నారు. ఎంసెట్ పేపర్ లీక్‌పై ముఖ్యమంత్రి కుటుంబంపై ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారారని ఆమె ధ్వజమెత్తారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిర్బంధం సాగిస్తున్నారని, ఎమ్మెల్యే సంపత్‌ను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని డీకే అరుణ అన్నారు. -
ఆ గ్రామాలు పాకిస్తాన్, బర్మాలో ఉన్నాయా?
హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన విద్యావైద్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్లను భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఇందుకు సంబంధించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ...అవినీతిని సహించనని చెప్పే సీఎం... 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు విపక్ష నేతలను వెళ్లనీయకపోవడం సరికాదని అన్నారు. ఆ గ్రామాలు పాకిస్తాన్, బర్మాలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. రైతులను నిర్బంధించి బలవంతంగా భూ సేకరణ చేయడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, మాగం రంగారెడ్డి తదితర నేతలు ఉన్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ఈ నెల 7న ఛలో మల్లన్నసాగర్‌కు పిలుపునిచ్చింది. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. మల్లన్నసాగర్లో లాఠీఛార్జ్ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మల్లురవి డిమాండ్ చేశారు. -
డీజీపీ, ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ భేటీ
హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీక్‌పై సీఐడీ అధికారులు నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. మరోవైపు ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శుక్రవారం సచివాలయానికి తరలి వస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారి ర్యాంకులు రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఎంసెట్ -2 లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు ఎంసెట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ -2ను రద్దు చేస్తే.. పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని దానికి బదులు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ.. కడియం, లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండి చేస్తూ.. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలు అరెస్ట్ చేశారు. -
సా.4 గంటలకు తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ, సీఐడీ విచారణ వివరాలను ఆయన వెల్లడించనున్నారు. మరోవైపు ఎంసెట్ లీకేజీపై సీఐడీ సహా ఉన్నతాధికారులతో ఇవాళ ఉదయం డీజీపీ భేటీ అయ్యారు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికిచ్చే నివేదికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీకేజీ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎంసెట్-2 పేపర్ లీక్ చేసిన నిషాద్‌ను పోలీసులు ముంబయిలో అరెస్ట్ చేశారు. అలాగే రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ నిర్వహకుడు వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. -
'లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి'
యాదగిరిగుట్ట : తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు చేసిన తప్పుకు మిగిలిన విద్యార్థులను బాధ్యులను చేసేలా ఎంసెట్‌ను రద్దు చేయడం తగదన్నారు. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
-
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషాద్ లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ. 50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థులు కోరుతున్నారు.