కేసీఆర్ రాజీనామా చేయాలి: డీకే అరుణ
హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంసెట్-2 లీకేజీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలనను పోలీసుల చేతుల్లో పెట్టి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారన్నారు.
ఎంసెట్ పేపర్ లీక్పై ముఖ్యమంత్రి కుటుంబంపై ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారారని ఆమె ధ్వజమెత్తారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిర్బంధం సాగిస్తున్నారని, ఎమ్మెల్యే సంపత్ను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని డీకే అరుణ అన్నారు.