ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్భవన్లో కలిశారు.
హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్భవన్లో కలిశారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన విద్యావైద్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లను భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఇందుకు సంబంధించి గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ...అవినీతిని సహించనని చెప్పే సీఎం... 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు విపక్ష నేతలను వెళ్లనీయకపోవడం సరికాదని అన్నారు. ఆ గ్రామాలు పాకిస్తాన్, బర్మాలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. రైతులను నిర్బంధించి బలవంతంగా భూ సేకరణ చేయడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని గవర్నర్ను కోరినట్లు ఆయన చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, మాగం రంగారెడ్డి తదితర నేతలు ఉన్నారు.
మరోవైపు తెలంగాణ పీసీసీ ఈ నెల 7న ఛలో మల్లన్నసాగర్కు పిలుపునిచ్చింది. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. మల్లన్నసాగర్లో లాఠీఛార్జ్ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మల్లురవి డిమాండ్ చేశారు.