హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీక్పై సీఐడీ అధికారులు నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. మరోవైపు ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శుక్రవారం సచివాలయానికి తరలి వస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారి ర్యాంకులు రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా ఎంసెట్ -2 లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు ఎంసెట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ -2ను రద్దు చేస్తే.. పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని దానికి బదులు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ.. కడియం, లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండి చేస్తూ.. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలు అరెస్ట్ చేశారు.