ఒకటి పక్కా.. మరోటి ఉల్టానా?
బ్రోకర్ల చుట్టూ కథ అల్లొద్దు; ఎంసెట్ లీకేజీపై ‘నాగం’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ‘ఒకటి పక్కా ఉంటది.. ఇంకోటి ఉల్టా ఉంటదా..? ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా? అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంసెట్-2 ఉల్టా అయ్యింది.. ఇక పక్కాగా ఎంసెట్-3 నిర్వహిస్తామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో నాగం విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో బ్రోకర్ల చుట్టూ కథలల్లొద్దని, అసలు కథ బయటపెట్టాలని అన్నారు.
సీఎం అనుయాయులు ఈ కుంభకోణంలో ఉన్నందుకే బ్రోకర్లను తెరపైకి తెచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టకుండా అసలు విషయాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 60 వేల మంది విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బందులు కలిగిన వ్యవహారంలో బాధ్యులుగా మంత్రులు రాజీనామా చేయకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు.