టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి జరిగే ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పటిష్టమైన సాంకేతిక భద్రత అవసరమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ తరహా అభిప్రాయానికొచ్చారు. దీనికోసం అత్యంత పటిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రత వ్యవస్థను కల్పించే యోచనలో ఉన్నారు.
దీనితోపాటే ఎంసెట్ పేపర్ రూపకల్పన, వాటిని కంప్యూటర్లు, సర్వర్లలో నిక్షిప్తం చేసిన విధానాలపై నిపుణులతో కలిసి అధికారులు లోతైన సమీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పేపర్ తయారీలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు, సాంకేతిక నిపుణుల వివరాలను క్రోడీకరిస్తున్నారు.
ఇదే కోణంలో పేపర్లను భద్రత పరిచిన తర్వాత సంబంధిత సర్వర్లు, కంప్యూటర్లను ఎవరైనా వినియోగించారా? అనే కోణంలో సమాచార సేకరణకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్‌కు ప్రశ్నపత్రాల సర్వర్లకు సంబంధించిన ప్రతీ ఐపీ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు.
ఎలాంటి తప్పిదాలు జరగకూడదు
ఇతర రాష్ట్రాలతో సహా రాష్ట్రానికి చెందిన మొత్తం 2.50 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్టు తెలిసింది.
మేఘాలయాలో జరుగుతున్న అఖిల భారత విశ్వవిద్యాలయాల సమావేశంలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్ భద్రతపై సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది.
ముట్టుకున్నా ‘బ్లాక్’అలారం..
ఎంసెట్ పేపర్ల భద్రతకు వాడబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి దీన్ని సర్వర్లకు, కీలకమైన కంప్యూటర్ డివైస్‌కు అనుసంధానం చేస్తే ఏ ఇతర వ్యక్తి ముట్టుకున్నా తక్షణమే కీలకమైన వ్యక్తులకు సంకేతాలిస్తుంది. ఇప్పటి వరకూ డివైజ్‌లోకి ఎవరెవరు? ఏ ఐపీ అడ్రస్‌తో వెళ్ళారనే రహస్య సమాచారం అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో క్రిప్టోగ్రఫీ విధానంలో పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఎంసెట్ పేపర్లకు బాధ్యులెవరు? ఏయే సమయాల్లో వాళ్ళు డివైజ్‌లోకి వెళ్ళాలి? అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ టెక్నాలజీ మెమోరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు ప్రవేశించినా, అందుకు భిన్నంగా వెళ్ళినా తేలికగా ముందే గుర్తించడం ఈ సాంకేతికత ప్రత్యేకగా చెబుతున్నారు. అత్యంత రహస్యమైన వ్యవస్థను అంతకంటే రహస్యంగా భద్రతపర్చడమే కాకుండా, హ్యాక్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే విధానం ఇందులో ఉందని చెబుతున్నారు.
దీన్ని పక్కాగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తుల గురించి అధికారులు జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా పాస్వర్డ్స్, సమాచార ప్రవేశం ఎవరెవరికి ఏ మేర ఇవ్వాలనే విషయాలపై స్పష్టతకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్లే ఏం జరిగినా వారినే బాధ్యులను చేయవచ్చని చెబుతున్నారు.
ప్రత్యేక భద్రతపై పరిశీలిస్తున్నాం
ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పూర్తి భద్రత కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఉన్నత విద్యా మండలితో కలిసి ఈ విషయంలో చర్చలు జరుపుతాం. మేఘాలయ వీసీల సమావేశంలో ఉన్నప్పటికీ కీలకమైన ఈ అంశంపై దృష్టి పెట్టాం. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నదీ త్వరలో వివరిస్తాం.
- ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ జేఎన్టీయూహెచ్)
ఎన్క్రిప్షన్ కూడా అవసరమే
ఎంసెట్ వంటి కీలకమైన ప్రశ్నపత్రాలకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత మంచిదే. దీంతోపాటే, ఎన్క్రిప్షన్ విధానం అత్యంత ముఖ్యం. దీనివల్ల ప్రశ్నపత్రం ఎవరికైనా చిక్కినా ఏమీ అర్ధంకాని భాషలో ఉంటుంది. దీన్ని కేవలం వ్యాల్యూడ్ యూజర్ మాత్రమే డీకోడ్ చేయడం సాధ్యం.
క్రిప్టోగ్రఫీ భాషా విధానంతో దీన్ని రూపొందించారు. విశ్వసనీయమైన వ్యక్తులకు అధికారం ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకుంటే పేపర్ లీక్ వంటి ఘటనలకు ఆస్కారమే ఉండదు.
- ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ (వీసీ, అనురాగ్ యూనివర్సిటీ, సైబర్‌క్రైం ఫ్యాకల్టీ నిపుణులు)