ఆపదలకు ఎదురీది...
కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన రోహిత్ తల్లిదండ్రులతో కలిసి మహారాష్ర్టలోని ఠాణే జిల్లా తూర్పు డోంబివలిలోని సర్వోదయ పార్క్ భవనంలో ఉంటున్నాడు. జిల్లా స్థాయిలో అథ్లెటిక్‌గా మంచి గుర్తింపు పొందాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఓ యువతిని రక్షించినందుకుగాను, ఈ సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలల అవార్డు అందుకున్నాడు రోహిత్.
అసలు ఏం జరిగిందంటే...
2012 జూలై రెండవ తేదీన భారీ వర్షం కురిసిన కారణంగా డోంబివిలిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెండేకర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న రోహిత్ ఆ సాయంత్రం తన మిత్రులు కరణ్ సోనవణే, యశ్ గాడ్గే, మంగేష్ గావడేలతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. వర్షం కారణంగా ఒక చోట ఆగారు. ఆరవ తరగతి చదివే అనుష్క తన అక్క దేవయానితో ఆ సమయంలో కరాటే క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. అక్కడే నిర్మాణంలో ఉన్న నాలా (మురికికాలువ)ను గమనించక, అనుష్క అందులో పడిపోయింది. భారీ వర్షం కారణంగా నాలాలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రవాహంలో అనుష్క కొట్టుకుపోసాగింది.
భయంతో ఆమె సోదరి దేవయాని, ‘‘మా చెల్లిని ఎవరైనా రక్షించండి’’ అంటూ అరవసాగింది. ఆ అరుపులు విన్న రోహిత్, తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వెంటనే ఆ నాలాలోకి దూకాడు. అతి కష్టం మీద ఆమెను పట్టుకుని మిత్రుల సహాయంతో బయటికి తీసుకు వచ్చాడు. అనంతరం ఆమె స్పృహ కోల్పోయి ఉండడంతో, ఆసుపత్రిలో చేర్చించారు.
వారం రోజుల తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది. రోహిత్ చేసిన సాహసం గురించి తెలుసుకున్న ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్’ ఈ బాలుడి పేరును సాహసబాలల పురస్కారం కోసం పంపింది. తాను చేసిన సాహసానికి ఇంత గౌరవం లభిస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదని రోహిత్ ఎంతో సంబరంగా చెబుతాడు. ‘‘ఎవరికైనా చేతనైనంత సహాయం చేయడం ఎంతో ఇష్టం. ముఖ్యంగా అవార్డులు వస్తాయనో, ఇంకేదో గౌరవం లభిస్తుందనో ఎన్నడూ ఆశించను’’ అని చెబుతాడు ఈ బాలుడు.చిన్నవాడైనా విలువైన మాట చెప్పాడు కదూ!
- శ్రీనివాస్ గుండారి, సాక్షి, ముంబై
గర్వంగా ఉంది...
మా అబ్బాయికి సాహస బాలల అవార్డు లభించడం ఎంతో గర్వంగా ఉంది. తన ప్రాణాలను పణంగా పెట్టడం కొంత ఆందోళన కలిగించినప్పటికీ, అవార్డు అందుకున్నరోజు ఆనందించాను. బంధువులు, స్నేహితులు అనేకులు ఫోన్ చేసి మా అబ్బాయి ఢిల్లీలో అవార్డు తీసుకోవడం చూశామని చెప్పినప్పుడు, ‘రోహిత్ తల్లిదండ్రులు మీరేనా..?’ అని అడిగినప్పుడు ఆనందంతోపాటు గర్వంగా అనిపించింది.
- రోహిత్ తల్లిదండ్రులు
జనమంచి రవి, జయశ్రీ