Earth equalizer
-
ఫీజుకూ పిల్లిమొగ్గలు
విద్యార్థులను మోసగిస్తున్న ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రీయింబర్స్మెంట్ పథకం అమలుకు వెనకడుగు ఇబ్బందుల్లో 5,600 మంది విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 29 గ్రామాల రైతులు గుంటూరు : రాజధానిలోని విద్యార్థులనూ రాష్ట్ర ప్రభుత్వం మోసగించింది. భూ సమీకరణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యేలు కలసి అక్కడి రైతులకు అనేక హామీలు ఇచ్చారు. వాటిలో రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల కంటే రాజధానిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. ఒక వేళ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఫీజులు చెల్లించివుంటే, అవి కూడా తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆ వివరాలతో కూడిన దరఖాస్తులను సీఆర్డీఏ కార్యాలయంలో ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాజధాని విద్యార్థులు ఎంతో ఆశతో దరఖాస్తులను విద్యాశాఖకు అందజేశారు. అక్కడి నుంచి దరఖాస్తులు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లినా ఫీజు రీయింబర్స్మెంట్ అమలులోకి రాలేదు. రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని రైతులు, విద్యార్థులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన విద్యార్థులు సుమారు 10 వేల మంది వరకు ఉన్నారు. 1 నుంచి 10 వ తరగతి వరకు 8 వేల మంది వరకు ఉంటారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 5, 600 మంది మూడు నెలల క్రితం తమ దరఖాస్తులను విద్యాశాఖకు అందజేశారు. వీటిపై సీఆర్డీఏ కార్యాలయం ఇప్పటివరకు స్పష్టత నివ్వలేదు. ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రాజధానిలోని కాంపిటెంట్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో తిరుగు ముఖం పట్టారు. ఈ విషయమై సీఆర్డీఏ సోషల్ డెరైక్టర్ జయదీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వచ్చిన వివరాలను ప్రభుత్వానికి తెలియపరిచామని, ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు .సీఆర్డీఏ పరిధిలో మొత్తం 5,600 మంది విద్యార్థులు ప్రైవేటు సంస్థల్లో ఫీజులు చెల్లించారని, వారికి సుమారు రూ. 8 నుంచి 10 కోట్ల మేర రీయింబర్స్మెంట్ రూపేణా రావాల్సి ఉందన్నారు. -
కుట్ర తెలిసి కోర్టుకెళ్లాం
మంగళగిరి/తాడేపల్లి రూరల్ : రాష్ర్ట ప్రభుత్వం పిలుపు మేరకు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు కొందరు సీఆర్డీఏ అధికారులకు 9.3 (అంగీకార) పత్రాలు అందజేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్ అంటూ తిరుగుతూ లక్షల ఎకరాలు సిద్ధం చేస్తున్నాం.. పరిశ్రమలు పెట్టండి...జపాన్ వాళ్ల కోసం స్కూళ్లు కడతాం.. వసతులు కల్పిస్తాం.. అంటూ ప్రకటనలు చేయడంతో ఆయన మీద నమ్మకం కోల్పోయారు. మొదట్లో అంగీకార పత్రాలు ఇచ్చిన వారే అభ్యంతరం వ్యక్తంచేస్తూ 9.2 (అభ్యంతర) పత్రాలిచ్చారు. భూ సమీకరణ పేరుతో రూపాయి ఖర్చు లేకుండా రైతుల నుంచి లక్షల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకుని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే కుట్ర తెలుసుకుని 9.2 ఫారాలు అందజేసిన దాదాపు 300 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూ సమీకరణ నుంచి తమను మినహాయించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టు తమ మొర ఆలకించడంతో రాజధాని ప్రాంత ైరె తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు, ఎరువులూ ఇవ్వడంలేదు.. భూ సమీకరణ స్వచ్ఛందమని చెప్పిన ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కుంటామని బెదిరిస్తోందని రైతులు వెల్లడించారు. వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న తాము భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే రుణాలు, ఎరువులు ఇవ్వకుండా భూములు సాగు చేయనీయకుండా అడ్డుకొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కోల్పోయామని, చంద్రబాబు ఆయన కోటరీ కోసమే రైతుల భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారని అర్ధమై అభ్యంతర పత్రాలు ఇచ్చామని తెలిపారు. తమను కూడా భూ సమీకరణ నుంచి మినహాయిస్తే తమ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతామని మరికొందరు పేర్కొన్నారు. అంగీకార పత్రాలు ఇచ్చిన వేలమంది రైతులు అగ్రిమెంట్లు చేసుకొని కౌలు చెక్కులు తీసుకొనేందుకు వెనుకాడుతున్నారని, టీడీపీ సర్కారుపై నమ్మకం కోల్పోయినందునే భూ స్వాధీన ప్రక్రియ ముందుకు సాగటం లేదని చెబుతున్నారు. కోర్టు ఉత్తర్వులు ధైర్యాన్నిచ్చాయి... న్యాయస్థానాలపై నమ్మకంతో హైకోర్టును ఆశ్రయించాం. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే చొరవతో మా పంటపొలాలను కాపాడుకునేందుకు పోరా టం చేస్తున్నాం. భూములు ఎక్కడ లాక్కుంటారోనన్న భయంతో ముందుగా భూములు ఇచ్చాం. ఏ పనైనా చట్టప్రకారం చేయండి అంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాకు ధైర్యాన్నిచ్చాయి. అందుకే 9.3 పత్రాలు ఇచ్చిన మేము సైతం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాం. - మన్నం హనుమంతరావు, రైతు భూములు వదులుకోం.. మమ్మలను భయపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి, గ్రామంలో తిష్టవేసి భూములు బలవంతంగా తీసుకున్నారు. భూసేకరణ జరిగితే మీకు ఒరిగేం ఉండదంటూ భయపెట్టడంతో తప్పక భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నదాతకు అండగా న్యాయస్థానాలు భరోసా కల్పిస్తుండడంతో తమకు ధైర్యం వచ్చింది. ఎట్టి పరిస్థితిల్లోనూ భూములు వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. - అల్లు సాంబిరెడ్డి, రైతు పోరాడి సాధించుకుంటాం.. పంటలు పండించుకోవడం తప్ప మరోటి తెలియని మమ్మల్ని భయపెట్టి భూములు లాక్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పక్షాన చట్టపరమైన పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు ఇస్తున్న ఉత్తర్వులతో నమ్మకం కలిగి 9.3 పత్రాలు ఇచ్చిన తమకు సైతం లాండ్ పూలింగ్ నుంచి, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాం. న్యాయపరమైన పోరాటం చేసి మా భూములను మేము సాధించుకుంటాం. - చప్పిడి శ్రీరాములు, రైతు -
అన్నా, మేధాలకు లేఖలు!
పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ భూ సమీకరణపై వివరణ ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్: పైకి గంభీరమైన ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. రాజధాని కోసం ప్రభుత్వం భూములు సమీకరించడాన్ని తప్పుబడుతున్న సామాజిక ఉద్యమ నేతలు అన్నా హజారే, మేధాపాట్కర్ లాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఈ ఉద్యమకారులు జరిపిన అనేక పోరాటాలను తాను సమర్థించగా.. ఇప్పుడు ప్రభుత్వ వైఖరిపై వారినుంచే అభ్యంతరాలు వ్యక్తం కావడం బాబును ఇరకాటంలో పడేసింది. రాజధాని ప్రాంతంలో మేధాపాట్కర్ ఇప్పటికే పర్యటించడం, అన్నా హజారే నేరుగా తనకే లేఖ రాయడం వంటి అంశాలపై శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. చివరకు రాజధాని కోసం రైతులందరూ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని పేర్కొంటూ వారిద్దరికీ లేఖలు రాయాలనే నిర్ణయానికొచ్చారు. అయితే ఈ లేఖలను పార్టీ పరంగా రాయాలా? లేక ప్రభుత్వ పరంగానా? అన్న అంశంపై చర్చించారు. చివరకు ప్రభుత్వ పరంగా రాయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు కిమిడి కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ సలహాదారులు సి. కుటుంబరావు, పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ఉద్యమకారులెవరూ మాట్లాడలేదన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి విషయాలేవీ లేఖలో ప్రస్తావించకపోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలావుండగా ఏపీ రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ రెండో తేదీన నిర్వహించాలా? లేక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదో తేదీన నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాలపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పునర్నిర్మాణ, పునరంకిత, సంకల్ప దినోత్సవం.. తదితరాల్లో ఏ పేరుతో నిర్వహిస్తే బావుంటుందనే అంశంపైనా చర్చించారు. ఆ భూముల్ని జగ్గీ పరిశీలించారు... జగ్గీ వాసుదేవ్‌కు భూముల కేటాయింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన కేవలం భూములను పరిశీలించి వెళ్లారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలపై వివరణ ఇవ్వాల్సిందిగా నేతలు, అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని బాబు ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయమై ఏం జరిగిందీ వివరాలు సేకరించాల్సిందిగా సూచించారు.