విద్యార్థులను మోసగిస్తున్న ప్రభుత్వం
రాజధాని ప్రాంతంలో రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకు వెనకడుగు
ఇబ్బందుల్లో 5,600 మంది విద్యార్థులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 29 గ్రామాల రైతులు
గుంటూరు : రాజధానిలోని విద్యార్థులనూ రాష్ట్ర ప్రభుత్వం మోసగించింది. భూ సమీకరణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యేలు కలసి అక్కడి రైతులకు అనేక హామీలు ఇచ్చారు. వాటిలో రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల కంటే రాజధానిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. ఒక వేళ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఫీజులు చెల్లించివుంటే, అవి కూడా తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆ వివరాలతో కూడిన దరఖాస్తులను సీఆర్‌డీఏ కార్యాలయంలో ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాజధాని విద్యార్థులు ఎంతో ఆశతో దరఖాస్తులను విద్యాశాఖకు అందజేశారు. అక్కడి నుంచి దరఖాస్తులు సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లినా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి రాలేదు. రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని రైతులు, విద్యార్థులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన విద్యార్థులు సుమారు 10 వేల మంది వరకు ఉన్నారు. 1 నుంచి 10 వ తరగతి వరకు 8 వేల మంది వరకు ఉంటారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 5, 600 మంది మూడు నెలల క్రితం తమ దరఖాస్తులను విద్యాశాఖకు అందజేశారు. వీటిపై సీఆర్‌డీఏ కార్యాలయం ఇప్పటివరకు స్పష్టత నివ్వలేదు. ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రాజధానిలోని కాంపిటెంట్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో తిరుగు ముఖం పట్టారు.
ఈ విషయమై సీఆర్‌డీఏ సోషల్ డెరైక్టర్ జయదీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వచ్చిన వివరాలను ప్రభుత్వానికి తెలియపరిచామని, ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు .సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 5,600 మంది విద్యార్థులు ప్రైవేటు సంస్థల్లో ఫీజులు చెల్లించారని, వారికి సుమారు రూ. 8 నుంచి 10 కోట్ల మేర రీయింబర్స్‌మెంట్ రూపేణా రావాల్సి ఉందన్నారు.
ఫీజుకూ పిల్లిమొగ్గలు
Published Mon, Jan 11 2016 12:53 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement