కుట్ర తెలిసి కోర్టుకెళ్లాం
మంగళగిరి/తాడేపల్లి రూరల్ : రాష్ర్ట ప్రభుత్వం పిలుపు మేరకు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు కొందరు సీఆర్‌డీఏ అధికారులకు 9.3 (అంగీకార) పత్రాలు అందజేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్ అంటూ తిరుగుతూ లక్షల ఎకరాలు సిద్ధం చేస్తున్నాం.. పరిశ్రమలు పెట్టండి...జపాన్ వాళ్ల కోసం స్కూళ్లు కడతాం.. వసతులు కల్పిస్తాం.. అంటూ ప్రకటనలు చేయడంతో ఆయన మీద నమ్మకం కోల్పోయారు.
మొదట్లో అంగీకార పత్రాలు ఇచ్చిన వారే అభ్యంతరం వ్యక్తంచేస్తూ 9.2 (అభ్యంతర) పత్రాలిచ్చారు. భూ సమీకరణ పేరుతో రూపాయి ఖర్చు లేకుండా రైతుల నుంచి లక్షల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకుని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే కుట్ర తెలుసుకుని 9.2 ఫారాలు అందజేసిన దాదాపు 300 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
భూ సమీకరణ నుంచి తమను మినహాయించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టు తమ మొర ఆలకించడంతో రాజధాని ప్రాంత ైరె తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రుణాలు, ఎరువులూ ఇవ్వడంలేదు..
భూ సమీకరణ స్వచ్ఛందమని చెప్పిన ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కుంటామని బెదిరిస్తోందని రైతులు వెల్లడించారు. వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న తాము భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే రుణాలు, ఎరువులు ఇవ్వకుండా భూములు సాగు చేయనీయకుండా అడ్డుకొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కోల్పోయామని, చంద్రబాబు ఆయన కోటరీ కోసమే రైతుల భూములతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారని అర్ధమై అభ్యంతర పత్రాలు ఇచ్చామని తెలిపారు.
తమను కూడా భూ సమీకరణ నుంచి మినహాయిస్తే తమ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతామని మరికొందరు పేర్కొన్నారు. అంగీకార పత్రాలు ఇచ్చిన వేలమంది రైతులు అగ్రిమెంట్లు చేసుకొని కౌలు చెక్కులు తీసుకొనేందుకు వెనుకాడుతున్నారని, టీడీపీ సర్కారుపై నమ్మకం కోల్పోయినందునే భూ స్వాధీన ప్రక్రియ ముందుకు సాగటం లేదని చెబుతున్నారు.
కోర్టు ఉత్తర్వులు ధైర్యాన్నిచ్చాయి...
న్యాయస్థానాలపై నమ్మకంతో హైకోర్టును ఆశ్రయించాం. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే చొరవతో మా పంటపొలాలను కాపాడుకునేందుకు పోరా టం చేస్తున్నాం. భూములు ఎక్కడ లాక్కుంటారోనన్న భయంతో ముందుగా భూములు ఇచ్చాం. ఏ పనైనా చట్టప్రకారం చేయండి అంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాకు ధైర్యాన్నిచ్చాయి. అందుకే 9.3 పత్రాలు ఇచ్చిన మేము సైతం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాం.
- మన్నం హనుమంతరావు, రైతు
భూములు వదులుకోం..
మమ్మలను భయపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి, గ్రామంలో తిష్టవేసి భూములు బలవంతంగా తీసుకున్నారు. భూసేకరణ జరిగితే మీకు ఒరిగేం ఉండదంటూ భయపెట్టడంతో తప్పక భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నదాతకు అండగా న్యాయస్థానాలు భరోసా కల్పిస్తుండడంతో తమకు ధైర్యం వచ్చింది. ఎట్టి పరిస్థితిల్లోనూ భూములు వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము.
- అల్లు సాంబిరెడ్డి, రైతు
పోరాడి సాధించుకుంటాం..
పంటలు పండించుకోవడం తప్ప మరోటి తెలియని మమ్మల్ని భయపెట్టి భూములు లాక్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పక్షాన చట్టపరమైన పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు ఇస్తున్న ఉత్తర్వులతో నమ్మకం కలిగి 9.3 పత్రాలు ఇచ్చిన తమకు సైతం లాండ్ పూలింగ్ నుంచి, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాం. న్యాయపరమైన పోరాటం చేసి మా భూములను మేము సాధించుకుంటాం.
- చప్పిడి శ్రీరాములు, రైతు