రాహుల్ ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేదు?
ప్రధానమంత్రి వ్యక్తిగత అవినీతి గురించి తనవద్ద పక్కా ఆధారాలున్నాయని చెబుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతకాలం దాని గురించి ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అనంతకుమార్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి తాము చర్చకు సిద్ధమేనని చెబుతున్నామని.. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షం మాత్రం సభను నడవనివ్వడం లేదని ఆయన అన్నారు. నిజంగా రాహుల్ గాంధీ దగ్గర అంత భూమి బద్దలయ్యే సమాచారమే ఉంటే.. గడిచిన 20 రోజుల నుంచే ఆయన బయటపెట్టచ్చు కదా అని అనంతకుమార్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన అలా భూకంపం తెప్పించే విషయాలేవీ ప్రస్తావించలేదని.. బయటకు వచ్చి మాత్రం తనను మాట్లాడనివ్వడం లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కలిసి సభను ఎందుకు నడవనివ్వట్లేదని.. గత 15 రోజులుగా పార్లమెంటులో సరైన చర్చ జరగనివ్వట్లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.
లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన తెలియజేయడం, మరోవైపు చర్చ జరగాలని అడగడం సరికాదని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. సభ సజావుగా నడిచేందుకు ఇరు పక్షాలూ సహకరించాలని ఆమె కోరారు.