East Coast Railway Division
-
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందకుపైగా ట్రైన్లు రద్దు
తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్పూర్–ధన్మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు. విజయవాడ డివిజన్లో... విజయవాడ డివిజన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు. కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
విశాఖలో ఇక గుర్రం స్వారీ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్.. వాల్తేర్ ఆధ్వర్యంలో వాల్తేర్ రైల్వే ఫుట్ బాల్ స్టేడియం(పాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్)లో హార్స్ రైడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి తెలిపారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్ రైడింగ్ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు షరీఫ్ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని, ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్ అబ్బాస్ చెప్పారు. ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్ బహిరంగ సభలో సీఎం జగన్ -
సౌకర్యాలు మెరుగు పరచండి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పరచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) శరద్‌కుమార్ శ్రీవాస్తవకు పలువురు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో డివిజనల్ కమిటీ సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ కమిటీకి చైర్మన్‌గా బ్రహ్మపూర్‌కు చెందిన చంద్రశేఖర్ సాహూ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగు, పలు హాల్ట్‌లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపుదల, గమ్య స్థానాల పొడిగింపు వంటి వాటిపై వినతి పత్రాలు అందజేశారు. డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జీఎం, వాల్తేర్ డీఆర్ఎంలను అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), భీశెట్టి సత్యవతి(అనకాపల్లి), గొడ్డేటి మాధవి(అరకు),బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), కె.రామ్మోహననాయుడు(శ్రీకాకుళం), రమేష్‌చంద్ర(నవరంగ్‌పూర్), సప్తగిరి శంకర్ ఉలకా(కోరాపుట్), దీపక్బాజీ(బస్తర్ ఎంపీ ప్రతినిధి) హాజరయ్యారు. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి, ఏడీఆర్‌ఎంలు సుధీర్కుమార్గుప్తా(ఇన్ఫ్రా), మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్) పాల్గొన్నారు. -
రైళ్లకు గులాబ్ ఎఫెక్ట్
విజయనగరం టౌన్/ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయినట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. 27వ తేదీ రద్దయిన రైళ్లు రూర్కెలా–జగదల్పూర్ స్పెషల్ (08107), భువనేశ్వర్–జగదల్పూర్ స్పెషల్ (08445), విశాఖ–రాయగడ స్పెషల్ (08508), విశాఖ–కిరండూల్ (08516), కోర్బా–విశాఖ స్పెషల్ (08517), విశాఖ–కోర్బా స్పెషల్ (08518), భువనేశ్వర్–జునాఘర్ రోడ్ స్పెషల్ (02097). 28వ తేదీ రద్దయిన రైళ్లు రాయగడ–విశాఖ స్పెషల్ (08507), జగదల్పూర్–రూర్కెలా స్పెషల్ (08108), జగదల్పూర్–భువనేశ్వర్ స్పెషల్ (08446), జునాఘర్ రోడ్డు–భువనేశ్వర్ స్పెషల్ (02098). 27న రీషెడ్యూల్ చేసిన రైళ్లు ► విశాఖ–గుంటూరు (07240) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► విశాఖ– హజరత్ నిజాముద్దీన్ (02851) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02544) రైలు 15 గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ రాత్రి 7.15 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02822) రైలు 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు రైళ్ల రాకపోకల వివరాలను 08922–221202, 221206/ 089128–83331, 83332, 83333, 833334 నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. జారిపడ్డ మట్టిదిబ్బలు, కొండచరియలు అనంతగిరి/తాడేపల్లి రూరల్: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ కొత్తవలస–కిరండూల్ మార్గం (కేకే లైన్)లో బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య, శివలింగపురం 47వ కిలోమీటర్ వద్ద రెండు చోట్ల మట్టిదిబ్బలు జారి రైల్వేట్రాక్‌పై పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ఉదయం నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సీతానగరం పుష్కర్ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు జారిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
‘ఈస్ట్‌కోస్ట్’లో కోచ్‌ల ఆట
సాక్షి, విశాఖపట్నం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారుల పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైంది. వాల్తేరు డివిజన్‌కు పాత కోచ్‌లు పడేసి.. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తమ పరిధిలో తిప్పుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. వీటిపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త పంథాని అనుసరించారు. కొత్త కోచ్‌లను విశాఖ డివిజన్‌కు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి.. తమ పరిధిలోనే కొత్త కోచ్‌లను తిప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది. పేరు వాల్తేరుదే అయినా.. కొత్త కోచ్‌లపై పెత్తనం మాత్రం భువనేశ్వర్దేనన్న విషయం చెప్పకనే చెప్పారు. జగదల్పూర్–భువనేశ్వర్(08445) స్పెషల్ ట్రైన్‌ను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఈ నెల 10 నుంచి నడుపుతున్నట్లు గురువారం వాల్తేరు డివిజన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రైలు వాస్తవానికి జగదల్పూర్, కోరాపుట్, రాయగడ, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు రాదు. ఈ రైలు వల్ల విశాఖ డివిజన్‌కు పెద్దగా ఉపయోగం లేదు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది కాబట్టి.. విశాఖ డివిజన్‌కు కేటాయించామని చెబుతున్నారు. కానీ.. పెత్తనమంతా భువనేశ్వర్ అధికారులదే. విశాఖ స్టేషన్‌కు రాని ఎల్‌హెచ్‌బీ ట్రైన్‌ని వాల్తేరు డివిజన్‌కు కేటాయిస్తున్నట్లు ఎలా పేర్కొంటారని రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిపై వాల్తేరు డివిజన్ అధికారులు కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ ఏకే త్రిపాఠి వెల్లడించారు. ఈనెల 9 నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు,ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు లింగంపల్లి-విశాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తూర్పుకోస్తా రైల్వే పేర్కొంది. -
సమస్యల స్టేషన్ !
ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్లో ప్రధాన జంక్షన్‌గా విజయనగరానికి పేరుంది. నిత్యం వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. అటు ఒడిశా, ఇటు రాయపూర్ వెళ్లాలన్నా వ్యాపారులు విజయనగరం రైల్వేస్టేషన్లోనే ట్రైన్ మారాల్సి ఉంటుంది. అందువల్లే జిల్లా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇటువంటి స్టేషన్లో సమస్యలు కూత పెడతున్నాయి. రిజర్వేషన్ దగ్గర నుంచి డస్ట్బిన్ల ఏర్పాటు వరకూ పలు సమస్యలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో టిఫిన్, టీ, తదితర స్టాల్స్ నిర్వహకులు ఎమ్ఆర్పీకి మించి అమ్ముతున్నారని, రైళ్లలో టాయిలెట్లు సక్రమంగా లేకపోవడ ం వంటి ఫిర్యాదులున్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను కనుగొనేందుకు విజయనగరం రైల్వే స్టేషన్ మేనేజర్ బి.చంద్రశేఖర రా జు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ గా మారారు. స్టేషన్ పరిసరాలతో పాటూ, ఫ్లాట్‌ఫామ్స్, రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే హమాలీలు, సీనియర్ టికెట్ కలెక్టర్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో ఆయన సంభాషణ ఇలా సాగింది స్టేషన్ మేనేజర్ : నమస్తే.. నా పేరు చంద్రశేఖర రాజు. నేను రైల్వే స్టేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మీ సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ వద్దకు వచ్చాను. మీ పేరేంటి ? మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ప్రయాణికురాలు: నమస్తే సార్.. నా పేరు అరుణ. పండగకు ఊరొచ్చాం. మేము బెంగుళూరు వెళ్తున్నాం. స్టేషన్ మేనేజర్: రైల్వేస్టేషన్లో మీకేమైనా సమస్యలు ఎదురయ్యాయా ? స్టేషన్‌పై మీ అభిప్రాయమేంటి ? అరుణ: విజయనగరం రైల్వేస్టేషన్ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పట్లో ఇరుగ్గా ఉండేది. ప్రస్తుతం విశాలంగా, సౌకర్యంగానే ఉంది. పెద్ద పెద్ద స్టేషన్లను బాగా డెవలప్ చేయాలి. స్టేషన్ మేనేజర్ : హలో సార్... నమస్తే, మీ పేరేంటి , సమస్యలు ఏమైనా ఉన్నాయా? రాజన్న: నాపేరు రాజన్న, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం గమనించాం. చెత్తా, చెదారాలు కిందపడేయకుండా మరికొన్ని డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తే బావుంటుంది. స్టేషన్ మేనేజర్ : మరో ప్రయాణికుడి దగ్గరకు వెళ్తూ... మీ దగ్గర టికెట్ ఉందా? ఆన్లైన్లో తీశారా, రిజర్వేషన్ కౌంటర్ ద్వారానా? ఈజీ టికెటింగ్ పట్ల అభిప్రాయం? వంశీ: ఆన్లైన్లోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. మొబైల్ టికెటింగ్ రావడం రైల్వేస్‌లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. పని సులభంగా అయిపోతుంది. భువనేశ్వర్ వెళ్తున్నాను. స్టేషన్ మేనేజర్: ప్రయాణికుల దగ్గర నుంచి ఎంఆర్పీని మించి అమ్ముతున్నారంట? ఇప్పుడే నా దృష్టికి వచ్చిం ది. ఏంటి విషయం ? వెంకటరావు, వ్యాపారి: లేదు సార్... అటువంటిదేమీ లేదు.. ఎక్కడో జరిగి ఉండవచ్చు. మన స్టేషన్లో ఎంఆర్పీకే అమ్మకాలు చేస్తున్నాం. స్టేషన్ మేనేజరు: నీ పేరేంటి, ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు? జీతం సక్రమంగా వస్తుందా? పారిశుద్ధ్య కార్మికుడు: నాపేరు అప్పలరాజు సార్, నాలుగేళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాను. ఎనిమిది గంటల సమయం పనిచేస్తాను. పీఎఫ్ కట్ అవుతోంది. రూ.5వేల వరకూ జీతమిస్తారు. ఈ లోపు బెంగుళూరు నుంచి భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రానే వచ్చింది. ఒక వ్యక్తి నడుస్తున్న రైల్లోంచి దూకడం గమనించిన స్టేషన్ మాస్టర్ ఆయన దగ్గరకు వెళ్లి సార్ నమస్తే, అలా దూకితే ప్రమాదమని తెలీదా ? రన్నింగ్ ట్రైన్లోంచి దిగడం కరెక్ట్ కాదు గదా? అశోక్ నాయక్ : ఆకలికి తట్టుకోలేక ఏదో తినేద్దామన్న ఆత్రుతతో గెంతేశాను. అంతేనండి. పొరపాటైంది. ఇంకెప్పుడూ ఇలా చేయను. స్టేషన్ మేనేజర్ : రైల్వే ప్రాంగణంలో మార్కింగ్ ప్రకారం పార్కింగ్ చేస్తున్నారా? కారు, జీపు తదితర పార్కింగ్లు చేయడంలో మీకేమైనా సమస్యలు వస్తున్నాయా? సీహెచ్ రాజా (డ్రైవర్) : లేదు సర్.. గత కొన్నాళ్లుగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. మార్కింగ్ మేరకు ఇచ్చిన స్థలంలో చక్కగానే పార్కింగ్ జరుగుతోంది. అదనపు రుసుం వసూలు చేయడం లేదు. కానీ పార్కింగ్ పక్కన ఖాళీస్థలాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : పార్కింగ్ పక్కన ఖాళీ స్థలంలో సులబ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. స్టేషన్ మేనేజర్ : ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతో మాట్లాడుతూ.. రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? బోగీలను క్లీన్‌గా ఉంచుతున్నారా? మంచి ఆహారాన్ని అందిస్తున్నారా ? డి.ఎస్. పాడి(ప్రయాణికుడు) : రైల్లో క్లీనింగ్ చేస్తున్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటోంది. బాత్రూమ్లు సక్రమంగా లేవు. నీటి సౌకర్యం లేదు. చెత్తా, చెదారాలు పడేస్తున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద క్లీనింగ్, వాటరింగ్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలి. స్టేషన్ మేనేజర్ : తప్పకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తాం. అలా రైల్లోనే నడుస్తూ... క్యాంటిన్ బోగీలోకి వెళ్లి వండుతున్న ఆహారాపదార్థాలను పరిశీలించారు. రైస్ ఎప్పుడు వండారు? పన్నీరు ప్రెష్‌గా కనబడటం లేదు? ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట? నిల్వ ఆహార పదార్థాలు ఇస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు ? ఏమిటి విషయం? రాజీవ్ గుప్త ( క్యాంటిన్ కార్ నిర్వహకుడు) : రైస్ ఇప్పుడే దించాము సార్.. లంచ్ టైమ్‌కి ప్యాకింగ్ చేసేందుకు పక్కన పెట్టాం. పన్నీరు ప్రెష్దే , ఎప్పటికప్పుడు ఆర్డర్ ప్రకారమే వంట చేస్తాం. వెజ్మీల్స్, బిర్యానీ, కాఫీ, టీ అన్నీ ఐఆర్సీటీసీ ఇచ్చిన ధరల ప్రకారమే విక్రయిస్తున్నాం. స్టేషన్ మేనేజర్ : రైలు దిగిన తర్వాత రైల్వే కూలీలతో మాట్లాడుతూ జీతం సక్రమంగా వస్తోందా? బేరాలు వస్తున్నాయా ? లక్ష్మణరావు(హమాలీ) : ప్రయాణికులు చక్రాల బ్యాగులు వాడుతుండడంతో వారే తమతో పాటు తీసుకువెళుతున్నారు. ఇంకా మేము మోసేది ఎక్కడ సార్. ప్రభుత్వం రూ.2,415 ఇస్తుంది. అది కూడా 30 మందికే వస్తుంది. ఇంకా 140 మంది వరకూ కార్మికులు ఉన్నారు. బయట కూలికెళితే రోజుకు రూ.300 వరకూ వస్తుంది. ఇక్కడ అది కూడా రావడంలేదు. పీఎఫ్ లే దు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. స్టేషన్ మేనేజర్ : స్టేషన్లో టికెట్ చెకింగ్ ఎలా ఉంది? టికెట్ తీసే ప్రయాణాలు చేస్తున్నారా ? ఎవరైనా టికెట్లేని ప్రయాణికులు దొరికారా ? బీరేంద్ (సీనియర్ టీసీ) : లేదు సర్.. ప్రయాణికులు టికెట్ తీస్తున్నారు. స్టేషన్ మేనేజర్ : రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్తూ... స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలికి సూచించారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న చీపురును తీసుకుని రిజర్వేషన్ కౌంటర్లో ఒక భాగాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ సక్రమంగా జీతాలు వస్తున్నాయా ? ఫినాయిల్, బ్లీచింగ్ తదితర వాటిని సక్రమంగా అందజేస్తున్నారా ? లక్ష్మి (పారిశుద్ధ్య కార్మికురాలు): పారిశుద్ధ్య కార్మికులంతా ఒకరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. రిజర్వేషన్ కౌంటర్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే చెత్తా,చెదారాలు పేరుకుపోతుంటాయి. అందుకే నిత్యం ఒకరు పనిచేస్తూనే ఉంటాం సార్.. ఫినాయిల్, బ్లీచింగ్ తదితర సామాగ్రిని సక్రమంగానే అందజేస్తున్నారు సర్.