
మాట్లాడుతున్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శరద్‌కుమార్ శ్రీవాస్తవ, చిత్రంలో ఎంపీలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పరచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) శరద్‌కుమార్ శ్రీవాస్తవకు పలువురు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో డివిజనల్ కమిటీ సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు.
ఈ కమిటీకి చైర్మన్‌గా బ్రహ్మపూర్‌కు చెందిన చంద్రశేఖర్ సాహూ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగు, పలు హాల్ట్‌లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపుదల, గమ్య స్థానాల పొడిగింపు వంటి వాటిపై వినతి పత్రాలు అందజేశారు. డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జీఎం, వాల్తేర్ డీఆర్‌ఎంలను అభినందించారు.
ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), భీశెట్టి సత్యవతి(అనకాపల్లి), గొడ్డేటి మాధవి(అరకు),బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), కె.రామ్మోహననాయుడు(శ్రీకాకుళం), రమేష్‌చంద్ర(నవరంగ్‌పూర్), సప్తగిరి శంకర్ ఉలకా(కోరాపుట్), దీపక్‌బాజీ(బస్తర్ ఎంపీ ప్రతినిధి) హాజరయ్యారు. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి, ఏడీఆర్‌ఎంలు సుధీర్‌కుమార్‌గుప్తా(ఇన్‌ఫ్రా), మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్) పాల్గొన్నారు.