ecanamical problems
-
‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక విధానాల వల్లనైతేనేమీ, ఆ తర్వాత ప్రాణాంత కరోనా వైరస్ మహమ్మారి విజంభణ వల్ల అయితేనేమీ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారింది. గడచిన రెండు దశాబ్దాలుగా జీడీపీ పురోభివద్ధితో ప్రపంచ పది బలమైన ఆర్థిక దేశాల్లో ఒకటిగా దూసుకుపోతోన్న భారత్‌కు హఠాత్తుగా కళ్లెం పడింది. మున్నెన్నడు లేని విధంగా ఈ ఆర్థిక త్రైమాసంలో ప్లస్‌లో దూసుకుపోతోన్న జీడీపీ వద్ధి రేటు అనూహ్యంగా మైనస్ 24 శాతానికి పడిపోయింది. ఇది మరింత దిగజారి మైనస్ 35 శాతానికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని భారత మాజీ చీఫ్ స్టాటిస్టిసియన్ ప్రణబ్ సేన్ అంచనా వేస్తున్నారు. ప్రైవేటు పారిశ్రామీకరణ లేదా లైసెన్స్ రాజ్యాన్ని రద్దు చేస్తూ 1991లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకరావడంతో దేశాభివద్ధి రూటు మార్చుకుంది. అప్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లన ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు లబ్ధి పొందుతూ వచ్చారు. అవకతవక ఆర్థిక విధానాలకు కరోనా మహమ్మారి లాక్డౌన్ పరిస్థితులు తోడవడంతో దేశ ఆర్థిక పరిస్థితులు పతనమవుతూ వచ్చాయి. లాక్డౌన్ పరిస్థితులు కొనసాగడం వల్ల దేశంలో 1.80 కోట్ల మంది నెలసరి వేతన ఉద్యోగాలను కోల్పోయారని ‘సీఎంఐఈ’ నివేదిక తెలియజేస్తోంది. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల శాతం మున్నెన్నడు లేనివిధంగా 7.1 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల మొదటిసారిగా దేశ మధ్యతరగతి ప్రజల్లో అసంతప్తి వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ దిగువ గ్రేడు ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన ‘స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్’ ఫలితాల ఆలస్యంపై ఆన్లైన్లో మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికేతర సిబ్బంది నియామకం కోసం ‘రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు’ నిర్వహించాల్సిన పరీక్షలు జాప్యం జరగడం పట్ల కూడా ప్రజలు తమ అసహనం వ్యక్తం చేశారు. ‘పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థులు ఏకే–47 గన్లు పట్టుకోవాల్సి వస్తుంది’ అన్న ఘాటైన హెచ్చరికులు కూడా మొదలయ్యాయి. అండర్ గ్రాడ్యువేట్ ఇంజనీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలనే ప్రజల డిమాండ్‌ను కేంద్రం ఖాతరు చేయక పోవడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వారం వారం రేడియో ద్వారా మాట్లాడే ‘మన్ కీ బాత్’లకు డిస్‌లైక్‌లు మొదలయ్యాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహ జ్వాలలు పునరావతం అవుతాయా?! నాడు టెలికామ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు, బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా నాడు ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైన విషయం తెల్సిందే. మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీని, ఆయనకన్నా ఆయన పార్టీ బీజేపీని ఇష్టపడతారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38 శాతం మంది మధ్యతరగతి వారు, 44 శాతం మంది ఉన్నత మధ్యతరగతి వారు మోదీ ప్రభుత్వానికి ఓటేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 61 శాతం మంది ఉన్నత హిందూ కులాలకు చెందిన ప్రజలు మోదీకి అండగా నిలిచారు. నేటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వ విధానాల పట్ల అసంతప్తి వ్యక్తం అవుతున్నా అది మోదీని కాదనుకునే స్థాయికి చేరుకోవడం లేదు. వారికి ఆర్థిక విధానాల పట్ల అసంతప్తికన్నా మోదీ ప్రభుత్వం పట్ల వారికి సైంద్ధాంతిక కట్టుబాటే ఎక్కువగా ఉంది. -
ఆశల సర్వే!
ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.8 శాతంగా ఉన్నదని, ఆగమిస్తున్న ఆర్థిక సంవత్సరంలో అది 7 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్న ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సాధారణంగా ఆర్థిక సర్వేలు గడిచిన కాలానికి సంబంధించిన చేదు నిజాలను వెల్లడిస్తూనే రాగల సంవత్సరం దివ్యంగా ఉండగలదన్న భరోసా కల్పిస్తాయి. కానీ ఈ ఆర్థిక సర్వే వృద్ధి రేటులో స్వల్పంగా మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతోంది. అయితే వచ్చే అయిదేళ్లలో అది 8 శాతానికి చేరేం దుకు... ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ అప్పటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి అనువైన విధానాల అమలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తోంది. ఏటా సాధారణ బడ్జెట్ సమర్పించే ముందురోజు గడిచిన 12 నెలల కాలం పద్దులను సమీక్షిస్తూ, ఏ రంగాల పనితీరు ఏవిధంగా ఉన్నదో తెలియజేస్తూ ఆర్థిక సర్వేను వెలువరిస్తారు. అమలైన అభి వృద్ధితో వచ్చిన ఫలితాలు, మున్ముందు అనుసరించదల్చుకున్న విధానాలు సర్వేలు వివరిస్తాయి. ఈసారి నిర్మలా సీతారామన్ ముందున్న సవాళ్లు సాధారణమైనవి కాదు. ఆమె ఒకపక్క నిబంధనల చట్రానికి లోబడి ద్రవ్యలోటు పెరగకుండా చూడాలి. అదే సమయంలో శరవేగంతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు అవసరమైన వ్యయానికి సిద్ధపడాలి. అలాగైతేనే ఇప్పుడు అంచనా వేస్తు న్నట్టు వృద్ధిరేటులో స్వల్పంగానైనా పెరుగుదల సాధ్యమవుతుంది. అయితే రానున్న కాలంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, చమురు ధరలు ఇంకా దిగొస్తాయని అంచనా వేసి వృద్ధిరేటు పెరుగుదలపై ఈ సర్వే ఆశపెట్టుకుంది. కానీ ప్రైవేటు పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే, వాటితోపాటు ప్రభుత్వ రంగ పెట్టుబడులను కూడా పెంచితేనే ఇది సాధ్యమవుతుంది. చమురు ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా ఆ ధోరణి ఎంతకాలమో వేచి చూడాలి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వినిమయం చాలా మందగించిందని గణాంకాలు చెబుతున్నాయి. వినియోగ వస్తువులతోపాటు వాహనాల అమ్మకం పడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగిత అధికంగా ఉండటం, ఆదాయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం, వినియోగ వస్తువులపై భారీగా విధిస్తున్న పరోక్ష పన్నులు వగైరాలే ఇందుకు కారణం. సర్వే సూచించినట్టు రాగల ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్వల్పంగా పెరగాలన్నా ఉపాధి కల్ప నపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పరోక్ష పన్నుల మోతను తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక మందగమనంలోనే వ్యవసాయ రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి ఉంటుందని సర్వే చెబుతోంది. ఇప్పటికీ జీడీపీలో వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమల వాటా 14.39 శాతం ఉంది. ఈ రంగానికి మరింత ప్రాధాన్యతనిస్తే ఇది ఉపాధి కల్పనకు ఎంతగానో తోడ్పడుతుంది. సర్వే చెబుతున్నట్టు రుతుపవనాలు సహకరించక వర్షపాతం తగ్గి పంటల దిగు బడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమున్నా తన వంతుగా ప్రభుత్వం ఇన్పుట్ వ్యయ భారాన్ని తగ్గిస్తే ఆ రంగం పుంజుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు ఏమంత సవ్యంగా లేదు. అదసలే కుంటుతూ నడుస్తుంటే దాన్ని మరింత కుంగదీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొత్తంగా అనిశ్చితి అలుముకుంది. ఇరాన్‌పై అమెరికా కత్తి దూయడం, అమెరికా–చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం, దిగు మతులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా అనుసరిస్తున్న ఆత్మరక్షణ విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే కుదేలయ్యేలా చేశాయి. అమెరికా–చైనాల మధ్య మళ్లీ సామరస్య ధోరణి కనబడుతున్నా అది నిలకడగా ఉంటుందా అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు రాగలకాలంలో అంతంతమాత్రమేనని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మన ఎగుమతుల రంగం వృద్ధి చెందడం సులభం కాదు. పైగా ఎగుమతుల్లో ప్రధాన పాత్రవహించే మధ్య, చిన్న, లఘు పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వగైరాల ప్రభావంతో ఏమంత మెరుగ్గా లేవు. శుక్రవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ పరిశ్రమలకిచ్చే ప్రోత్సాహాన్నిబట్టి అవి పుంజుకోవడానికి అవకాశం ఉంది. తాజా ఆర్థిక సర్వే ఉపాధి కల్పన విషయంలో ఇలాంటి సంస్థలపైనే ఆశ పెట్టుకుంది. వీటికి చేయూతనిస్తే భారీగా ఉద్యోగాలు కల్పించగలవని విశ్వసిస్తోంది. కనుక ఈసారి బడ్జెట్లో వీటికి ప్రోత్సాహకాలు బాగానే ఉంటాయని ఆశించాలి. అయితే ప్రపంచ ఆర్థిక స్థితి కూడా మెరుగైతేనే ఈ సంస్థలు ఎగుమతుల్లో పుంజుకోగలవు. అప్పుడు ఉద్యోగాల కల్పన కూడా వాటికి సాధ్యమవుతుంది. మొన్న లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన అనేక సర్వేలు యువ ఓటర్లంతా ప్రధానంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైనే ఆశలు పెట్టుకున్నారని వెల్లడించాయి. ప్రైవేటు రంగ పెట్టుబడులపై ఈ సర్వే బాగా ఆశలు పెట్టుకుంది. కొత్త టెక్నాలజీ ప్రవేశ పెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు ఇవి తోడ్పడతాయంటున్నది. ప్రైవేటు పెట్టుబడులను ఆక ర్షించడం కోసం కార్మిక రంగ సంస్కరణలు అవసరమంటోంది. అయితే ఆ రంగం రాయితీలు తీసుకోవడంపై చూపిన శ్రద్ధ పెట్టుబడులను భారీగా పెంచడంపై చూపటం లేదు. ఈ వాస్తవ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. దేశంలో ఉన్న రాజకీయ సుస్థిరత వృద్ధికి తోడ్పడగలదన్న అంచనా సరైందే. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, అది మన ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, ఆదాయాల్లో తగ్గుదల, ద్రవ్యలోటు పరిమితులు వగైరాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. మన పరిధిలోని అంశాలను సరిచేసుకుంటూనే అంతర్జాతీయ పరిణామాల్లో జాగ్రత్తగా అడుగులేయాలి. అప్పుడే సర్వే ఆశించిన లక్ష్య సాధన అన్నివిధాలా సాధ్యమవుతుంది. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
కారంపూడి: కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో యువ దంపతులు ఉరిపోసుకుని బలవన్మరణం పొందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. గుంటూరు జిల్లా కారంపూడిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఆంధ్రా బ్యాంకు వీధిలో కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), సావిత్రి (30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత ప్రసన్నాంజనేయులు టీ తాగడానికి సెంటర్‌కు వెళ్లాడు. భార్య ఇంటిముందు ముగ్గు పెట్టి ఇంట్లోకి వెళ్లి పిల్లలను లేపి బ్రష్ చేసుకోవాలని కిందకు పంపింది. తర్వాత భర్తను ఉద్దేశించి లేఖ రాసి ఇంటిలోని సందులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటనుంచి వచ్చిన ఆంజనేయులు భార్య ఉరిపోసుకుని మృతి చెందడాన్ని గమనించి మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత అతడు కూడా ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. కిందనుంచి మేడ మీదకు వచ్చిన పిల్లలు శేషు, లోకేష్ తల్లిదండ్రులు వేలాడడాన్ని చూచి ఏడవసాగారు. ఇంతలో వాటర్ క్యాను వేయడానికి వచ్చిన వ్యక్తి వీరిని గమనించి చుట్టుపక్కలవారికి తెలిపాడు ప్రసన్నాంజనేయులు గ్రామంలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు, బియ్యం, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఎస్.ఐ. పెదనారాయణస్వామి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అప్పుల బాధతో అల్లుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని సావిత్రి తండ్రి బచ్చు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. అనాథలైన చిన్నారులు ప్రసన్నాంజనేయులు అక్కయ్య శేషమ్మ కుమార్తె సావిత్రిని పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శేషు (7), లోకేష్ (5) ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కుటుంబమంతా షిరిడీ వెళ్లి బుధవారమే ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు ముందు భర్తను ఉద్దేశించి సావిత్రి వేదనతో ‘బావా మళ్లీ పెళ్లి చేసుకోవద్దు. పిల్లలు జాగ్రత్త’ అంటూ లేఖ రాసింది.