వృద్ధ దంపతుల ఆత్మహత్య
వృద్ధ దంపతుల ఆత్మహత్య
Published Thu, Jul 21 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
కారంపూడి: కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో యువ దంపతులు ఉరిపోసుకుని బలవన్మరణం పొందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. గుంటూరు జిల్లా కారంపూడిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఆంధ్రా బ్యాంకు వీధిలో కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), సావిత్రి (30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత ప్రసన్నాంజనేయులు టీ తాగడానికి సెంటర్‌కు వెళ్లాడు. భార్య ఇంటిముందు ముగ్గు పెట్టి ఇంట్లోకి వెళ్లి పిల్లలను లేపి బ్రష్ చేసుకోవాలని కిందకు పంపింది. తర్వాత భర్తను ఉద్దేశించి లేఖ రాసి ఇంటిలోని సందులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటనుంచి వచ్చిన ఆంజనేయులు భార్య ఉరిపోసుకుని మృతి చెందడాన్ని గమనించి మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత అతడు కూడా ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. కిందనుంచి మేడ మీదకు వచ్చిన పిల్లలు శేషు, లోకేష్ తల్లిదండ్రులు వేలాడడాన్ని చూచి ఏడవసాగారు. ఇంతలో వాటర్ క్యాను వేయడానికి వచ్చిన వ్యక్తి వీరిని గమనించి చుట్టుపక్కలవారికి తెలిపాడు ప్రసన్నాంజనేయులు గ్రామంలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు, బియ్యం, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఎస్.ఐ. పెదనారాయణస్వామి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అప్పుల బాధతో అల్లుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని సావిత్రి తండ్రి బచ్చు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు.
అనాథలైన చిన్నారులు
ప్రసన్నాంజనేయులు అక్కయ్య శేషమ్మ కుమార్తె సావిత్రిని పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శేషు (7), లోకేష్ (5) ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కుటుంబమంతా షిరిడీ వెళ్లి బుధవారమే ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు ముందు భర్తను ఉద్దేశించి సావిత్రి వేదనతో ‘బావా మళ్లీ పెళ్లి చేసుకోవద్దు. పిల్లలు జాగ్రత్త’ అంటూ లేఖ రాసింది.
Advertisement
Advertisement