ఆశల సర్వే! | Nirmala Sitharaman Today Submit Budget In Parliament | Sakshi
Sakshi News home page

ఆశల సర్వే!

Published Fri, Jul 5 2019 3:38 AM | Last Updated on Fri, Jul 5 2019 3:38 AM

Nirmala Sitharaman Today Submit Budget In Parliament - Sakshi

ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.8 శాతంగా ఉన్నదని, ఆగమిస్తున్న ఆర్థిక సంవత్సరంలో అది 7 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్న ఆర్థిక సర్వేను  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సాధారణంగా ఆర్థిక సర్వేలు గడిచిన కాలానికి సంబంధించిన చేదు నిజాలను వెల్లడిస్తూనే రాగల సంవత్సరం దివ్యంగా ఉండగలదన్న భరోసా కల్పిస్తాయి. కానీ ఈ ఆర్థిక సర్వే వృద్ధి రేటులో స్వల్పంగా మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతోంది. అయితే వచ్చే అయిదేళ్లలో అది 8 శాతానికి చేరేం దుకు... ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ అప్పటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి అనువైన విధానాల అమలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తోంది. ఏటా సాధారణ బడ్జెట్‌ సమర్పించే ముందురోజు గడిచిన 12 నెలల కాలం పద్దులను సమీక్షిస్తూ, ఏ రంగాల పనితీరు ఏవిధంగా ఉన్నదో తెలియజేస్తూ ఆర్థిక సర్వేను వెలువరిస్తారు. అమలైన అభి వృద్ధితో వచ్చిన ఫలితాలు, మున్ముందు అనుసరించదల్చుకున్న విధానాలు సర్వేలు వివరిస్తాయి.

ఈసారి నిర్మలా సీతారామన్‌ ముందున్న సవాళ్లు సాధారణమైనవి కాదు. ఆమె ఒకపక్క నిబంధనల చట్రానికి లోబడి ద్రవ్యలోటు పెరగకుండా చూడాలి. అదే సమయంలో శరవేగంతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు అవసరమైన వ్యయానికి సిద్ధపడాలి. అలాగైతేనే ఇప్పుడు అంచనా వేస్తు న్నట్టు వృద్ధిరేటులో స్వల్పంగానైనా పెరుగుదల సాధ్యమవుతుంది. అయితే రానున్న కాలంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, చమురు ధరలు ఇంకా దిగొస్తాయని అంచనా వేసి వృద్ధిరేటు పెరుగుదలపై ఈ సర్వే ఆశపెట్టుకుంది. కానీ ప్రైవేటు పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే, వాటితోపాటు ప్రభుత్వ రంగ పెట్టుబడులను కూడా పెంచితేనే ఇది సాధ్యమవుతుంది. చమురు ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా ఆ ధోరణి ఎంతకాలమో వేచి చూడాలి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వినిమయం చాలా మందగించిందని గణాంకాలు చెబుతున్నాయి. వినియోగ వస్తువులతోపాటు వాహనాల అమ్మకం పడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగిత అధికంగా ఉండటం, ఆదాయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం, వినియోగ వస్తువులపై భారీగా విధిస్తున్న పరోక్ష పన్నులు వగైరాలే ఇందుకు కారణం. సర్వే సూచించినట్టు రాగల ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్వల్పంగా పెరగాలన్నా ఉపాధి కల్ప నపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పరోక్ష పన్నుల మోతను తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక మందగమనంలోనే వ్యవసాయ రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి ఉంటుందని సర్వే చెబుతోంది. ఇప్పటికీ జీడీపీలో వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమల వాటా 14.39 శాతం ఉంది. ఈ రంగానికి మరింత ప్రాధాన్యతనిస్తే ఇది ఉపాధి కల్పనకు ఎంతగానో తోడ్పడుతుంది. సర్వే చెబుతున్నట్టు రుతుపవనాలు సహకరించక వర్షపాతం తగ్గి పంటల దిగు బడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమున్నా తన వంతుగా ప్రభుత్వం ఇన్‌పుట్‌ వ్యయ భారాన్ని తగ్గిస్తే ఆ రంగం పుంజుకుంటుంది.  

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు ఏమంత సవ్యంగా లేదు. అదసలే కుంటుతూ నడుస్తుంటే దాన్ని మరింత కుంగదీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొత్తంగా అనిశ్చితి  అలుముకుంది. ఇరాన్‌పై అమెరికా కత్తి దూయడం, అమెరికా–చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం, దిగు మతులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా అనుసరిస్తున్న ఆత్మరక్షణ విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే కుదేలయ్యేలా చేశాయి. అమెరికా–చైనాల మధ్య మళ్లీ సామరస్య ధోరణి కనబడుతున్నా అది నిలకడగా ఉంటుందా అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు రాగలకాలంలో అంతంతమాత్రమేనని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మన ఎగుమతుల రంగం వృద్ధి చెందడం సులభం కాదు. పైగా ఎగుమతుల్లో ప్రధాన పాత్రవహించే మధ్య, చిన్న, లఘు  పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వగైరాల ప్రభావంతో ఏమంత మెరుగ్గా లేవు. శుక్రవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఈ పరిశ్రమలకిచ్చే ప్రోత్సాహాన్నిబట్టి అవి పుంజుకోవడానికి అవకాశం ఉంది. తాజా ఆర్థిక సర్వే ఉపాధి కల్పన విషయంలో ఇలాంటి సంస్థలపైనే ఆశ పెట్టుకుంది. వీటికి చేయూతనిస్తే భారీగా ఉద్యోగాలు కల్పించగలవని విశ్వసిస్తోంది. కనుక ఈసారి బడ్జెట్‌లో వీటికి ప్రోత్సాహకాలు బాగానే ఉంటాయని ఆశించాలి. అయితే ప్రపంచ ఆర్థిక స్థితి కూడా మెరుగైతేనే ఈ సంస్థలు ఎగుమతుల్లో పుంజుకోగలవు. అప్పుడు ఉద్యోగాల కల్పన కూడా వాటికి సాధ్యమవుతుంది. మొన్న లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన అనేక సర్వేలు యువ ఓటర్లంతా ప్రధానంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైనే ఆశలు పెట్టుకున్నారని వెల్లడించాయి. 

ప్రైవేటు రంగ పెట్టుబడులపై ఈ సర్వే బాగా ఆశలు పెట్టుకుంది. కొత్త టెక్నాలజీ ప్రవేశ పెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు ఇవి తోడ్పడతాయంటున్నది. ప్రైవేటు పెట్టుబడులను ఆక ర్షించడం కోసం కార్మిక రంగ సంస్కరణలు అవసరమంటోంది. అయితే ఆ రంగం రాయితీలు తీసుకోవడంపై చూపిన శ్రద్ధ పెట్టుబడులను భారీగా పెంచడంపై చూపటం లేదు. ఈ వాస్తవ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. దేశంలో ఉన్న రాజకీయ సుస్థిరత వృద్ధికి తోడ్పడగలదన్న అంచనా సరైందే. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, అది మన ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, ఆదాయాల్లో తగ్గుదల, ద్రవ్యలోటు పరిమితులు వగైరాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. మన పరిధిలోని అంశాలను సరిచేసుకుంటూనే అంతర్జాతీయ పరిణామాల్లో జాగ్రత్తగా అడుగులేయాలి. అప్పుడే సర్వే ఆశించిన లక్ష్య సాధన అన్నివిధాలా సాధ్యమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement