మూడేళ్ల దాకా మూడు శాతం..
► ద్రవ్యలోటు లక్ష్యంపై ఎఫ్ఆర్బీఎం ప్యానెల్ సిఫార్సులు
► 2023 నాటికి 2.5 శాతానికి తగ్గించుకోవాలని సూచన
► కొత్తగా ఆర్థిక మండలి ఏర్పాటుకు సిఫార్సు
న్యూఢిల్లీ: ద్రవ్య లోటును 3 శాతానికే పరిమితం చేయాలని ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) కమిటీ సిఫార్సు చేసింది. మూడేళ్లు దీన్ని ఇదే స్థాయిలో కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.2 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వార్షిక లక్ష్యాల నిర్దేశానికి కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ సారథ్యంలోని ఎఫ్ఆర్బీఎం కమిటీ సూచించింది.
స్థూల దేశీయోత్పత్తి, రుణ నిష్పత్తిపై మరింతగా దృష్టి సారించాలని సూచించింది. 2023 నాటికి జీడీపీ, రుణ నిష్పత్తి కేంద్రం, రాష్ట్రాలన్నింటికీ కలిపి 60 శాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానిది 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలది 20 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. మూడేళ్ల దాకా 3 శాతం స్థాయిలో, ఆ తర్వాత 2022–23 నాటికి 2.5 శాతానికి తగ్గించాలని సూచించిన ఎఫ్ఆర్బీఎం కమిటీ.. అరశాతం అటూ, ఇటూ మారేందుకు కొంత వెసులుబాటు కల్పించింది.
ఏకపక్ష లక్ష్యాలు: సీఈఏ అరవింద్ సుబ్రమణ్యన్
సిఫార్సులతో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విభేదించారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాలు ఏకపక్షంగా ఉన్నాయని ఒక నోట్లో వ్యాఖ్యానించారు. వీటికి కట్టుబడి ఉంటే ఎకానమీపై ప్రతికూల ప్రభావాలు తప్పవన్నారు. వీటి కారణంగా విధానకర్తలు వివిధ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాల్సి వస్తుందని, దీంతో మొత్తం ఆర్థిక విధానానికి రిస్కులు ఉంటాయని తెలిపారు. ప్రాథమిక లోటు అయిదేళ్లలో స్థిరంగా తగ్గుముఖం పట్టేలా ఒకే లక్ష్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.