గోల్డెన్‌గర్ల్ ఆఫ్ ఫిక్షన్
నూటయాభై ఒక్క మంది ప్రముఖ నవలా కారులు.. వారు సృజించిన సాహిత్య సుగంధాలు.. వాళ్లందరి మధ్య ఆమెకు, ఆమె సృజించిన సాహిత్యానికి గొప్ప గుర్తింపు దక్కింది. ఫిక్షనల్ సాహిత్యానికి చేసే సత్కారాల్లో ఆస్కార్ స్థాయి అయిన బుకర్ ప్రైజ్ విన్నర్‌గా ఆమె వార్తల్లోకి వచ్చింది. న్యూజిలాండ్‌కు చెందిన ఈ యువ రచయిత్రి పేరు ఇలినార్ కాటన్. బుకర్‌ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా మాత్రమే గాక.. ఈ అవార్డు విషయంలో రెండు అరుదైన రికార్డులు నెలకొల్పిన కాటన్ (28)ప్రస్థానం ఇది...
సృజనకు వయసుతో సంబంధం లేదు. ఆకాశంలోని అందమైన హరివిల్లును వర్ణించడానికి, నెలవంక అందం గురించి అలవోకగా కొన్ని పదాలు రాయడానికి వయసుతో సంబంధం ఉండదేమో... భావుకతను వ్యక్తం చేయడానికి వయసుతో పనిలేదుకానీ.. వాటిని నేర్పుతో అందంగా అక్షరరూపం ఇవ్వడానికి వయసుండాలి. అనుభవంతో కూడిన వయసుండాలి... ఇదంతా ఇది వరకటి అభిప్రాయం.
ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని కలిగించేలా చేస్తోంది ఇలియనార్ కాటన్. పాఠకులను ఆసాంతం ఆకట్టుకోగలిగే శిల్పం, కుతూహలాన్నీ కలిగించే శైలి తోడైతే ఆ రచన ఎవరినైనా కట్టిపడేస్తుందని.. దానికీ రచయిత్రి వయసుకు సంబంధం ఉండదని నిరూపిస్తోంది. ఒక ఊహా ప్రపంచాన్ని మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయే పదజాలంతో ఆవిష్కరించింది... యంగెస్ట్ బుకర్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచింది.
కెనడాలో పుట్టిన కివీ..
కాటన్ న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి. వీరి కుటుంబం కెనడాలో ఉన్న సమయంలో కాటన్ పుట్టింది. తర్వాత వీళ్లు న్యూజిలాండ్ తిరిగి వచ్చారు. అక్కడి విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్లో ‘క్రియేటివ్ వర్క్స్’లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ఇలా సృజనాత్మక చదువును ఎంచుకొన్న కాటన్ తన 22 వ యేట ‘ది రిహార్సల్’ అనే నవలను రాసింది. ఒక టీచర్‌కు, స్టూడెంట్‌కు మధ్య ఉండే ప్రేమాయణం గురించిన ఆ నవల న్యూజిలాండ్ మేధావుల ప్రశంసలు పొందింది. ‘గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఫిక్షన్’గా ప్రశంసలు అందుకొంది. ఇప్పుడు ‘ల్యూమినరీస్’ నవలకు దక్కిన ప్రైజ్‌తో సాహిత్య రంగంలో కాటన్ పేరు మార్మోగుతోంది.
19 వ శతాబ్దపు కథాంశం...
తొలి నవలకు భిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని బుకర్ ప్రైజ్ స్థాయికి ఎదిగింది ఈ యువ రచయిత్రి. 1860 కాలంలో జరిగిన బంగారు నిధి వేటకు సంబంధించిన కథాంశంతో ఉంటుంది ‘ల్యూమినరీస్’ నవల. న్యూజిలాండ్ నేపథ్యంతో ఉండే కథలో నాటి పరిస్థితుల వర్ణన విషయంలో కాటన్‌కు ప్రశంసలు దక్కాయి. బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల్లో ఒకరైన రాబర్ట్ మ్యాక్ఫర్లెన్ అవార్డును ప్రకటిస్తూ ‘‘అద్భుతం, ఉత్తేజకరమైన రచన..’’ అంటూ కాటన్‌ను ప్రశంసించారు.
అతి పెద్ద నవల..
అతి చిన్న వయసులో బుకర్‌ను అందుకొన్న కాటన్.. అతి పెద్ద నవలతో ఈ ఫీట్ సాధించింది. 832 పేజీలుంటుంది ఈ నవల. 45 యేళ్ల బుకర్ ప్రైజ్ చరిత్రలో అవార్డు గెలుచుకొన్న అతిపెద్ద నవల ఇది. ఇది మరో రికార్డు. దీని గురించి కాటన్ మాట్లాడుతూ ‘‘ఈ పుస్తకం సైజ్ కోసమైనా నేను పెద్ద హ్యాండ్‌బ్యాగ్ కొనుక్కోవాలి’’ అంటూ చమత్కరించింది. బుకర్ ప్రైజ్ గెలుచుకొన్న రెండో న్యూజిలాండ్ రచయిత కాటన్. సాహిత్యప్రపంచంలో ఈ విధంగా ఆమె తనదైన ప్రత్యేకతను నిలుపుకుంది.
- జీవన్ రెడ్డి బి.
చిన్న వయసులోనే సాహిత్యరంగంలోని అత్యున్నత స్థానానికి చేరుకొన్న కాటన్ ప్రస్తుతం ఆక్లాండ్(న్యూజిలాండ్)లోని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ‘క్రియేటివ్ రైటింగ్’లో టీచర్‌గా పనిచేస్తోంది.
ప్రైజ్‌మనీ కింద కాటన్‌కు 50 వేల పౌండ్లు వస్తాయి. రూపాయల్లో ఇది దాదాపు 50 లక్షలు.
కామన్వెల్త్ దేశాలు, జింబాబ్వేకు చెందిన రచయితలు మాత్రమే బుకర్ ప్రైజ్‌కు అర్హులు.