‘ఇంటర్’కు డిజిటల్ లెర్నింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యలో (ప్లస్ టూ) ఐటీ, డిజిటల్ లెర్నింగ్ అమలు అవార్డు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు లభించింది. ఎలెట్స్ టెక్నో మీడియా అనే సంస్థ శుక్రవారం ఢిల్లీలో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహించింది. దీనిలో ఐదు దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలతోపాటు మన దేశంలోని వివిధ వర్సిటీలు, ఇంటర్మీడియెట్ బోర్డులు పాల్గొన్నాయి. డిజిటల్ లెర్నింగ్ విధానంలో భాగంగా తాము అమలు చేస్తున్న స్టూడెంట్స్ ఆన్లైన్ సర్వీసెస్, మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్న సేవలు, ఆన్లైన్ ప్రవేశాలు, బయోమెట్రిక్ హాజరు విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కంప్యూటర్ విద్య తదితర అంశాలపై తెలంగాణ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ బోర్డును సమ్మిట్ ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని అశోక్ వెల్లడించారు. ఈ అవార్డును జార్ఖండ్ సీఎం రఘువీర్ దాస్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.
తెలుగు వర్సిటీ వీసీకి టీఎస్పీఎస్సీ చైర్మన్ అభినందనలు
తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. వీసీగా సత్యనారాయణ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, గొప్పదనాన్ని, హస్తకళలను ప్రపంచానికి చాటేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు మతీనుద్దీన్‌ఖాద్రీ, వివేక్, మంగరి రాజేందర్, సాయిలు, మన్మధరెడ్డి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ రాములు పాల్గొన్నారు.