Elizabeth 2
-
ప్రజాస్వామ్యంలో రాజరికమా?
‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. మరి ఇంకా అక్కడ రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయారయ్యాడు– అని ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళబెడతారు. అరవై ఏళ్ళ పాటు బ్రిటన్ ‘రాణి’ పదవిలో వున్న ఎలిజెబెత్, 96 ఏళ్ళ వయసులో ఈ మధ్య పోయింది. ఆ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు కొన్ని. ‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. ఫ్రాన్స్ కంటే ఎన్నో ఏళ్ళ ముందే ‘రాజరికానికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారి బ్రిటన్‌లోనే విప్లవం’ జరిగింది అంటారు. మరి ఇంకా రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? నిన్నటి దాకా, రాణీ రూపంలో వుంది. ఇప్పుడేమో ఆమె కొడుకు రాజయ్యాడు. మనుమలు యువ రాజులయ్యారు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించడానికి మార్క్స్ బ్రిటన్‌లో భాగమైన ఇంగ్లండునే ఉదాహరణగా తీసు కున్నాడు. అందరూ బ్రిటన్‌ని ‘గొప్ప ప్రజాస్వామ్య దేశం’ అంటారు. మరి అక్కడ ఇంకా రాజకుటుంబం వాళ్ళు పరిపాలనలో వున్నారే? అంతా వింతగా వుంది! దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి?’అని అనేక ప్రశ్నలు గతంలోవే మళ్ళీ మళ్ళీ లేస్తున్నాయి. ఇవన్నీ మంచి సందేహాలే. కానీ, ఈ సందేహాలు, బయటి దేశాల ప్రజలలో కంటే, బ్రిటన్ ప్రజలలోనే సహజంగా రావాలి. కానీ, అక్కడి ప్రజలకి, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఈ ప్రశ్నలు రానేలేదు. అక్కడ కొన్ని కమ్యూనిస్టు గ్రూపులవాళ్ళు ‘రాజరికం నశించాలి, కార్మికవర్గ రిపబ్లిక్ రావాలి’ అనే నినాదాలు ఇస్తూనే వుంటారు. ఇప్పటికీ ఇస్తూనే వున్నారు. కానీ, అక్కడ దాదాపు 400 ఏళ్ళ కిందట రాజరికానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి, ఒక రాజుని ఉరితీసి, కొన్నాళ్ళ తర్వాత ఇంకో రాజుని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారో వివరించే పని జరగలేదు. అందుకే, అక్కడి ప్రజలకి చిన్నప్పటినించీ చూస్తూవున్న విషయాలను చూడడానికి మించి ఏ కొత్త ఆలోచనా పుట్టలేదా? అక్కడ చిన్నతనం నించీ, స్కూళ్ళల్లో జాతీయ గీతంలోనే రాజు పట్లా, రాణీ పట్లా గౌరవాన్ని బోధిస్తారని చదివాం. ‘‘గాడ్ సేవ్ ది కింగ్’’ (దేవుడు రాజుని రక్షించుగాక!) అని మొదలవుతుంది వాళ్ళ జాతీయ గీతం. రాజు పోయాక, అతని కూతురు రాణీగా సింహాసనం ఎక్కాక, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనడం మొదలెట్టారట. స్కూలు పిల్లల్ని రాజప్రాసాదాలకూ; విహార యాత్రలలో రాణీ కుటుంబీకులు విడిది చేసే భవనాలకూ తీసికెళ్ళి చూపించడం చేస్తారు. రాజసం ఉట్టిపడేలా, రాణీ ధరించే నగలూ, రకరకాలైన టోపీలూ, ధగ ధగ మెరిసే పెద్ద గౌనులూ... ఇలా రాణీ గారి ఆడంబరాలన్నిటినీ అక్కడి పత్రికలూ, టీవీలూ, నిరంతరం చూపిస్తూనే వుంటాయి. లండన్‌లోని ఒక కార్మిక నాయకురాలు 4 ఏళ్ళ కిందట రాసిన ఒక వ్యాసంలో, శ్రామిక వర్గ స్త్రీలలో కూడా రాణీ అంటే, ఎంత గ్లామరో (ఆకర్షణో) చెప్పడానికి ఒక సంఘటన చెప్పింది. కార్మికురాలైన తన తల్లి, రాణీని ఒక పెరేడ్లో చాలా దగ్గరగా చూసి, ‘‘రాణీ గారు ఎంత అందంగా, ఎంత గొప్పగా వుంటుందో?’’ అని అన్నదట. తల్లి మెచ్చు కోళ్ళకి జవాబుగా, మన కార్మిక నాయకురాలు తల్లితో ఇలా అన్నదట: ‘‘అవును అమ్మా! 24 గంటలూ, వైద్యులూ, బ్యూటీషియన్లూ, సేవ కులూ, వంటవాళ్ళూ అందుబాటులో వుంటే, అలా వుండక ఎలా వుంటారులే’’ అని. పనీ, పాటా వుండదు రాణీ గారికి, రిబ్బన్లు కత్తిరిం చడం తప్ప– అని కూడా అందట. దానికి వాళ్ళమ్మ ‘ఏమిటా మొరటు మాటలు?’ అనేదట. ‘వాళ్ళ రాజసాలూ, ఠీవీలూ, విలాసాలూ అన్నీ ప్రభుత్వానికి ప్రజలు కట్టే పన్నుల నించే గదా తగలేసేది’ అని కూడా కూతురు అనేదట. ఇవన్నీ నిజమే. అంతే కాదు, రాణీ ఆస్తుల విలువ 3 వేల కోట్ల పైనే అని పత్రికలు రాశాయి. అనేక భవనాలూ, అనేక వ్యాపార సంస్థలూ, వ్యవసాయ ఎస్టేట్లూ, షేర్లూ, ఇదనీ అదనీ లేదు. ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేని రాణీకి కుప్పలు కుప్పల ఆస్తులు! రాజరికం ఇప్పటికీ ఎందుకు వుందో అర్థం కావాలంటే, చరిత్రలో రెండు, మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అదంతా క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1625లో ఇంగ్లండుకు రాజు మొదటి ఛార్లెస్ అనేవాడు. రాజూ, మతాధిపతులూ, ఫ్యూడల్ భూస్వాములూ, ఒక వర్గం. జీతం పద్ధతి మీద కూలీలను పెట్టుకుని, తయారు చేయించిన సరుకులను పట్టణాలలో అమ్మించే వర్తక భూస్వాములు ఒక వర్గం. వీళ్ళలో చిన్న చిన్న కర్మాగారాల (ఫ్యాక్టరీలకు మొదటి రూపాలు) యజమానులు కూడా వున్నారు. కౌలు రైతులూ, చేతి వృత్తుల వాళ్ళూ, సొంత శ్రమల మీద బ్రతికే ఇతర శ్రామికులూ, ఒక వర్గం. రాజూ, మతాధికారులూ, ఫ్యూడల్ ప్రభువులూ చేసే పనులు శ్రామిక వర్గాల మీద పెత్తనం చెయ్యడం! రాజు ఏర్పర్చిన పార్లమెంటులో, భూమి మీదేగాక వర్తక సరుకుల మీద లాభాలు తినే వర్తక భూస్వాములు ఎక్కువ సంఖ్యలో వున్నారు. (అప్పటి కొత్త రకం ప్రభువర్గం వాళ్ళే. వీళ్ళలో ముఖ్యుడు క్రాంవెల్ అనే పార్లమెంటు సభ్యుడు.) పెత్తనం అంతా రాజుదే. అందుకని, ఆ పెత్తనానికి వ్యతి రేకంగా, మెజారిటీగా వున్న రైతుల్నీ, చేతి వృత్తుల వారినీ కలుపుకొని, సరుకుల ద్వారా లాభాల్ని పొందే వర్తక భూస్వాములూ, పెట్టుబడి దారులూ, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఎన్నో జరిగాక రాజుని ఓడించి, రాజుని బహిరంగంగా ఉరితీశారు. కానీ, రాజు లేనంత మాత్రాన ప్రజల సమస్యలు తీరతాయా? ప్రజల వైపు నించీ ఉద్యమాలు మొదలయ్యాయి. అలాంటి ఉద్యమాలలో, ‘లెవెలర్లు’ (సమానత్వవాదులు) నడిపిన ఉద్యమం ఒకటి. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభువర్గమూ, వర్తక భూస్వా ములూ, ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడం మొదలు పెట్టారు. అంతేకాదు. ప్రజల ఉద్యమాన్ని మరింతగా అణచడానికి మళ్ళీ ఇంకో రాజుని (విలియం) తీసుకొచ్చి కూర్చోపెట్టారు. బ్రిటన్‌లో అధికారం అంతా, పెట్టుబడిదారులతో నిండిన పార్ల మెంటుదే అయినా, పేరుకి మాత్రం రాజే దేశాధినేత. అందుకే మార్క్స్, 1855లో, ‘బ్రిటన్ రాజ్యాంగం’ అనే వ్యాసంలో, ఆ రాజ్యాంగం అధికారికంగా (అధికారం అనే పేరుకి) పాలించే భూస్వామ్య ప్రభువులకూ (లాండెడ్ అరిస్టోక్రసీ), అసలు (యాక్చు వల్లీ) పాలించే బూర్జువా వర్గానికీ మధ్య, ఒక రాజీ– అని అంటాడు. రాజు అనేవాడు కూడా ఒక పెద్ద భూస్వామే. భూస్వామ్య వర్గానికి ప్రతినిధి కూడా. ఆ రాజుని ఒక పెద్ద దేవుణ్ణి చేసి పారేశారు. అందుకే, ఏంగెల్స్ ఇంగ్లండ్ గురించి 1844లో రాసిన ఒక వ్యాసంలో, రాజు పట్ల ఆరాధన పరమ అసహ్యకరంగా (డిస్గస్టింగ్ కల్ట్) ఉంది – అని అన్నాడు. ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే, అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయార య్యాడు– అని కూడా ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళ బెడతారు. ఒక పక్క రాజో, రాణీయో ఉంటే, ఇంకో పక్క ‘ప్రజా స్వామ్యబద్ధంగా’ ప్రజలు ఓట్లువేసి పంపిన ‘ప్రజా ప్రతినిధులు’ ఉంటారు. ఆ రకంగా బ్రిటన్‌లో ఈనాడు కూడా ఉన్నది, రాజరికపు ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగాన్ని చూస్తే, రాజుతో పోల్చదగ్గ భారత రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించడానికి వచ్చేటప్పుడు, రాష్ట్రపతి అంగరక్షక దళంలో అన్నీ గుర్రాలే! అంతా పాత రాజరిక సంస్కృతే! రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో కూచుని వుంటే, ఆ బగ్గీకి ముందూ, వెనకా, రెండు పక్కలా, ఎనభై ఆరు గుర్రాలూ, వాటిని నడిపే సైనికులూ వుంటారు. ఆ దృశ్యాల్ని చూస్తే జనానికి మతి పోతుంది. అంత రాజరిక ఆర్భాటం లేకపోతే, ఆ పదవి మీద జనాలకి లక్ష్యం వుండదని పాలకులకు భయం! శ్రామిక వర్గపు అమాయకత్వాలూ, అజ్ఞానాలూ ఇవన్నీ! ఈ శ్రామికవర్గం ఇలా వుంటే, ధనిక పాలకవర్గం అలా వుండదా? రంగనాయకమ్మ (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి) -
ఇక బ్రిటన్ రాజు చార్లెస్
బల్మోరల్ క్యాజిల్: బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రైవీ కౌన్సిల్ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదీ చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత -
కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 (96) ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్–2 1953లో సింహాసనమెక్కారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు. చదవండి: ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం.. మరో నాలుగు నెలలు: -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
అమ్మో అందాల రాక్షసి : 650 మందిని చంపి వాళ్ల రక్తంతో
ప్రతి ఒక్కరు స్లిమ్ గా, చక్కటి గ్లోతో మెరిసి పోవాలని అనుకుంటారు. అందుకే తాము అభిమానించే హీరోలు, హీరోయిన్లు అందం కోసం వాడే బ్రాండెడ్ క్రీమ్స్ ను అప్లయ్ చేసి ఎదుటి వారికి తమని తాము అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. అది కూడా సాధ్యపడకపోతే చివరికి అరే వాళ్లకంటే మనం బాగున్నాం అంటూ వారికి వారు సర్ధి చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే ఇలా ఉంటే పూర్వం అందం కోసం మనిషి రక్తంలో స్నానం చేసేవారు. ముఖ్యంగా 16వ శతాబ్ధానికి చెందిన రాణులు వారి ఆస్థానంలో పెద్దలు చెప్పినట్లు అందం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు. అందులో కొన్ని పనులు అత్యంత దారుణంగా ఉండేవి. ఎలిజిబెత్ బాతోరి ప్రపంచంలో అంత్యత ప్రమాదకరమైన రాణి. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఓ భాగమైన హంగేరి దేశంలో హంగేరియన్ రాజకుటుంబానికి చెందిన రాణి ఈ ఎలిజిబెత్ బాతోరి. హంగేరిలో ఓ రాజ్యాన్ని పరిపాలించేది. ఆమెకు అందంగా ఉండడం అంటే మహా పిచ్చి. ఆ అందం కోసం 1585 నుండి 1610 సంవత్సరం మధ్య కాలంలో పెళ్లికాని 650 మంది యువతుల్ని చంపేసింది. రాణి కావడంతో తన రాజభవనంలో పనిచేసేందుకు పెళ్లికాని యువతుల్ని ఆహ్వానించేది. పనిపేరుతో వారిని చంపేసి వారి రక్తంతో స్నానం చేసేది. ఎలిజిబెత్ బాతోరికి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరో చెప్పారట. పెళ్లికాని యువతుల రక్తంతో స్నానం చేస్తే అందంగా కనిపిస్తారని. అదిగో అప్పటి నుండి పెళ్లికాని యువతుల్ని పనికి పిలిపించి హత్యలు చేసింది. ఆమెకు మరో ఆరుగురు సహకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతమందిని హత్య చేస్తుంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ఆమె అసలే రాణి. ఎవరు ప్రశ్నిస్తారు. అయితే చివరికి పాపం పండింది. ఎలిజిబెత్ దగ్గర పనిచేసే సుసన్నా అనే సేవకురాలు బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 1610లో ఆమెకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. రాణి తన పలుకుబడితో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ బాతోరి పై హంగేరియన్ కు చెందిన డైరక్టర్ జురాజ్ జకుబిస్కో హాలీవుడ్ లో బాతోరి (కౌంట్ నెస్ ఆఫ్ బ్లడ్ ) పేరుతో సినిమా తెరకెక్కించారు. 10మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2008 జులై 10న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
రాణి వెడలె
క్రిస్మస్కింకా రెండు రోజుల సమయం ఉంది. బ్రిటన్ ప్రజలు మాత్రం గత శుక్రవారమే అధికారికంగా క్రిస్మస్ మూడ్‌లోకి వచ్చేశారు. ఇది ఏటా ఉండేదే. క్వీన్ ఎలిజబెత్–2 లండన్‌లోని తన అధికార నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అక్కడికి నూట పన్నెండు మైళ్ల దూరంలోని శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కు రైల్లో బయల్దేరగానే బ్రిటన్ అంతటా క్రిస్మస్ సందడి మొదలౌతుంది. తొంభై మూడేళ్ల బ్రిటన్ రాణిగారు ఎప్పటిలా ఈ ఏడాది కూడా సాధారణ ప్రయాణీకుల రైల్లోనే తనకోసం ప్రత్యేకంగా ఒక బోగీని రిజర్వు చేయించు కుని డిసెంబరు 20న కింగ్ లిన్స్ స్టేషన్లో దిగారు. శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ అక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. ఆమె తండ్రి ఆరవ జార్జి, తాత ఐదవ జార్జి నివసించిన రాజప్రాసాదం అది. అతి ముఖ్యులు ఆఖర్న ప్రతి క్రిస్మస్కీ కుటుంబంతో పాటు శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో గడిపి వెళ్తారు క్వీన్ ఎలిజబెత్. మొదట ఆమె, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వెళ్తారు. వాళ్ల వెనుక మిగతావాళ్లు. ఆ మిగతావాళ్లు కూడా ఎవరు పడితే వాళ్లు రైలు ఎక్కేయడానికి లేదు. దానికో క్రమం ఉంటుంది. క్వీన్, ప్రిన్స్ వెళ్లాక.. ఇక ఆ వంశంలో వయసులో బాగా చిన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు బయల్దేరి వెళ్లారు. అందరి కన్నా చివర్లో ‘అతి ముఖ్యులు’ ఎస్టేట్‌కు చేరుకుంటారు. ఆ అతి ముఖ్యులు ఎవరంటే.. వారసత్వ స్థానానికి ప్రాధాన్యతా క్రమంలో ఉన్న క్వీన్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆ కుమారుడి కుమారుడు ప్రిన్స్ విలియమ్స్, విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్.. అలా ఉంటుంది సంప్రదాయం. ఈసారి క్వీన్ ఎలిజబెత్‌తో పాటు ప్రిన్స్ ఫిలిప్ కూడా శాండ్రింగ్‌హామ్ ప్రయాణానికి సిద్ధం అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్విర్డ్ సెవెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించవలసి వచ్చింది. ‘‘98 ఏళ్ల వయసులో ఇవి అవసరమైన పరీక్షలే తప్ప అకస్మాత్తు పరీక్షలేమీ కావు’’ అని రాజ వైద్యుడు చెప్పడంతో క్వీన్ తన మనసును కుదుటపరచుకుని తనొక్కరే శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కు వెళ్లవలసి వచ్చింది. ముందుగా నిర్ణయించిన సమయం కాబట్టి వెళ్లి తీరవలసి వచ్చింది. రెండు విందు భోజనాలు ఏటా రాజ కుటుంబం అంతా ఈ ఎస్టేట్‌లోనే క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే వేడుకలు జరుపుకుంటుంది. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ ఒకటి కాదు. క్రిస్మస్ కోసం ఎదురు చూసే ముందురోజు సాయం సమయం అంతా క్రిస్మస్ ఈవ్ అయితే, ఆ మర్నాడు చేసుకునేది క్రిస్మస్. శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో క్రిస్మస్ ఈవ్‌కి రాజకుటుంబం ‘బ్లాక్ టై డిన్నర్’ చేస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంది. క్రిస్మస్ రోజు టర్కీ కోడి విందు భోజనం ఎలాగూ ఉంటుంది. ముఖ్యమైన బయటి వ్యక్తులతో కలిసి చేసే డిన్నర్ ‘బ్లాక్ టై డిన్నర్’ అయితే, కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి చేసేది టర్కీ కోడి విందు. దీనినే టర్కీ ఫీస్ట్ అంటారు. ఇలా అనడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం రైతులు పాల కోసం పశువుల్ని, గుడ్ల కోసం కోళ్లను తమ దగ్గర ఉంచుకుని, టర్కీ కోళ్ల ను మాత్రమే మాంసం కోసం అమ్మేవారట! పైగా అప్పట్లో పశువులు, కోళ్ల ధర ఎక్కువగా ఉండటం అందుకొక కారణం అంటారు. ఏదైనా టర్కీ ఫీస్ట్ అనేది బ్రిటన్‌లోనే కాదు, ఒక్క క్రిస్మస్ రోజే కాదు.. అన్ని పాశ్చాత్య దేశాలలో, అన్ని వేడుకలలో సంప్రదాయం అయింది. లిగింతల కానుకలు క్రిస్మస్ ఈవ్‌కి రాజమాత కుటుంబ సభ్యులు ఇచ్చిపుచ్చుకునే కానుకలు కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ప్రత్యేకమైనవే తప్ప ఖరీదైనవి కాదు. పైగా మనసును ఉల్లాసపరిచేలా ఉంటాయి. తేనీటి విందు సమయంలో అందరూ కూర్చొని ఆ కానుకలను తెరచి చూసుకుంటారు. ఓ క్రిస్మస్ ఈవ్‌కి ప్రిన్స్ హ్యారీ తన నానమ్మకి (క్వీన్ ఎలిజబెత్‌కి) షవర్ క్యాప్‌ని గిఫ్టుగా ఇచ్చారు! షవర్ క్యాప్ అంటే స్నానం చేసేటప్పుడు తలపై షవర్ నీళ్లు పడకుండా పెట్టుకునేది. ఆ క్యాప్‌పైన ‘ఎయింట్ లైఫ్ ఎ బిూూూూ’ అని రాసి ఉంది. దాన్ని చూసి క్వీన్ తన మనవడి తాత్వికతకు మురిపెంగా నవ్వుకున్నారు. కష్టాలు వెంటపడి తరుముతున్నప్పుడు. ‘జీవితం ఏం బాగాలేదు’ అని చెప్పడానికి మొరటుగా వాడే మాట ఇది. హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఇచ్చిన సింగింగ్ హామ్‌స్టర్ (మైకు పట్టుకుని పాట పాడే ఎలుక బొమ్మ) కూడా క్వీన్ ఎలిజబెత్‌ను నవ్వించింది. ఎలిజబెత్ ఏకైక కుమార్తె ప్రిన్సెస్ యాన్ తన అన్న ప్రిన్స్ చార్లెస్‌కి లెదర్ టాయిలెట్ సీట్‌ను కానుకగా ఇచ్చారు. కేట్ మిడిల్టన్ తన మరిది ప్రిన్స్ హ్యారీకి ‘గ్రో–యువర్–ఓన్–గర్ల్‌ఫ్రెండ్’ కిట్‌ను ఇచ్చారు. ఎదిగే ఆడపిల్లలకు ఇచ్చే బొమ్మల కిట్ అది. ఈ నవ్వుల కానుకల సంప్రదాయం గురించి తెలియక ప్రిన్సెస్ డయానా రాజప్రాసాదంలో కొత్త కోడలిగా అడుగు పెట్టిన మొదటి ఏడాది క్రిస్మస్ ఈవ్‌కి ఇంట్లో వాళ్లందరికీ ఖరీదైన కాష్మియర్ స్వెట్టర్లు, (కశ్మీర్ స్వెట్టర్లు కాదు), మెహెయిర్ స్కార్ఫ్‌లు ఇస్తే అందరూ ఆమెను ఆటపట్టించారట. ఈ క్రిస్మస్కి ఎవరు ఎవరికి ఎలాంటి కానుకలు సిద్ధం చేసి ఉంచారో మరి. కింగ్ లిన్స్ స్టేషన్లో రైలు నుంచి దిగుతున్న బ్రిటన్ రాణి ఈసారి కొంచెం లేట్ వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ ఇంకాస్త ముందుగానే శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కి వెళ్లవలసి ఉన్నప్పటికీ ఇటీవలి బ్రిటన్ ఎన్నికల కారణంగా ఆమె ప్రయాణం కొంచెం ముందుకు జరిగింది. ఇప్పుడిక క్రిస్మస్ అయ్యాక కూడా రాణిగారు ఆ ఎస్టేట్‌లోనే మరికొన్ని రోజులు గడిపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు, మనవలు, మునిమనవలు.. అంతా ఒకేసారి, ఒకే చోట ఆనందంగా కలుసుకునేందుకు ఏటా క్రిస్మస్ తనకు ఇచ్చే మహద్భాగ్యాన్ని రాణిగారు అంత తేలిగ్గా ఏమీ విడిచిపెట్టరు అని బ్రిటన్ రాజకుటుంబీకుల వర్తమానాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తుండే బయోగ్రఫర్లు అంటుంటారు. -
'క్వీన్ ఎలిజెబెత్ సారీ చెప్పాలి'
లాహోర్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 క్షమాపణలు చెప్పి తీరాలని పాకిస్థాన్‌లో ఓ హక్కుల కార్యకర్త డిమాండ్ చేశాడు. 1931లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌ను పట్టుకొని ఉరితీసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని అన్నారు. మార్చి 23న భగత్ సింగ్ 85 వర్దంతి సందర్భంగా అతను రెండు ప్రాంతాల్లో భగత్ సింగ్ కు ఘననివాళి అర్పించాడు. ఒకటి భగత్ సింగ్ జన్మ స్థానం అయిన ఫైసలాబాద్‌లోని జరన్ వాలాకు సమీపంలోని బంగా చౌక్ లో నిర్వహించగా మరొక కార్యక్రమాన్ని భగత్ సింగ్‌ను తన అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్‌తో కలిపి ఉరితీసిన షాద్ మాన్ చౌక్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భగత్ సింగ్ అభిమానులు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 'గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్‌ను ఉరితీసినందుకు క్వీన్ ఎలిజెబెత్ -2 తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి' అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి అంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.