ఎలిజబెత్‌ బార్బీ రాణి! | Barbie honors Queen Elizabeth and her Platinum Jubilee | Sakshi
Sakshi News home page

ఎలిజబెత్‌ బార్బీ రాణి!

Apr 28 2022 1:13 AM | Updated on Apr 28 2022 1:13 AM

Barbie honors Queen Elizabeth and her Platinum Jubilee - Sakshi

చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది.

బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్‌ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్‌ ఎలిజబెత్‌ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది.

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌–2 బ్రిటన్‌ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్‌ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్‌ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది.

ఈ ఏడాది ఎలిజబెత్‌ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్‌ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్‌ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున  ఏప్రిల్‌ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్‌ బార్బీని విడుదల చేశారు.

మ్యాటెల్‌ విడుదల చేసిన క్వీన్‌ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్‌ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్‌ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్‌ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్‌–2 కు తన తండ్రి జార్జ్‌–4 ఇచ్చిన పింక్‌ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్‌లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్‌ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్‌ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్‌ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్‌ డిజైన్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ బెస్ట్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement