'క్వీన్ ఎలిజెబెత్ సారీ చెప్పాలి'
లాహోర్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 క్షమాపణలు చెప్పి తీరాలని పాకిస్థాన్లో ఓ హక్కుల కార్యకర్త డిమాండ్ చేశాడు. 1931లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ను పట్టుకొని ఉరితీసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని అన్నారు. మార్చి 23న భగత్ సింగ్ 85 వర్దంతి సందర్భంగా అతను రెండు ప్రాంతాల్లో భగత్ సింగ్ కు ఘననివాళి అర్పించాడు.
ఒకటి భగత్ సింగ్ జన్మ స్థానం అయిన ఫైసలాబాద్లోని జరన్ వాలాకు సమీపంలోని బంగా చౌక్ లో నిర్వహించగా మరొక కార్యక్రమాన్ని భగత్ సింగ్ను తన అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్తో కలిపి ఉరితీసిన షాద్ మాన్ చౌక్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భగత్ సింగ్ అభిమానులు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 'గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ను ఉరితీసినందుకు క్వీన్ ఎలిజెబెత్ -2 తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి' అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి అంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.