మాకు ‘ఆసరా’ ఏదీ!
ధర్పల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్హులైన వారికి పింఛన్లు రద్దు చేశారని సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి మూడు ట్రాక్టర్లలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వందల సంఖ్యలో తరలి వచ్చారు.
కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. పండుటాకులమైన తమకు పింఛన్ ఎం దుకు రద్దు చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వృద్ధులు నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. అర్హులైన వారికి పింఛన్ మంజూరు అయ్యేంత వరకు గ్రామంలో పింఛన్ పంపిణీ చేయనివ్వబోమని వారు తీర్మానించారు. అనంతరం వారందరు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు.
అర్హులైన వారిని గుర్తించి జాబితాను అందించాలని ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓ సూచించారు. పింఛన్ రాని వారందరు మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ధర్నాలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మఠముల శేఖర్, ప్రతినిధి కర్క గంగారెడ్డి, వైస్ ఎంపీపీ నాయిడి విజయ రాజన్న, ఉపసర్పంచ్ బాపురావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామకమిటీ ప్రతినిధులు, వృద్ధులు, వింతతువులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.